గురవింద కేజ్రీవాల్
కాంగ్రెస్ మద్దతుతో తాను ఢిల్లీ రాష్ట్రానికి యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయినట్టే, మే మాసంలో ఆ కాంగ్రెస్ మద్దతుతోనే నిబిడాశ్చర్యం నింపుతూ ప్రధాని పదవిని కూడా చేపట్టవచ్చునన్న భ్రమలో కేజ్రీవాల్ కొట్టుమిట్టాడుతున్నారు.
పత్రికా రచయితలని జైలుకు పంపిన ఆఖరి భారత రాజకీయవేత్త ఇందిరాగాంధీయే. కేవలం ఒక్క పత్రికా రచయితే అని కాదుగానీ, అలా జైలుకు వెళ్లిన వారిలో రామ్‌నాథ్ గోయెంకా యాజమాన్యంలోని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెందిన కులదీప్ నయ్యర్ చాలా ప్రముఖులు. ఆమె తన అధికారాన్ని రక్షించుకోవడానికి 1975లో ఎమర్జెన్సీ విధించి, ఆ కారణాన్ని చూపించే నయ్యర్‌ను కారాగారానికి పంపారు. 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, ఇలాంటి నియంతల పట్ల తమ అభిప్రాయం ఏమిటో భారతీయ ఓటర్లు దీటుగా చెప్పారు.
దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అలాంటి రాజకీయవేత్త - అరవింద్ కేజ్రీవాల్ - వచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక భారీ సంఖ్యలో పత్రికా రచయితలకి జైలు తలుపులు తీయిస్తానని హామీ ఇచ్చారు. ఎందుకంటే భారతీయ పత్రికా రచయితలంతా అమ్ముడు పోయినందుకట. అయితే దర్యాప్తు తరువాతే వాళ్లని జైలుకు పంపుతానని కూడా భరోసా ఇచ్చారు. కానీ తన తీర్పు పట్ల ఎలాంటి సందేహానికీ తావు లేదన్నట్టు, తను విధించబోయే శిక్షలో ఉండే తీవ్రతలో ఎలాంటి రాజీ లేదన్నట్టే చెప్పారు. రాజకీయవేత్తలందరిలాగే వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ తాను అలా అనలేదని యథాప్రకారం కేజ్రీవాల్ అన్నారు.
తనని తాను అతిగా ఊహించుకోవడం ద్వారా వచ్చిన, అదికూడా సౌకర్యంగా ఉండే మరపు రోగంతో కేజ్రీవాల్ బాధపడుతూ ఉండి ఉండాలి. గడచిన డిసెంబర్ మాసం శీతకాల మధ్యాహ్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీలలో వినిపించిన జయజయ ధ్వానాలు, పత్రికల నిండా పరుచుకున్న అభినందన పరంపరలని కేజ్రీవాల్ మరచిపోయారు. ఇప్పుడు ఉన్నదీ ఆ పత్రికా రచయితలే. మీడియా సంస్థల అధిపతులు కూడా అప్పటివారే. ఇక మారినది ఏదీ అంటే లోలోపలి కేజ్రీవాలే. ఆ కేజ్రీవాలే ఇప్పుడు కనిపిస్తున్నాడు.
కేజ్రీవాల్ ఆకాంక్షల స్థాయిలో కాకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చాలా ఇరుకుగా కనిపించడంతో ఆయనలో ఆ మార్పు సంతరించుకోవడం మొదలయింది. కాంగ్రెస్ మద్దతుతో తాను ఢిల్లీ రాష్ట్రానికి యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయినట్టే, మే మాసంలో ఆ కాంగ్రెస్ మద్దతుతోనే నిబిడాశ్చర్యం నింపుతూ ప్రధాని పదవిని కూడా చేపట్టవచ్చునన్న భ్రమలో కేజ్రీవాల్ కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ అంగరంగ వైభవంగా నిర్వర్తించవలసిన బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదన్న నమ్మకంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను భ్రష్టు పట్టించే బృహత్కార్యాన్ని కేజ్రీవాల్ నెత్తికెత్తుకున్నారు. అందుకే పాపం, రాబర్ట్ వాద్రా (రాహుల్ గాంధీ బావగారు) కేజ్రీవాల్ దృష్టి పథం నుంచి నిష్ర్కమించారు. భూ కుంభకోణాల నుంచి రాహుల్‌ను రక్షించిన ఉన్నతోద్యోగి హర్యానాలో కేజ్రీవాల్ పార్టీ ఆమ్ఆద్మీ తరఫు అభ్యర్థి కూడా అయ్యాడు.
కేజ్రీవాల్ ప్రత్యర్థుల వ్యవహారాలలో దుర్భిణీ వేసి చూసినట్టే ఆయన పార్టీలోని జగడాల గురించి కూడా జర్నలిస్టులు అదే ఉత్సుకతతో వెతికారు. ప్రభుత్వేతర సంస్థల విరాళాలు, కేజ్రీవాల్ శిబిరంలోని సీనియర్ల మీద ఆరోపణలకు సంబంధించిన కథనాలు ఉన్నాయి. సచ్ఛీలత గురించి ప్రచారం చేసే పార్టీని ఇలాంటివన్నీ ఇరుకున పెడతాయి. అలాగే మీడియాలో మోడీకి లభిస్తున్న విస్తృత ప్రచారం చూసి కూడా కేజ్రీవాల్ నైరాశ్యానికి గురయ్యారు.
ఎన్నికల వేళ నిగ్రహం ఒత్తిడికి గురౌతూ ఉంటుంది. ఆగ్రహంతో ఉన్న నాయకుడు సమాచార సేకర్తను తుద ముట్టించాలన్న కాంక్షకి లోనవుతూ ఉంటాడు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇలాంటి నిర్ణయానికి రావడం నేరం. వాళ్ల విశ్వసనీయతని వారే దెబ్బ తీసుకోవడం మినహా దీనితో ఒరిగేదేమీ ఉండదు. ఇక్కడే కేజ్రీవాల్ బుర్రకు పదును పెట్టాలి. భారతీయ మాధ్యమాలన్నీ కూడా అమ్ముడు పోతే ఏ ప్రభుత్వానికీ కూడా సమస్యలనేవే ఉండవు. అలాగే ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో, ఏదో ఒక అంశం ప్రాతిపదికగానో భారతీయ మీడియా అంతా ఏకమైపోతోందని నమ్మడం ఇంకా వికృతమైన ఆలోచన.
ఇలా చెప్పడం అంటే భారతీయ మాధ్యమం నిత్యం ఉదయాన్నే పుణ్య తీర్థాలలో స్నానమాచరించాలని కాదు. ‘‘ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్’ (అమ్మకానికి వార్తా స్థలం) బెడద నివారణకు భారత ఎన్నికల సంఘం అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని చర్యలు చేపట్టింది’’ అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ పత్రికా సంపాదకులకి ఒక లేఖ రాశారు. దేశంలో ఉన్న పత్రికా రచయితలంతా లేదా మీడియా సంస్థల అధిపతులంతా దేవతలేమీ కాదు. వార్తా సేకరణకీ, వ్యాపార ప్రకటనల సేకరణకీ మధ్య విభజన రేఖని చెరిపేసినందుకు కొందరిని సత్కరించాలి. కానీ గుజరాత్ ఆర్థిక వ్యవస్థ గురించి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఇచ్చిన వార్తా కథనాలు, విద్యా సంస్థలు ఇచ్చిన వివరాలు ఏవీ కూడా పెయిడ్ న్యూస్ కాదు. ఇలాంటి కథనాలు, వివరాలు ఇవ్వడం ఎన్నికల నేపథ్యంలో మొదలయినది కూడా కాదు.
పత్రికల సంపాదకులకు భారత ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ ప్రతిని కేజ్రీవాల్ పూర్తిగా చదవడం అవసరం. ‘మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడంలో భారత మాధ్యమాలు నిర్వహించిన అసమానమైన పాత్రకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ’నే అంటూ మొదటి పేరాలో ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. అలాగే ‘విశ్వసనీయతకు ప్రతీకగా ఉన్న ప్రతి ఎన్నికల సమయంలోను కూడా కమిషన్ తన బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి సహకరించినందుకు గాను’ కూడా ఆయన మీడియాకు కృతజ్ఞత ప్రకటించారు. భారత మాధ్యమాలు దేశప్రజల మద్దతు కలిగి ఉన్నాయి. ఎందుకంటే, ఏవో కొన్ని సందర్భాలలో రేగిన రచ్చ మినహాయిస్తే, అవి నిర్వర్తించవలసిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాయి.
కేజ్రీవాల్ ఇక్కడ మీడియా మీద గుప్పించిన ఆరోపణలు కొత్త కాదు. ఇతర దేశాలలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఒక అభ్యర్థి విజయాన్ని లేదా అపజయాన్ని గురించి ఆసత్య ప్రచారం నిర్వహించడాన్ని అరికడుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒహియో రాష్ట్రం ఒక చట్టం తీసుకు వచ్చిందని ‘ది ఎకనమిస్ట్’ నివేదించింది. అంటే దీనర్థం అమెరికాకు చెందిన ప్రతి పత్రికా రచయిత దోషి అని కాదు. అబద్ధారోపణలు చేసిన వారి మీద, అలాంటివి ప్రచురించిన వారి మీద మాత్రమే ఆ చట్టం చర్యకు ఆదేశిస్తున్నది. ప్రత్యర్థుల శీల హననమే ధ్యేయంగా రాజకీయవేత్తలు చేస్తున్న ప్రకటనలే అమెరికా ప్రజాస్వామ్యానికి శిలాక్షరాలుగా మారిపోతున్నాయని వాదిస్తూ ఆ దేశ ప్రముఖ వ్యంగ్య రచయిత పీజే ఒరౌర్కే అక్కడి సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ గమనించి ఉండకపోవచ్చు. అవసరమైనప్పుడు కులదీప్ నయ్యర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీక్షణంగా ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
ఎంజే అక్బర్