ధోని ఇంటిపై రాళ్ల దాడి
రాంచీ: సొంత మైదానంలో నిన్న జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో నిరాశ చెందారు. దీంతో కోపోద్రిక్తులయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ధోని ఇంటిపై రాళ్లు విసిరారు. స్థానిక హార్మూ హౌసింగ్ కాలనీలో ఉన్న ధోని ఇంటిపై బుధవారం రాత్రి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే దాడి జరిగిన సమయంలో ధోని కుటుంబ సభ్యులు జేఎస్సీఏ అంతర్జాతీయ మైదానంలో మ్యాచ్ చూస్తున్నారు.
ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్యఛేదనను ఆరంభించిన భారత్ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ధోని, కోహ్లి, ధావన్ బ్యాటింగ్ చూడాలని మ్యాచ్కు వచ్చామని, వర్షం కారణంగా డబ్బుతో పాటు కీలక ఆట కోల్పోయామని అభిమానులు వాపోయారు.