రాణి పద్మిని వాడిన చారిత్రక అద్దాలు బద్దలు
చిత్తోర్‌గఢ్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా ఆయన చిత్ర బృందంపై దాడి చేసిన కర్నిసేనా అనే గ్రూపు తిరిగి మరోసారి దాడికి పాల్పడింది. రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన కోటలో నాటి రాణి పద్మిని ఉపయోగించిన అద్దాలను ధ్వంసం చేసింది. పద్మిని ప్యాలెస్‌లో ఉన్న రెండు పెద్ద చారిత్రక అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాదు, స్వయంగా ఆ దాడిని తామే చేశామని ప్రకటించుకోవడమే కాకుండా ఆ అద్దాలను పూర్తి తొలగించాలని తాము పాలన వర్గాన్ని డిమాండ్ చేస్తున్నామని, వాటి ద్వారా తమ ప్రముఖ రాణి చరిత్రను హీనంగా చెబుతున్నారని మండిపడ్డారు.
పద్మిని మహల్‌లోని గతంలో పద్మిని ఉన్న గదిలో రెండు పెద్ద అద్దాలు ఎదురెదురుగా ఉన్నాయి. తన భర్త రాణా రతన్ సింగ్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ అద్దాల్లోనే అందాల రాణి పద్మినిని నాటి ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి చూపించారని అక్కడికి వచ్చిన పర్యాటకులకు టూరిస్టు గైడ్లు చెబుతుంటారు. గొప్ప చరిత్ర కలిగిన తమ వారసురాలిని ఇలాంటి కట్టుకథలతో తప్పుబడుతున్నారని, అందుకు ఈ అద్దాలను ఉపయోగించుకుంటున్నారని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని పగులగొట్టినట్లు దాడికి పాల్పడినవారు చెబుతున్నారు. ఇదే గ్రూపు గతంలో సంజయ్ లీలా బన్సాలీపై ఆయన చిత్ర బృందంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.