Ration system
-
ఏపీ ఆదర్శంగా కేరళలోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: ఏపీలోని రేషన్ డోర్ డెలివరీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్æ కొనియాడారు. 85 శాతం మందికి ఇంటింటికీ బియ్యం పంపిణీ ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. కేరళలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన ఆయన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులతో కలిసి.. వాహనాల ద్వారా రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు అనంతరం కేరళ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నేరుగా పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఆంధ్రా నుంచి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్టు తెలిపారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్, రేషన్ పంపిణీ వ్యవస్థల వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం గర్వకారణమన్నారు. సుమారు 65 లక్షల మందికి ఫించన్లు ఇచ్చే కార్యక్రమం ఐదారు గంటల్లోనే పూర్తి చేసే సామర్థ్యం ఏపీలో ఉందన్నారు. కార్యక్రమంలో కేరళ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సాజిత్ బాబు, ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, డైరెక్టర్ ఢిల్లీరావు, పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్ తదితరులున్నారు. -
తెలంగాణలో ఎక్కడ నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ను తీసుకునే వీలుగా పలు మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి నిత్యావసర వస్తువులను ఎక్కడి నుంచైనా ( పోర్టబిలిటీ) తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి ఆనంద్ తెలిపారు. రేషన్ తీసుకోకపోయినా కార్డును రద్దుచేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. దీని ద్వారా రాష్ట్రంలోని 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలుగనుంది. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కమిషనర్ తెలిపారు. -
ఆప‘రేషన్ బినామీ’
అడ్డగోలు దందా.. జిల్లాలో గాడితప్పిన రేషన్ వ్యవస్థ బినామీల చేతుల్లో దుకాణాలు అవినీతిలో అధికారులకు వాటా ‘సాక్షి’ సర్వేలో వెలుగుచూసిన వాస్తవాలు జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ గాడి తప్పింది. నిత్యావసర సరుకులు బినామీ, ఇన్చార్జీల గుప్పిట్లో చిక్కి.. ఆహార భద్రత మిథ్యగా మారింది. వీళ్లు కన్ను గీటితేనే సరుకులందుతాయి. అధికారులు కదులుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర్నుంచి ఉన్నతాధికారి వరకు బినామీలకు చుట్టాలే. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో, 5 మున్సిపాల్టీల్లో, 3 నగర పంచాయితీల్లో ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించింది. అందులో వెలుగుచూసిన వాస్తవాలు.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్వర్క్ : జిల్లాలోని 1860 రేషన్ దుకాణాల్లో దాదాపు 40 శాతం బినామీలు, ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించిం ది. ప్రతి మండలం, మున్సిపాల్టీ, నగర పంచాయితీల్లో కనీసం 2 రేషన్ దుకాణాలకు తగ్గకుండా 175 దుకాణాలను పరిశీలించింది. డీలర్లకు తెలియకుండా వినియోగదారుల నుంచి వివరాలను సేకరించింది. ప్రభుత్వ నివేదికల్లో అం తా సవ్యంగా సాగుతున్నట్టున్నా.. పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకొన్న అవి నీతి బయటపడింది. బినామీల రాజ్యం, వారితో అంటకాగుతున్న అధికారుల గుట్టు రట్టయింది. చూడ్డానికి చిల్ల ర దందాగానే కనిపిస్తున్నా ఒక్కో అవి నీతి రూపాయిని పోగేస్తే రూ కోట్లలో కుంభకోణం జరుగుతోంది. పల్లెల్లో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉండగా.. అధికారులు 55 పోస్టులు ఖాళీగా పెట్టి ఇన్‌చార్జీలకు అప్పగించ డం దీనికి పరాకాష్ట. సగటున ప్రతి మూడు దుకాణలకు ఒక బినామీ డీలర్ ఉన్నట్టు తేలింది. రెవెన్యూ అధికారులకు తెలిసే ఈ బినామీ దందా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉండాల్సినవి 6 వేలు.. జిల్లాలో 1066 పంచాయతీలు, 580 శివారు గ్రామాలు, దాదాపు 199 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మొత్తం 30.34 లక్షల మంది ప్రజలు ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి 500 మందికి ఒక రేషన్ దుకాణం ఉండాలి. అర్బన్ ప్రాంతంలో 800లోపు జనాభాకు ఒక దుకాణం చొప్పున ఉండాలి. