'ఆడపిల్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే పోరాడా'
నూజివీడు:నెల్లూరు ట్రాఫిక్ ఎస్సై రంగనాథ్ గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తనకు సగం న్యాయం మాత్రమే జరిగిందని అతని వల్ల మోసపోయిన యువతి రజియా సుల్తానా వెల్లడించింది. రంగనాథ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఐజీ పి.సునీల్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రజియా నూజివీడులో స్పందించింది. అతడికి కోర్టులో శిక్ష పడినప్పడే తనకు పూర్తి న్యాయం జరిగినట్లు భావిస్తానని స్పష్టం చేసింది. తాను న్యాయం కోసం ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం చేసినట్లు తెలిపారు.
ఆ క్రమంలో రంగనాథ్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. కేసును వదిలి రాజీకి రావాలని లేకుంటే చంపేస్తానని బెదిరించాడని అయిన తాను బెదరలేదన్నారు. రూ. 10 లక్షల నగదుతోపాటు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడని అయిన అందుకు లొంగలేదని చెప్పింది. ఆడపిల్లను మోసం చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలనే తాను రంగనాథ్ విషయంలో పోరాటం చేసినట్లు వివరించింది. పోలీసు డిపార్ట్మెంట్ పరంగా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు రజియా పేర్కొన్నారు.
గతంలో గుంటూరు జిల్లా పొన్నూరులో రంగనాథ్ గౌడ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రజియా సుల్తానా అనే యువతి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసు నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళ సంఘాలనేతలతో కలసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
దాంతో పోలీసు ఉన్నతాధికారులు రంగనాథ్ గౌడ్‌పై విచారణకు ఆదేశించారు. రంగనాథ్ గౌడ్ పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా పని చేశారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. దాంతో విధుల నుంచి తొలగించాలని ఐజీ పి.సునీల్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు రంగనాథ్ గౌడ్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగనాథ్ గౌడ్ నెల్లూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే.