దేశభక్తులుగా మార్చడమే లక్ష్యం
వనపర్తి టౌన్ : కోట్లాది మంది వీరుల త్యాగఫలంగా సిద్ధించిన స్వాంత్య్రానికి భంగం వాటిల్లే ప్రమాదకారుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి పౌరుడిని చిత్తశుద్ధి కలిగిన దేశభక్తుడిగా మార్చడమే ఏబీవీసీ లక్ష్యం అని ఏబీవీపీ క్షేత్రీయ సంఘటన కార్యదర్శి రాంమోహన్‌జీ అన్నారు. శనివారం పట్టణంలో రెండు రోజులపాటు జరిగే విభాగ్ అభ్యాస వర్గ (సైద్ధాంతిక శిక్షణ తరగతుల) సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా.. ఉద్యమాల నిర్మాణం వైపు ముందుకు సాగుతుందన్నారు. విద్యా వ్యవస్థలో విలువల పెంపునకు ఏబీవీపీ పాత్ర అమోఘమన్నారు. అంబేద్కర్ పేరుతో కమ్యూనిస్టులు రాజకీయాలు చేస్తూ మహానుభావుడి ఆశయాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ.. మరోపక్క వ్యక్తి నిర్మాణంతో సమాజ నిర్మాణాభివృద్ధికి ఏబీవీపీ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఖరేందర్నాథ్, జిల్లా కన్వీనర్ భరత్‌చంద్ర, నగర కార్యదర్శి వంశీ, జిల్లా మాజీ అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు.