సీరియల్స్‌కు సినిమాకు తేడా అదే : దర్శకుడు
సీరియల్స్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వారు దర్శకుడు, టెక్నీషియన్లు ఎవరనేది పట్టించుకోరు. కానీ ప్రతి రోజు మా సీరియల్ చూస్తారు. సినిమా అలా కాదు. ఒక్క హిట్ పడిందంటే చాలు మంచి ఫాలోయింగ్, పేరు వస్తుంది. సీరియల్‌కు ఉన్నన్ని కష్టాలు సినిమాకు ఉండవు’అని దర్శకుడు రాము కోన అన్నారు. పలు సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాము.. `రుద్రంకోట`అనే సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇది అతనికి తొలి సినిమా. సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాము తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► నేను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా `పద్మవ్యూహం`సీరియల్ కు కొన్ని రోజులు పని చేశాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా మానేశాను. ఇలా కాదని మద్రాసు వెళ్లాను. అక్కడ మిత్రుడి ద్వారా డైరక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్ కు అసిస్టెంట్ డైరక్టర్ చేరాను. అలా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నా. ఆ తర్వాత ప్రామ్టర్ గా కొన్ని సీరియల్స్ కు పని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అన్ని మేజర్ టీవీ ఛానల్స్ లో హిట్ సీరియల్స్ డైరక్ట్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఎపిసోడ్స్ డైరక్ట్ చేశాను. ఆ సమయంలోనే `రుద్రంకోట` సినిమా డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది.
► రుద్రంకోట దగ్గర జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాము. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రం. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అండర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుంది.
► ఇందులో లీడ్ రోల్ లో సీనియర్ నటి జయలలిత గారు నటించారు. కోటమ్మ పాత్రలో తను నటించిన తీరు అద్భుతం. అలాగే హీరోగా రుద్ర నటించాడు. తనకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా నటించాడు. అమ్మాయిలంటే గిట్టని పాత్రలో తను ఒదిగిపోయాడు. అలాగే హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది.
► జయ లలిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత గారితో నేను చాలా సీరియల్స్ కు పని చేశాను. ఆ అభిమానంతో నేను తన పేరు సమర్పకురాలిగా వేసుకున్నాను. జయలలిత గారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు.
► దర్శకుడు గా నాకు ఆదర్శం రాజమౌళి గారు. ఆయన కూడా మొదట `శాంతి నివాసం` అనే సీరియల్ చేసారు. ఆ తర్వాత సినిమాలు డైరక్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చాను.