నాణ్యమైన ఉత్పత్తులతోనే మేక్ ఇన్ ఇండియా
తణుకు టౌన్: నాణ్యమైన వస్తు ఉత్పత్తుల ద్వారానే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాగా అవుతుందని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొఫెసర్ ఆర్.సుదర్శనరావు అన్నారు. తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాల అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మేక్ ఇన్ ఇండియా ఉపాధి అవకాశాలు–సవాళ్లు’ అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సులో రెండో రోజు గురువారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సరళీకరణ విధానాలతో ఉత్పాదక రంగం అభివృద్ధి చెందడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన అన్నారు. ఇందుకు వ్యవసాయ రంగంలో వాటా కూడా పెరగాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక రంగంలో ప్రోత్సాహం లభించినా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడే మేక్ ఇండియా సవాళ్లను ఎదుర్కొనగలమని చెప్పారు. ఎస్డీ కళాశాల డైరెక్టర్ జె.చంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించనిదే మేక్ ఇన్ ఇండియా సాధ్యం కాదన్నారు.
విదేశీ పెట్టుబడులతో సందేహస్పదమే..
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ చీఫ్ ఎడిటర్ పీవీ రమణ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో 1947 నుంచి 2016 వరకూ ఎంత వృద్ధి సాధించామని పరిగణనలోకి తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులతో మేడ్ ఇన్ ఇండియా సాధిస్తామనేది సందేహస్పదమేనన్నారు. ప్రిన్సిపాల్ పి.అరుణ, కన్వీనర్ కె.రాధాపుష్పావతి, కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్, బి.నాగపద్మావతి, రాజులపూడి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లిన రాజేంద్రప్రసాద్, ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, యూనివర్సిటీలకు చెందిన రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు పాల్గొన్నారు