కూలిన సినిమా హాల్ పైకప్పు
జీడిమెట్ల: సినిమా థియేటర్లో సీలింగ్ పై కప్పుకు మరమ్మతు చేస్తూ ఓ యువకుడు కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. సినిమా చూస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. జీడిమెట్ల ఎస్సై వెంకటరాజ గౌడ్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా ఎన్సాన్పల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి(23) షాపూర్‌నగర్‌లో ఉంటూ రంగ థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం మార్నింగ్ షో ప్రారంభమైంది. తరచూ వర్షపు నీరు థియేటర్ పై నుంచి చుక్కలు చుక్కులుగా రూ.20ల టికెట్ ప్రాంతంలోని సీట్లపై పడుతోంది.
ఈ విషయంపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదు అందండంతో ఆపరేటర్ కరుణాకర్‌రెడ్డి సీలింగ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పై నుంచి పట్టుతప్పి థియేటర్ లోపల పడ్డాడు. అదే సమయంలో సీలింగ్ అట్టలు కూలి సినిమా చూస్తున్న రోడామిస్త్రీనగర్కు చెందిన మహ్మద్ ఇతియాస్(15), శ్రీనివాస్(23), బహదూర్‌పల్లి శివరాం(25), రంగారెడ్డినగర్‌కు చెందిన సత్యనారాయణ (31)లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కరుణాకర్ రెడ్డిని షాపూర్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడిని నుంచి నగరంలో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.