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కనీసం 6 వేల రేషన్ దుకాణాలు అవసరం. కానీ 1841 దుకాణాలు మాత్రమే ఉన్నాయి (తాజాగా 23 దుకాణాలు మంజూరైనా.. వాటిని ఇంకా నడపటం లేదు). దీంతో ప్రతి రేషన్ దుకాణం వద్ద రద్దీ ఎక్కువైపోతోంది. దీనికి తోడు రేషన్ డీలర్ నెలలో కేవలం 10 రోజులే దుకాణం తెరవడం, అందునా నాలుగైదు గంటలకు మినహాయించి సరుకులు ఇవ్వకపోవడంతో జనం రేషన్ తీసుకోవడానికి ఒకేసారి ఎగబడుతున్నారు. ఈ రద్దీని తట్టుకుని నిలబడలేక కనీసం 7 నుంచి 10 శాతం మంది ప్రజలు సరుకులు తీసుకోకుండానే వెనుదిరిగిపోతున్నట్లు తేలింది. తనిఖీలు అంతంతే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే, అదీ తూతూ మంత్రంగా రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న రేషన్‌కార్డుల నెంబర్లు నమోదు చేసుకొని కార్డు యజమానితో మాట్లాడినట్టుగా, పంపిణీ అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగా నివేదిక తయారు చేసి దాని మీద ఒక వేలిముద్ర తీసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చిన రోజునే ఒక్కో డీలర్ తన స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టచెబుతారని అంచనా. గ్రామంలో రెవెన్యూ సదస్సులప్పుడు డీలరే భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు. చిన్నాచితక ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా అధికారులు డీలర్‌నే పురమాయిస్తున్నారు. ఇక అధికారులు వచ్చిపోయేటప్పుడు దారి ఖర్చులు, డీజిల్ ఖర్చులు డీలర్లే భరిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే డీలర్లపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మచ్చుకివి.. ► జిల్లాలో పాతవి 1,841 రేషన్ దుకాణాలుండగా, ఈ ఏడాది కొత్తగా 23 మంజూరయ్యాయి. మొత్తం 1,860 దుకాణాలున్నాయి. ► 55 దుకాణాలు ఇన్చార్జీల అజమాయిషీలో ఉన్నాయి. 475 దుకాణాలు బినామీల గుప్పిట్లో నడుస్తున్నాయి. ► భార్యల పేరిట ఉన్న 500 దుకాణాల్లో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. ►{Vేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్చెరు మండలంలో 59 దుకాణాలున్నాయి. వీటిలో పటాన్చెరు పట్టణంలో 16 ఉండగా మిగిలినవి గ్రామాల్లో ఉన్నాయి. ఈ 59లో 14 దుకాణాలు బినామీలవే.. ► జిన్నారంలో 45 డీలర్‌షిప్‌లకు గాను 10 షాపులు బినామీలతో నడుస్తున్నాయి. ► రామచంద్రాపురంలో 38 డీలర్‌షిప్‌లలో 11 బినామీలున్నాయి. ► నారాయణఖేడ్ నియోజవర్గంలోని 70 శాతం దుకాణాల్ని బినామీలే నడిపిస్తున్నారు. ► మెదక్ పట్టణంలోని 20 రేషన్ షాపుల్లో ఆరు బినామీల చేతిలోనే ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన దుకాణాలు అగ్రవర్ణ సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. ► వైకల్యం ఉన్న వారికి కేటాయించిన 39 దుకాణాలను సైతం ఇతరులు హస్తగతం చేసుకున్నారు. ► {పజాప్రతినిధులుగా ఉన్న వారు తమ దుకాణాల్ని ఇతరులకు అప్పగించారు. మహిళల పేరిట ఉన్నవీ ఇతరులే నిర్వహిస్తున్నారు. -
పస్తుల పండగ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ జిల్లాలోని పేదలు పండగ పూట పస్తులుండాల్సి వచ్చింది. అస్తవ్యస్తంగా రేషన్ వ్యవస్థ ఉండడం, ఆహార భద్రత కార్డుల పంపిణీ గందరగోళంగా మారడంతోపాటు రేషన్‌షాపులను కనుక్కోవడం కూడా కష్టతరం కావడంతో సంక్రాంతి పండగ పూట జిల్లా పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందలేదు. అన్నీ సవ్యంగా ఉన్న చోట్ల కూడా చక్కెర లేకపోవడం, గందరగోళం ఉన్న చోట్ల కనీసం బియ్యం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండాపోయింది. మనిషికి ఆరుకిలోల బియ్యం మాట దేవుడెరుగు... కనీసం గింజ బియ్యం కూడా పేదలకు అందని దుస్థితి నెలకొంది. కొన...