దేశంలోనే అతి పెద్ద గాంధీ కంచు విగ్రహం
విగ్రహం ఏర్పాటుకు నేడు భూమిపూజ
శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి
సాక్షి,బెంగళూరు: బెంగళూరులోని విధానసౌధ, వికాససౌధ భవనాల మధ్య ఖాళీ స్థలంలో ఇరవై ఏడు అడుగుల ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శాసనమండలి అధ్యక్షుడు డీ.హెచ్ శంకరమూర్తి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద దైన ఈ విగ్రహం ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ జరగనుందన్నారు.
విధానసౌధలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధాన్య భంగిమలో కూర్చున్న 27 అడుగుల గాంధీ విగ్రహాన్ని 13 అడుగుల ఎత్తయిన పీఠంపై ప్రతిష్టించనున్నామన్నారు. దాదాపు 24 టన్నుల బరువున్న విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన రాంసుతార్ ఆర్ట్ క్రియేషన్స్ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందిస్తోందన్నారు.
ఢిల్లీలోని పార్లమెంటులో ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహంతో పాటు దేశ విదేశాల్లో గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత ఈ కంపెనీకు ఉందన్నారు. విగ్రహాన్ని ఢిల్లీలో రూపొందించి విడిభాగాల రూపంలో బెంగళూరుకు తీసుకువస్తారన్నారు. ఆపై వీటిని అతికించి పూర్తి విగ్రహాన్ని తయారు చేస్తారని వివరించారు.
విగ్రహం తయారీకి రూ.7.25 కోట్లతో సహా మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.11 కోట్లని శంకరమూర్తి వివరించారు. విగ్రహం పీఠం ముందు వైపు 7.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పుతో భారత స్వతంత్ర సంగ్రామ ఇతి వృత్తం కలిగిన కంచు ఫలకను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు. రానున్న గాంధీ జయంతి (అక్టోబర్-2) రోజున విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని శంకరమూర్తి తెలిపారు.