స్త్రీ స్వేచ్ఛ అంటే?
ఇతర రచనల్ని కూడా చూస్తే, తప్పుల్ని దిద్దిన మార్గాలూ, దిద్దలేని మార్గాలూ, తప్పుల్ని మరింత అభివృద్ధి చేసిన మార్గాలూ, అన్నీ కనపడతాయి. అసలు, ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనే ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘‘స్వేచ్ఛ’’ అన్నప్పుడు ఇది ఏ మనిషికైనా ఒకటే కదా? పురుషుడి స్వేచ్ఛలోనే తప్పులు వుంటే, ఆ తప్పులే స్త్రీకి ఎందుకు?
వేల వేల సంవత్సరాల నించీ సమాజంలో మంచి చెడ్డలూ, తప్పొప్పులూ ఉంటూనే ఉన్నాయి. ‘మంచి’ శాశ్వతంగా నిలబడుతుంది. చెడ్డే, తప్పే, రక రకాలుగా మారుతుంది. తప్పుల్లో మార్పులూ, సంస్కరణలూ కూడా జరుగుతూ వున్నాయి. ఈ విషయాల్ని రచనల్లో తేలిగ్గా చూడగలం. అవి మత కధలైనా, నాస్తిక గ్రంధాలైనా, తాత్విక గ్రంధాలైనా, సాంఘిక రచనలైనా. సమాజం నిండా తప్పొప్పులు ఈ నాటికీ వున్నాయి.
సాహిత్యాన్ని మాత్రమే తీసుకుంటే, రచయితలు ఏయే రకాలుగా ఉంటారు? (1) సమాజం అద్భుతంగా వుంది! ‘తప్పు’ని చూడలేరు. తప్పు కూడా ఒప్పే. అది అలాగే కొనసాగాలి. ఇంకా అదే అభివృద్ధి చెందాలి కూడా!- ఇది ఒక అవగాహన! (2) ‘తప్పు’ని చూడగలగడం! దాన్ని తీసి వేసే ప్రయత్నం! (3) ‘తప్పు’ని తెలుసుకోగలరు. బాధితుల మీద నిర్మలమైన కరుణ చూపుతారు. తప్పుని సంస్కరించలేరు. (4) ‘తప్పు’ తెలుస్తుంది. సంస్కరించే ఉత్సాహం, ఉద్రేకం, వుంటాయి. ఒక తప్పుని ఇంకో తప్పులోకి మారుస్తారు. (5) ‘తప్పు’ని పూర్తిగా నిర్మూలించగల మార్గం తెలుస్తుంది. ఇది, కేవలం సంస్కరణ కాదు. విప్లవమే! ఇక ఆ తప్పు ఉండదు. సమాజంలో లక్ష తప్పులు సాగుతూనే వున్నాయి. కొన్నిటిని విడి విడిగా సంస్కరించడం సాధ్యం. కొన్నిటికి పైపై దిద్దుళ్ళతో సంస్కరణలు అసాధ్యం.
మన చుట్టూ వున్న రచనల్లో కనపడే ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ గురించి, ఆ రచయితల భావాలు ఎలా వున్నాయో క్లుప్తంగా చూడవచ్చు.
వీరేశలింగం గారు, ‘‘బాల వితంతువు’’ అనేది తప్పు అని గ్రహించగలిగారు. దాని సంస్కరణ ప్రారంభించారు. దాన్ని వ్యతిరేకించిన మూర్ఖులూ వున్నారు. అయినా ఆ సంస్కరణ, ఆ తప్పుని తిరస్కరించగలిగింది.
గురజాడ, ‘‘వృద్ధుడితో బాలిక సంబంధం తప్పు’’ అని గ్రహించారు. దాన్ని సంస్కరించే ప్రయత్నం రచన ద్వారా చేశారు.
ఉన్నవ లక్ష్మీనారాయణ, తన ‘మాలపల్లి’లో కులాల పట్ల కొన్ని మంచి విషయాలు రాసి వుండవచ్చు. కానీ ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనేది పెద్ద తప్పు మాట అయినట్టూ, ‘‘స్వేచ్ఛ’’ వుంటే స్త్రీలు పిల్లల్ని వదిలేసి ‘లేచిపోతారు’ అన్నట్టూ, ఒక ప్రధాన స్త్రీ పాత్రని చూపిస్తాడు. ఒకామె మరిదితో వెళ్ళిపోయి, పశ్చాత్తాపంతో ఇంటికొచ్చి, భర్త పాదాలమీద పడి క్షమాపణ కోరి మరణిస్తుంది.
అడవి బాపిరాజు, తన ‘నారాయణరావు’ నవలలో, పెళ్ళి అయిన స్త్రీ, భర్తని వదిలి ఒక యువకుడితో వెళ్ళిపోయి, అక్కడి నించి ఇంకో యువకుడితో పోతుంది. మొదటి యువకుడు, ‘‘స్త్రీని, సాంప్రదాయం నించి తప్పిస్తే, విచ్చలవిడిగా తిరుగుతుంది’’ అని గ్రహించి, ఆ తప్పు చేశానని ఆత్మహత్య ! స్త్రీకి ఈ సాంప్రదాయం! పురుషుడికి ఇంకో సాంప్రదాయం!
