2నిమిషాల్లోనే ముగిసిన మున్సిపల్ సమావేశం
ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ముగిసింది. సోమవారం ఉదయం మున్సిపల్ చైర్పర్సన్(టీఆర్ఎస్) రంగినేని మనీషా అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. తర్వాత ఆమె ఎజెండాను చదివి ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే అధికార పార్టీ కౌన్సిలర్లతోపాటు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కేవలం రెండు నిమిషాల్లోనే జరిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు యత్నించిన కమిషనర్ వెంకటేశంను ప్రతిపక్షాల సభ్యులు అడ్డుకున్నారు.
మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో రూ.4 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు నిలదీయటానికి సంసిద్ధమై ఉన్న నేపథ్యంలోనే మున్సిపల్ చైర్పర్సన్ సమావేశాన్ని ఆదరాబాదరాగా ముగించారని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.