breaking news
Rare Earth Magnet
-
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్‌ను విశ్వసనీయమైన హబ్‌గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు. సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్ మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు. -
ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరత వాహన తయారీదారులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోని వారికి తీవ్ర సంకటంగా మారింది. దీనికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్భాగమైన రేర్ ఎర్త్ అయస్కాంతాలను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి.ఈవీ ఉత్పత్తిపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినిచ్చే అధిక పనితీరు మోటార్లకు రేర్-ఎర్త్ అయస్కాంతాలు అవసరం. ఇవి వాహనం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పదార్థాలకు సంబంధించి భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా భారీగా దిగుమతి చేసుకునే రేర్-ఎర్త్ రకాలపై ప్రపంచ సరఫరాలో 80% పైగా నియంత్రించేది చైనానే. ఈ దేశం అక్కడి అవసరాలకు భారీగా వినియోగిస్తుంది. ఈ సరఫరా గొలుసు అంతరాయం ఆటోమోటివ్ పరిశ్రమ అంతటా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో భారతీయ ఓఈఎంలు ఒత్తిడికి గురవుతున్నాయి.చైనాకు దరఖాస్తులురేర్ ఎర్త్ అయస్కాంతాల స్థిరమైన సరఫరా కోసం భారత ఆటోమొబైల్ కంపెనీలు చైనాకు 30కి పైగా దరఖాస్తులను సమర్పించాయి. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం ఎటువంటి దరఖాస్తులు ఇంకా ఆమోదించలేదు. సరఫరా ఎప్పుడు పునప్రారంభమవుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాం’ అని తెలిపారు.ప్రత్యామ్నాయాల వైపు అడుగులురేర్-ఎర్త్ అయస్కాంతాల సంక్షోభం తీవ్రతరం కావడంతో వీటిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఓఈఎంలు ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అవసరాలు అధికమవుతున్నాయి. సిరామిక్ అయస్కాంతాలు, గ్రాఫీన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, నానో స్ఫటిక పదార్థాలు, సింథటిక్ మెటిరియోరైట్ అయస్కాంతాలు, ఐరన్ నైట్రైడ్ సూపర్ అయస్కాంతాలు వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటి సామూహిక ఉత్పత్తికి వాణిజ్యపరంగా ఆచరణీయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని ప్రిమస్ పార్టనర్స్ సలహాదారు అనురాగ్ సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: యాపిల్‌కు ట్రంప్ వణుకు?మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొరతను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంఅండ్ఎం ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ..‘వచ్చే త్రైమాసికానికి రేర్-ఎర్త్ అయస్కాంతాల స్థానంలో తేలికపాటి రేర్-ఎర్త్ ప్రత్యామ్నాయాలు వాడుతాం. ఈమేరకు చర్యలు ప్రారంభించాం’ అని చెప్పారు.