విశ్వనాథ సత్యన్నారాయణ, తన ‘చెలియలి కట్ట’లోనూ, ‘వేయి పడగలు’లోనూ చూపిన అవగాహన, ‘‘స్త్రీ స్వేచ్ఛ అంటే తిరుగుడే!’’ అన్నగారి భార్యా, మరిదీ, లేచిపోయి, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి, ఆ వూరి సముద్రంలో ఇద్దరూ ఆత్మహత్యలు! వేయి పడగల్లో ఒక ఉత్తమ పురుషుడికే నాలుగు వర్ణాల స్త్రీలు నలుగురు భార్యలూ, వేశ్యా! కులాల్ని సమానం చేసేశాడీ రచయిత. మరణించిన భార్య ఆత్మ, ఒక బాలికని ఆవహించిందని, ఆ బాలికతో వృద్ధుడి పెళ్ళి! ఇది సమాజంలో ఉన్న క్రూరత్వాలన్నిటినీ అభివృద్ధి చేయడం!
అనేక మంది రచయితల దృష్టిలో ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అంటే శారీరక సంబంధాల దృష్టే ! దాన్నే స్త్రీ కోరుతుందని!
చలం అయితే తన సమకాలీన రచయిత లందర్నీ తిరస్కరించాడు. ‘‘స్వేచ్ఛ’’ అంటే, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం వంటి విషయాలు అనేకం చెప్పినప్పటికీ, ప్రధానంగా స్త్రీ పురుషు లిద్దరికీ మధ్య తాత్కాలిక ప్రేమలనే చెప్పాడు. ఇది సమస్యను అవక తవకగా దిద్దబోవడమే.
ఇక ఈ నాటి బూర్జువా స్త్రీల ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ని చూస్తే, తిరుగుడికి హక్కులూ, వ్యభిచారానికి హక్కులూ! ‘‘పురుషుడి హక్కులన్నీ మాకూ కావాలి!’’ పురుషుడి హక్కులన్నీ తప్పు- అని గ్రహించకుండా, పురుషుడి తప్పుల్ని అనుసరించడం ! పురుషుడే గురువు!
‘దేవదాసు’ రచయితని చూద్దాం. ఈ నవలలో మూడు అద్భుత విషయాలు చెప్పాడు రచయిత. (1) జమీందారి ధనిక కుటుంబానికీ పేద కుటుంబానికీ వుండే వైరుధ్యం.
(2) స్త్రీ ఆత్మగౌరవం. ప్రేమ కన్నా, తన ఆత్మగౌరవం గొప్పది. ‘నీ కేనా తండ్రి వున్నది, నాకు లేడా?’’ అంటుంది. ప్రేమికుడు చూపిన నిర్లక్ష్యానికి అతన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది.
(3) నిజమైన ప్రేమ, తాత్కాలికమైనదిగా అంతరించదు. దిద్దుకోవడానికి సాధ్యం కాని తప్పు జరిగితే, దానికి దుఃఖం తప్ప వేరే దారి వుండదు. - ఈ రచయిత సమాజంలో వున్న తప్పుల్ని గ్రహించాడు. ఒక ‘ఫలానా తప్పు’ని దిద్దుకోవడం సాధ్యం కాదు - అని చెప్పడం అంటే అది పెద్ద హెచ్చరిక!
ఇతర రచనల్ని కూడా చూస్తే, తప్పుల్ని దిద్దిన మార్గాలూ, దిద్దలేని మార్గాలూ, తప్పుల్ని మరింత అభివృద్ధి చేసిన మార్గాలూ, అన్నీ కనపడతాయి. అసలు, ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనే ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘‘స్వేచ్ఛ’’ అన్నప్పుడు ఇది ఏ మనిషికైనా ఒకటే కదా? పురుషుడి స్వేచ్ఛలోనే తప్పులు వుంటే, ఆ తప్పులే స్త్రీకి ఎందుకు? పురుషుడి స్వేచ్ఛలో తప్పులే తిరస్కరించాలి కదా?
‘‘కార్మిక స్త్రీల స్వేచ్ఛా దినంగా’’ ఒక దినాన్ని గుర్తించడం అంటే, పురుష కార్మికుల హక్కులు స్త్రీ కార్మికులకు లేకపోవడం వల్ల! స్త్రీ పురుషులకు ఇద్దరికీ సమానంగా వుండవలసినవి ఏమిటి? బాధ్యతలూ, హక్కులూ! ఆ విషయాల్లో సమానత్వానికి ఎవరైనా ఎందుకు వ్యతిరేకించాలి? వ్యతిరేకించే వాళ్ళకి, దాని వల్ల ఏదో లాభం వుంటుంది. ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అన్నప్పుడు, స్త్రీ - పురుషులు ఒకే హక్కులతో, ఒకే బాధ్యతలతో లేరని అర్ధం వస్తుంది. కానీ స్త్రీలందరూ మాత్రం ఒకే హక్కులతో, ఒకే బాధ్యతలతో వున్నారా? ఒక పెట్టుబడిదారుడి భార్యా, ఒక రోడ్లు ఊడ్చే కార్మికురాలూ ఒకే స్తితిలో వున్నారా? అలాంటప్పుడు ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనేది అర్ధరహితమైన మాట! ‘‘కార్మిక స్త్రీ స్వేచ్ఛ’’ అంటే, దాని అర్ధం వేరు! అది కార్మిక స్త్రీలకు ఉండే ప్రత్యేక సమస్యల గురించి !
-రంగనాయకమ్మ