సరిహద్దు రక్షణకు ప్రత్యేక ప్రార్థనలు..!
రాజస్థాన్ బిజేపి ప్రభుత్వం దేశ రక్షణకు ఆధ్యాత్మికతను జోడించింది. సర్జికల్ దాడుల నేపథ్యంలో 'రాష్ట్ర రక్ష యజ్ఞ' పేరిట సరిహద్దు దళాలకోసం 21 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజే సూచనల మేరకు శత్రువుల నుంచి దేశ రక్షణ కోసం రాజస్థాన్ సంస్కృత అకాడమీ గురువారం ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని శ్రీ మాతేశ్వరీ టెనోట్ రాయ్ ఆలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
జైసల్మేర్ లో నెలవైన దేవాలయంలో జరుగుతున్న రాష్ట్ర రక్ష యజ్ఞానికి వసుంధరా రాజేతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ యజ్ఞం భాగంగా అకాడమీ ఇప్పటికే రాష్ట్రంలోని సుమారు 26 వేద విద్యాలయాల్లో దేశ శాంతికోసం ప్రత్యేక శ్లోక పఠనాది కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు నవరాత్రులు పూర్తయ్యేవరకూ కొనసాగించనుంది. శ్లోక పఠనంలో అకాడమీకి చెందిన సిబ్బంది సహా సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని ముక్తకంఠంతో శ్లోకాలను పఠిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం పాల్గొని సరిహద్దుల్లోని దళాలు, ప్రజల రక్షణకోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సహా కేంద్ర హోం మంత్రి ఈ యజ్ఞం పాల్గొనే అవకాశం ఉన్నట్లు అకాడమీ డైరక్టర్ రాజేంద్ర తివారి సైతం తెలిపారు. మన పురాతన గ్రంథాలు, శ్లోకాల ఏకీకృత పఠనంవల్ల విశ్వశక్తిని లభిస్తుందని, ఈ శక్తిని మన సైనికులకు అందించి, శత్రువులనుంచి రక్షణతోపాటు, జయాన్నిపొందవచ్చని రాజస్థాన్ సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ జయదేవ్ చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఈ శ్లోక పఠనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మన సనాతన పరంపరగా వస్తున్నఆచారమని అన్నారు. పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా బ్రాహ్మణులు వారి రక్షణకోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేవారని ఉదహరించారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సైన్యానికి అన్ని విధాలుగా అండదండలను అందించి, వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో భాగస్వాములు కావాలన్నసందేశాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించేందుకు అకాడమీ దుర్గా సప్తశతిని కూడా పారాయణ చేస్తున్నట్లు వెల్లడించారు.