ఈ గెలుపు బళ్లారి జిల్లా ప్రజలకు అంకితం
జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా
బళ్లారి లోక్సభ అభ్యర్థి బీ.శ్రీరాములు
సాక్షి, బళ్లారి : నా గెలుపు బళ్లారి జిల్లా ప్రజలకు అంకితం ఇస్తున్నానని బళ్లారి లోక్సభ మెంబర్గా గెలుపొందిన బీ.శ్రీరాములు అన్నారు. ఆయన శుక్రవారం బళ్లారిలోని రావ్ బహదూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగిపోయి దేశాన్ని తిరోగమనంలోకి నెట్టిందన్నారు.
యూపీఏ పాలనపై విసిగిపోయిన ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి కంకణం కట్టుకుని ఆ దిశగా మంచి విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బళ్లారి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. బళ్లారి జిల్లా ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
బళ్లారి జిల్లాలోని తుంగభద్ర డ్యాం పూడికతీతకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన బళ్లారి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. అన్ని మతాలు వారు తన గెలుపునకు సహకరించారని గుర్తు చేశారు.
ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలోని మంచినీటి సమస్యతోపాటు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాన న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ అధ్యక్షుడు రుద్రగౌడ, న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, జెడ్పీ సభ్యుడు రాజశేఖరగౌడ తదితరులు పాల్గొన్నారు.