సాగుతున్న ప్రక్రియ వాస్తవానికి గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తయారుచేసి వాటికి అనుగుణంగా జిల్లాలోని పేదలకు రేషన్‌కార్డులను పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ కార్డులు వచ్చిన వారందరికీ జనవరి 1 నుంచి రేషన్‌సరుకులు ఇస్తామని చెప్పింది. అయితే, ఆహారభద్రత కార్డుల జారీ ప్రక్రియ జిల్లాలో కొంత గందరగోళానికి దారి తీసింది. అర్హులు, అనర్హుల పేరిట కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వం ఒకటికి, రెండు సార్లు నిబంధనలు మార్చడంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం కూడా జిల్లా యంత్రాంగానికి కష్టతరంగానే మారింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా యంత్రాంగం సకాలంలో ఆహార భద్రత కార్డులిచ్చేందుకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. తద్వారా జనవరి1న ప్రారంభమైతే అయింది కానీ ఆహారభద్రత కింద రేషన్ సరుకులు ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. విశేషమేమిటంటే... అసలు తమకు ఏ డీలర్ రేషన్ సరుకులిస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో లబ్ధిదారులు రేషన్‌షాపుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యవహారం చాలా గందరగోళంగా మారింది. కార్డు తీసుకుని పాత డీలర్ దగ్గరకు వెళితే మీ నంబర్ మా దగ్గర లేదని, వేరే షాపుకు వెళ్లాలని డీలర్ చెప్పడంతో పేదలు నిరాశతో వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితులు జిల్లాలో చాలా చోట్ల జరిగాయి. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో అయిపోలేదు. తమకు కార్డులు ఎందుకు ఇవ్వరంటూ మళ్లీ దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. పండగ ముందు పేదలకు సరుకులు ఇచ్చేయాలన్న కోణంలోనే జిల్లా యంత్రాంగం మరింత శ్రద్ధ పెట్టి పనిచేసి ఉంటే కొంత ఉపశమనం ఉండేదనే భావన సర్వత్రా వినిపిస్తోంది. మిర్యాలగూడ, ఆలేరు, భువనగిరి, హుజూర్‌నగర్‌లలో చక్కెర లేదంట వాస్తవానికి ఆహార భద్రత కింద జిల్లాలోని 9.3లక్షల కుటుంబాలకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల్లో పేర్లున్న వారందరికీ మనిషికి ఆరుకిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన దాదాపు 20వేల మెట్రిక్‌టన్నుల బియ్యం కావాల్సి ఉంది. ఈ బియ్యాన్ని గోదాములకు, రేషన్‌షాపులకు చేర్చినా కార్డుల జారీలో ఉన్న గందరగోళం కారణంగా చాలా మందికి బియ్యం చేరలేదు. ఇక, జిల్లాలో కొన్ని చోట్ల చక్కెర పంపిణీ చేయగా, మరికొన్ని చోట్ల అసలు చక్కెర ఊసే లేదు. వాస్తవానికి ప్రతి కార్డుపై అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, కిలో గోధుమపిండి, కిలో గోధుమలు ఇవ్వాల్సి ఉంది. మిగిలినవి ఎలా ఉన్నా పండగ పూట జిల్లాలోని రేషన్‌కార్డుదారులందరికీ కనీసం బియ్యం, చక్కెర పూర్తిస్థాయిలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ , ఆలేరు, భువనగిరి, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అస్సలు చక్కెర కూడా పంపిణీ చేయలేదు. మిగిలిన చోట్ల కూడా కొన్ని మండలాల్లో పంపిణీ అయితే, మరికొన్నిచోట్ల చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత శ్రమించి పండగ పూట పేదలకు రేషన్ సరుకులు అందించి ఉండాల్సి ఉందని, తమకు సరుకులు ఇవ్వకపోవడంతో పండగ పూట నిరాశకు గురయ్యామని పేదలు వాపోతున్నారు. స్పష్టంగా ఆదేశాలిచ్చాం- జేసీ సత్యనారాయణ పండగ పూట అందరికీ రేషన్ సరుకులు ఇవ్వాలని స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఈ మేరకు గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ షాపులకు సరుకులు కూడా చేరిపోయాయి. అయితే, కొన్నిచోట్ల... ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో షాపులను గుర్తించే సమస్య ఎదురవుతోంది. దీనిపై ఈ నెల 16 నుంచి 20 వరకు టాంటాం చేయమన్నాం. ఏ షాపు ఎవరికి కేటాయించారో స్పష్టంగా చెప్పాలని ఆదేశాలిచ్చాం. 20 తర్వాత సరుకులు అందని పేదలకు కచ్చితంగా జనవరి నెల రేషన్ అందజేస్తాం.