వి‘చిత్ర’ నోము!
తణుకు : చిత్రగుప్తుడిని ప్రసన్నం చేసుకునేందుకు నోములు నోచే ఆచారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ప్రాంతంలో ఉండడం విశేషం. రెడ్డి, బ్రాహ్మణ, కాపు, వైశ్య, గవర కులస్తులు రథసప్తమి రోజు నుంచి చిత్రగుప్తుడి నోములు నిర్వహిస్తుంటారు. వెదురు తవ్వలో బియ్యం, వెదురుతో చేసిన పెట్టెలో పసుపు, అల్లీఅల్లని బుట్టలో ధాన్యం నింపి వాటిలో పూజా సామగ్రి నింపి శుక్రవారం చిత్రగుప్తుని నోములు ప్రారంభించారు.
అత్తిలి మండలం ఈడూరులో తులసి కోటవద్ద తొలుత ఆవు పిడకలను వెలిగించి, దానిపై పాల పొంగలి వండి ప్రసాదం తయారు చేశారు. దేవుడి నిర్దేశిత పూజా ద్రవ్యాలతో పాటు వెదురు పెట్టె, బంగారు గంటం, వెండి ఆకును ఉంచి.. పురోహితుల సాయంతో నోమును పూర్తి చేశారు. పురోహితుడు నోము నోచిన వారి పేరు గోత్రాన్ని వెండి ఆకుపై బంగారపు గంటంతో రాస్తారు. ఇలా రాయడం వల్ల చిత్రగుప్తుడి చిట్టాలో అతడి నోమును నోచుకున్నట్టు నమోదవుతుందని, తద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం.