రాహుల్ మాట్లాడుతున్నాడు!
అందుకు చాలా సంతోషంగా ఉంది!
► రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ ఎద్దేవా
► నోట్ల రద్దును విమర్శించడం ఉగ్రవాదుల చొరబాట్లకు పాక్ సాయమందించడంతో సమానం!
► పేదరికాన్ని వారసత్వంగా ఇచ్చారంటూ మన్మోహన్ సింగ్‌పై ధ్వజం
వారణాసి: సహారా, బిర్లా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ప్రధాని మోదీ వ్యంగ్యంగా స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీలోని ఆ యువ నాయకుడు ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాడని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉంద’ని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్నట్లే.. విపక్షాలు అవినీతి పరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు పాక్ సహకరించడంతో సమానమన్నారు. నోట్లరద్దు వల్ల నల్లధనంతో పాటు నల్ల మనసున్నవాళ్లూ బయటపడ్డారన్నారు.
నవంబర్ 8 ప్రకటన తర్వాత తొలిసారిగా సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ.. బనారస్ హిందూ వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘నోట్లరద్దు అమలు, తదనంతర పరిణామాలపై సరైన చర్యలు తీసుకోలేదని చాలామంది విమర్శిస్తున్నారు. అన్ని సమస్యలు ముందుగానే ఊహించాను కానీ.. రాజకీయ పార్టీల నాయకులు నిస్గిగ్గుగా అవినీతిపరులకు అండగా నిలుస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.
తప్పులను బయటపెట్టుకుంటున్నారు
పేదరికం, నిరక్షరాస్యత, సరైన విద్యుత్ సదుపాయాలు లేకుండా నగదురహిత ఆర్థిక వ్యవస్థ నిష్ఫలమంటూ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్, పి.చిదంబరంలు వ్యాఖ్యానించటంపైనా ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇన్నాళ్లూ వీరు దేశానికి ఏం చేశారో (కనీస అవసరాలు కల్పించటంలో విఫలమయ్యారు) బయటపెట్టుకుంటున్నారన్నారు. ‘వ్యక్తిగతంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ ఇమేజ్ ఉన్నా.. భారీ కుంభకోణాలు బయటపడింది ఆయన హయాంలోనే. రెండుసార్లు ప్రధానిగా, ఓసారి ఆర్థికమంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. 1970 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పదవుల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేదరికం గురించి మాట్లాడటం హాస్యాస్పదం’అని మోదీ అన్నారు.
సరైన విద్యుత్ వసతుల్లేని దేశంలో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి.. పదేళ్లలో దేశంలో కనీసం విద్యుత్ లైన్లు వేయాలని గుర్తులేదా అని ప్రశ్నించారు. అంతకుముందు, వారణాసిలో మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బెనారస్ హిందూవర్సిటీలో జరుగుతున్న ‘రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం’ను ప్రధాని ప్రశంసించారు. చాణక్య నాటకాన్ని వేసేందుకు వచ్చిన విద్యార్థులతో మోదీ సంభాషించారు. ‘ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి. పోయాయి. కానీ చాణక్యుడు, అతని ఆలోచన ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని మోదీ అన్నారు.
అనంతరం యూపీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ప్రధాని కాన్వాయ్ పైకి ఓ యువకుడు కరపత్రం విసిరిన ఘటనతో వారణాసిలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ‘మోదీ మీ వారణాసి పర్యటనను వ్యతిరేకిస్తున్నాం’ అని కరపత్రంలో ఉంది. అయితే పోలీసులు తేరుకునేలోపే ఆ యువకుడు తప్పించుకున్నాడు.
నిరాశతోనే మోదీ వ్యాఖ్య: మాయావతి
విపక్షాలను పాకిస్తాన్ తో పోల్చటం ద్వారా ప్రధాని తన నిరాశ, నిసృ్పహలను బయట పెట్టుకున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. నోట్లరద్దు కారణంగా ప్రజల ఇబ్బందులపై ప్రశ్నిస్తే.. ప్రధాని ఇలా విమర్శించటం ఆక్షేపణీయమన్నారు.
ఆయన మాట్లాడకుంటేనే భూకంపం
‘వాళ్ల పార్టీలో ఓ యువనాయకుడున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసంగాలివ్వటం నేర్చుకుంటున్నాడు. ఈయన మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచీ నా ఆనందానికి అవధుల్లేవు. ఈమధ్య ఆయన తను మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. కానీ ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వస్తుంది. ఆయన మాట్లాడారు కదా.. ఇప్పుడా ప్రకృతి విపత్తు వచ్చే అవకాశం లేదని మేం భరోసా ఇవ్వగలం’ అని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ వ్యగ్యంగా విమర్శించారు. దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నందున ఆన్ లైన్ లావాదేవీలు అసాధ్యమంటూ రాహుల్ చేసిన ప్రకటన పైనా ప్రధాని స్పందించారు.
‘చదవటం, రాయటం తెలిసిన వారందరినీ నిరక్షరాస్యులుగా మార్చేందుకు నేను చేతబడి చేయిస్తానని కూడా రాహుల్ అంటారనుకుంటా’ అని ఎద్దేవా చేశారు. ‘మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవటం కూడా రాని వ్యక్తి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని దశాబ్దాలుగా చేసిన దాన్ని ఎలా అర్థం చేసుకోగలరు’ అని మోదీ విమర్శించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కొన్నిరోజులు ఓపిగ్గా ఉండాలని మోదీ కోరారు.