రామోజీ ఫిల్మ్ సిటీ కార్మికుల ధర్నా
జీవో 63పై స్టే ఎత్తివేతకు డిమాండ్
హైదరాబాద్: జీవో 63పై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రామోజీ ఫిల్మ్ సిటీ కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్యం, ప్రధానకార్యదర్శి జి.సైదులు మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన జీవోపై యాజమాన్యం రిట్ పిటిషన్ మేరకు 2013లో హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. ఏడాది గడిచినా ఇంతవరకు ప్రభుత్వ ప్లీడర్ కౌంటరు దాఖలు చేయలేదని, కోర్టు విచారణలకు కూడా హాజరుకావడం లేదని వాపోయారు.
ఈ నెల 14న కేసు విచారణకు రానున్నదని, కోర్టుకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ప్లీడర్పై చర్యలు తీసుకునేలా చూడాలని కార్మికశాఖ అధికారులను కోరారు. కార్మికులు 18 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసవేతనం రూ.10 వేలకు మించి ఇవ్వడం లేదని, యూనియన్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్మికులను బలవంతంగా రిటైర్ చేయించడం, అక్రమంగా తొలగించడం, దూరప్రాంతాలకు బదిలీ చేయడం వంటి వేధింపులకు యాజమాన్యం పాల్పడుతోందని ఆరోపించారు.