ranganadha temple
-
వేడుకగా తిరుచ్చి ఉత్సవం
నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలోని శ్రీదేవి, దేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామికి సంప్రదాయబద్ధంగా బంగారుతిరుచ్చి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి శాస్త్రోక్తంగా విశేషపూజలు జరిగాయి. ఉత్సవాన్ని ఆలయ పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, దేవస్థానం కార్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. -
చట్టపరంగా రంగడి ఆస్తుల స్వాధీనం
రంగనాథస్వామి ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలో కొలువైన తల్పగిరి రంగనాథస్వామికి సంబంధించి నెల్లూరు ఏసీ సెంటర్లో ఉన్న 1.43ఎకరాల భూమిని చట్టపరంగా స్వాధీనం చేసుకోనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన రంగనాథస్వామి ఆలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఆలయ భూమికి సంబంధించిన 99 ఏళ్ల లీజు గడువు అక్టోబరు 6తో ముగియనున్నట్లు తెలిపారు. ఆలయ భూమిలో 43 మంది ఆక్రమణదారులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సెప్టంబర్ 17న ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లీజు గడువు ముగియగానే ప్రభుత్వ సహకారంతో ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 2 నుంచి నవరాత్రి ఉత్సవాలు రంగనాథస్వామి ఆలయంలో 2 నుంచి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంచికంటి సుధాకర్‌రావు తెలిపారు. విజయ దశమి రోజున పేట ఉత్సవం జరుపనున్నట్లు తెలిపారు. మొదటి శుక్రవారం ముత్యాలచీరలో, విజయదశమి రోజున బంగారు చీరలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు చింతగుంట మంగమ్మ, కాకరపర్తి జగన్మోహన్రావు, చుండి జగన్మోహన్, గాదంశెట్టి చంద్రశేఖర్‌రావు, వొమ్మిన జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన
నెల్లూరు(బృందావనం): శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో మంగళవారం బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు సామూహిక లక్ష కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు, నిషింద సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక కృష్ణస్తోత్రం, లక్ష్మీఅష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామార్చన జరిగింది. తొలుత స్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. దేవస్థాన పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. -
‘పెన్నమ్మ’కు పంచహారతులు
నెల్లూరు(బృందావనం): శ్రావణ పౌర్ణమి, కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని పవిత్ర పినాకిని నదికి పంచహారతులు(మహాహారతి) కార్యక్రమాన్ని గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీతల్పగిరి క్షేత్రంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పెన్నమ్మకు ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కర్పూరహారతి, ఏకహారతి, కుంభహారతి, ఘటహారతి, పంచహారతిని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, శ్రీతల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, పాలకమండలిసభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రంగనాథుడి నామస్మరణతో పెన్నానది తీరం పులకించింది. ఎన్నో ఏళ్లక్రితం నిలిచిపోయిన పినాకినినది మహా హారతి కార్యక్రమాన్ని దేవస్థానం నూతన పాలక మండలి చేపట్టడం సర్వజన శుభప్రదమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో నదుల అనుసంధానంతో పవిత్ర గోదావరి, కృష్ణా, పెన్నానదుల సంగమం జరుగుతుందన్నారు. పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు మాట్లాడుతూ పవిత్ర శ్రావణ పౌర్ణమినాడు కృష్ణాపుష్కరాల సమయంలో కృష్ణానదీజలాలు పెన్నానది జలాలతో కలవడం అదే సమయంలో పెన్నమ్మకు తమ ఆలయ అర్చకుల సూచనలు, సలహాల మేర కు మహాహారతి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కళాకారుడు గుండాల గురవయ్య ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. గుండాల గురవయ్యను మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకర్, పాలకమండలి సభ్యులు సత్కరించారు. -
తల్పగిరి రంగనాథుడిని దర్శించుకున్న విదేశీ భక్తులు
నెల్లూరు(బందావనం): నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీదేవి,భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామిని శనివారం విదేశీభక్తులు దర్శించుకున్నారు. ఇస్కాన్ దుబాయ్(దామోదర్ దేశ్) వర్కర్ క్యాంప్ కో–ఆర్డినేటర్ జగన్నాథదాస్ పర్యవేక్షణలో లండన్, కెనడా, బంగ్లాదేశ్, దుబాయ్‌కు చెందిన 96మంది, దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మరో 50మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శించేందుకు విచ్చేశారు. ఇందులో భాగంగా నెల్లూరులో రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఫొటో