ఎయిర్ ఇండియాకు ఫోరం మొట్టికాయ
రంగారెడ్డి జిల్లా కోర్టులు: సేవలో లోపం ఉందంటూ ఎయిర్ ఇండియా సంస్థకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేస్తూ ఫిర్యాదుదారుడికి లక్ష రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పింది. వివరాలు.. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహననగర్‌లో నివాసముండే విఠల్‌రావు 2012 జూలై 11న హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానంలో న్యూజెర్సీకి వెళ్లేందుకు రెండు టికెట్లను బుక్ చేసుకుని భార్యతో పాటు వెళ్లాడు.
వారికి సంబంధించిన రెండు లగేజీలు న్యూజెర్సీ ఎయిర్‌పోర్టులో దిగగానే సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు అందజేయలేదు. ఆ లగేజీలో విలువైన పత్రాలతో పాటు మెడికల్‌కు సంబంధించిన పత్రాలు, మెడిసిన్స్, విలువైన వస్త్రాలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులకు ఫిర్యాదు చేశారు. సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ఫిర్యాదుదారు విఠల్‌రావు ఎయిర్‌లైన్స్ సేవలో లోపం ఉందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం అధ్యక్షులు గోపాలకృష్ణమూర్తి, మహిళా సభ్యురాలు ప్రశాంతిలు పైవిధంగా తీర్పు చెప్పారు.