వృధాగా ఉన్న వ్యవసాయ పరికరాలు
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం రాయితీపై ఇచ్చే వ్యవసాయ పరి కరాలను వినియోగించుకొని ఉత్పత్తులు సాధించవచ్చని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు వినియోగంలోకి రాక వృధాగా ఉన్నా యి. 2006-07లో రాష్ట్రీయ సమ వికాస్ యోజన ద్వారా ఇక్రిశాట్ నిధులతో వంద శాతం రాయితీపై అల్లీపూర్‌కు రూ.5లక్షలకు పైగా విలువైన వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం సరఫరా చెసింది.
వీటిలో మూడు పవర్‌స్ప్రేయర్స్, ఒక మక్కల నూర్పిడి యంత్రం, మూడు ఎడ్లబండ్లు, వాటి విడిభాగాలు, నాలుగు గిరకలు, నాలుగు నాగళ్లు, రెండు పవర్‌పంపులు ఉన్నాయి. ఇటీవలే కొత్తగా మరో మూడు విత్తనాలు, మందులు వేసే పరికరాలు వచ్చాయి. వీటిని అల్లీపూర్ పంచాయతీ ఆవరణలో ఉంచారు. వాటిని వినియోగించకపోవడంతో అవన్ని వృధాగా ఉన్నాయి. వ్యవసాయ పరికరాల వినియోగానికి సంబంధించి మూడేళ్ల కిందట కమిటీ ఎర్పాటు చేసినా సమావేశాలు నిర్వహించలేదు.
మక్కల నూర్పిడి పరికరాన్ని ఇప్పటి వరకు వాడలేదు. అసలు యంత్రాన్ని వినియోగించే అవగాహన కూడా కల్పించలేదని రైతులు వాపోయారు. అలాగే మూడు ఎడ్లబండ్ల పరికరాలు ఉన్నప్పటికి ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు.
ఈ విషయమై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పరికరాల నిర్వహణ బాధ్యతను సంబంధించి గ్రామ పంచాయతీలు చూసుకోవాలన్నారు. సలహాలు, సూచనలు మాత్రమే తమ శాఖ ఇస్తుందన్నారు.