‘రంగస్థలం’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగస్థలం
జానర్ : పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా
తారాగణం : రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : బి. సుకుమార్
నిర్మాత : నవీన్ ఎర్నెనీ, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. చరణ్‌తో పాటు సుకుమార్ కూడా తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి ఈ సినిమా చేశాడు. ఇన్నాళ్లు కమర్షియల్ స్టార్‌గా మాత్రమే ప్రూవ్ చేసుకున్న రామ్‌చరణ్, ఈ సినిమాతో నటుడిగానూ మరో మెట్టు ఎక్కాలని భావిస్తున్నాడు. వెండితెరపై లెక్కల మాస్టర్‌గా పేరున్న సుకుమార్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తన చిన్ననాటి అనుభవాలతో 80ల నాటి కాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నంలో సుకుమార్ విజయం సాధించాడా..? నటుడిగా ప్రూవ్ చేసుకోవాలన్న చరణ్ కల నెరవేరిందా..? కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకులను ఆకట్టుకుందా..?
కథ :
రంగస్థలం 1980ల కాలంలోని ఓ గ్రామం. ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) ఆ గ్రామ ప్రెసిడెంట్. 30 ఏళ్లుగా గ్రామాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తుంటాడు. ఆ ఊళ్లో పొలాలు తడపడానికి మోటర్ పెట్టే కుర్రాడు చిట్టిబాబు (రామ్ చరణ్). వినికిడి లోపంతో ఇబ్బంది పడే చిట్టిబాబు, రామలక్ష్మీ(సమంత)ని చూసి ఇష్టపడతాడు. దుబాయ్ లో ఉద్యోగం చేసే చిట్టిబాబు సోదరుడు కుమార్ బాబు( ఆది పినిశెట్టి) ఏడాది తరువాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. (సాక్షి రివ్యూస్)అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. కానీ గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వారంత చనిపోయారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో అని భయపడతాడు. అనుకున్నట్టుగానే కుమార్ బాబును కూడా చంపేస్తారు. కానీ చనిపోయే ముందు కుమార్ బాబు, చిట్టిబాబుతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్ బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు..? కుమార్ బాబు చావుకు ప్రెసిడెంటే కారణమా..? ఈవిషయాలను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
సినిమా అంతా చిట్టిబాబు, కుమార్ బాబు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. చిట్టిబాబుగా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇన్నాళ్లు కమర్షియల్ మాస్ పాత్రల్లోని కనిపించిన చెర్రీ, చాలెంజిగ్ రోల్స్ లోనూ మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. వినికిడి లోపంతో చరణ్ ఇబ్బంది పడే సన్నివేశాల్లో చరణ్ నటన నవ్వుల పూయిస్తుంది. సినిమాలో హాస్యాన్ని పండించే బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు చరణ్. (సాక్షి రివ్యూస్)లుక్ లో విషయంలోనే కాదు యాస, భాషల విషయంలో కూడా క్యారెక్టర్ కోసం చరణ్ తీసుకున్న శ్రద్ధ తెరమీద ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో సరదాగా కనిపించిన చరణ్, సెకండ్ హాఫ్‌లో బరువైన ఎమోషన్స్ ను పలికించి ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో చరణ్ నటన చాలా సన్నివేశాల్లో కంటతడిపెట్టిస్తుంది.
కుమార్ బాబుగా ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. సినిమా అంతా హుందాగా కనిపించిన ఆది.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో సూపర్బ్ అనిపించాడు. సమంత రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. గతంలో ఎన్నాడూ కనిపించినంత మాస్ పాత్రలో కనిపించిన సామ్ చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో కట్టిపడేసింది. తన పదవి కోసం ఏమైనా చేసే క్రూరమైన ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు మంచి విలనిజం పండించాడు. (సాక్షి రివ్యూస్)జగపతి బాబు ఆహార్యం కూడా పాత్రకు తగ్గట్టుగా ఉంది. వెండితెర మీద మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్న అనసూయకు రంగస్థలంలో ఆ ఛాన్స్ దక్కింది. రంగమ్మత్తగా కీలక పాత్రలో కనిపించిన అనసూయ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించింది. ఇతర పాత్రలో ప్రకాష్ రాజ్, నరేష్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ :
ఎవరికీ అర్థం కానీ కథనంతో ఇబ్బంది పెడతాడన్న అపవాదు సుకుమార్ మీద ఉంది. అందుకే రంగస్థలం సినిమా మొదలైనప్పుడే ఈ సినిమాలో అలాంటి ప్రయోగాలేవి చేయటం లేదని, ఈ సినిమాలో లెక్కల పాఠాలేవి ఉండవని చెప్పేశాడు సుకుమార్. రంగస్థలం.. సుకుమార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నమైన సినిమా. 1980ల నాటి కాలాన్ని వెండితెర మీద రీక్రియేట్ చేస్తూ సుక్కు చేసిన ప్రయత్నం సూపర్బ్. (సాక్షి రివ్యూస్)ప్రతీ ఫ్రేమ్‌లో ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు చిత్ర యూనిట్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. పూర్తిగా ప్రేక్షకులను దాదాపు 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడంలో సుకుమార్ టీం సక్సెస్ అయ్యింది.
పల్లెటూరి ప్రజల సమస్యలు అక్కడి రాజకీయ పరిస్థితులు, పగలు ప్రతీకారాలతో పాటు మనుషుల్లోని అమాయకత్వం, మంచితనాన్ని కూడా తెర మీద చాలా బాగా ఆవిష్కరించాడు సుకుమార్. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. కామెడీతో పాటు యాక్షన్, కాస్త రొమాన్స్, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాను తెరకెక్కించాడు. అయితే తను అనుకున్న కథను సుదీర్ఘంగా చెప్పిన సుకుమార్ అక్కడక్కడా కాస్త విసిగిస్తాడు.
ఇక సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం. 80ల నాటి కథకు తగ్గ బాణీలతో సినిమా రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచేశాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలోనూ ఏ మాత్రం కమర్షియల్ వాల్యూస్ తగ్గకుండా సూపర్బ్ సాంగ్స్ తో అలరించాడు. (సాక్షి రివ్యూస్)నేపథ్యం సంగీతంతోనూ ఆడియన్స్ ను ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు దేవీ. తన శైలికి పూర్తి భిన్నంగా ప్రయత్నించిన దేవీ శ్రీ ప్రసాద్ ఆకట్టుకున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 1980ల నాటి కాలాన్ని తెర మీదకు ఆవిష్కరించేందుకు నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రధారుల నటన
కథ
ఎమోషనల్ సీన్స్
సినిమాటోగ్రఫి
సంగీతం
మైనస్ పాయింట్స్ :
కొన్ని సాగదీత సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్