ఆప‘రేషన్ బినామీ’ | Benami in the hands of the shops | Sakshi
Sakshi News home page

ఆప‘రేషన్ బినామీ’

Published Wed, May 20 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

Benami in the hands of the shops

అడ్డగోలు దందా..

జిల్లాలో గాడితప్పిన రేషన్ వ్యవస్థ
బినామీల చేతుల్లో దుకాణాలు
అవినీతిలో అధికారులకు వాటా
‘సాక్షి’ సర్వేలో వెలుగుచూసిన వాస్తవాలు

 
 జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ గాడి తప్పింది. నిత్యావసర సరుకులు బినామీ, ఇన్‌చార్జీల గుప్పిట్లో చిక్కి.. ఆహార భద్రత మిథ్యగా మారింది. వీళ్లు కన్ను గీటితేనే సరుకులందుతాయి. అధికారులు కదులుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర్నుంచి ఉన్నతాధికారి వరకు బినామీలకు చుట్టాలే. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో, 5 మున్సిపాల్టీల్లో, 3 నగర పంచాయితీల్లో ఏకకాలంలో సాక్షి నెట్‌వర్క్ ఒక సర్వే నిర్వహించింది. అందులో వెలుగుచూసిన వాస్తవాలు..
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్‌వర్క్ : జిల్లాలోని 1860 రేషన్ దుకాణాల్లో దాదాపు 40 శాతం బినామీలు, ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి నెట్‌వర్క్ ఒక సర్వే నిర్వహించిం ది. ప్రతి మండలం, మున్సిపాల్టీ, నగర పంచాయితీల్లో కనీసం 2 రేషన్ దుకాణాలకు తగ్గకుండా 175 దుకాణాలను పరిశీలించింది. డీలర్లకు తెలియకుండా వినియోగదారుల నుంచి వివరాలను సేకరించింది. ప్రభుత్వ నివేదికల్లో అం తా సవ్యంగా సాగుతున్నట్టున్నా.. పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకొన్న అవి నీతి బయటపడింది. బినామీల రాజ్యం, వారితో అంటకాగుతున్న అధికారుల గుట్టు రట్టయింది.

చూడ్డానికి చిల్ల ర దందాగానే కనిపిస్తున్నా ఒక్కో అవి నీతి రూపాయిని పోగేస్తే రూ కోట్లలో కుంభకోణం జరుగుతోంది. పల్లెల్లో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉండగా.. అధికారులు 55 పోస్టులు ఖాళీగా పెట్టి ఇన్‌చార్జీలకు అప్పగించ డం దీనికి పరాకాష్ట. సగటున ప్రతి మూడు దుకాణలకు ఒక బినామీ డీలర్ ఉన్నట్టు తేలింది. రెవెన్యూ అధికారులకు తెలిసే ఈ బినామీ దందా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

 ఉండాల్సినవి 6 వేలు..
 జిల్లాలో 1066 పంచాయతీలు, 580 శివారు గ్రామాలు, దాదాపు 199 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మొత్తం 30.34 లక్షల మంది ప్రజలు ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి 500 మందికి ఒక రేషన్ దుకాణం ఉండాలి. అర్బన్ ప్రాంతంలో 800లోపు జనాభాకు ఒక దుకాణం చొప్పున ఉండాలి. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కనీసం 6 వేల రేషన్ దుకాణాలు అవసరం. కానీ 1841 దుకాణాలు మాత్రమే ఉన్నాయి (తాజాగా 23 దుకాణాలు మంజూరైనా.. వాటిని ఇంకా నడపటం లేదు).

దీంతో ప్రతి రేషన్ దుకాణం వద్ద రద్దీ ఎక్కువైపోతోంది. దీనికి తోడు రేషన్ డీలర్ నెలలో కేవలం 10 రోజులే దుకాణం తెరవడం, అందునా నాలుగైదు గంటలకు మినహాయించి సరుకులు ఇవ్వకపోవడంతో జనం రేషన్ తీసుకోవడానికి ఒకేసారి ఎగబడుతున్నారు. ఈ రద్దీని తట్టుకుని నిలబడలేక కనీసం 7 నుంచి 10 శాతం మంది ప్రజలు సరుకులు తీసుకోకుండానే వెనుదిరిగిపోతున్నట్లు తేలింది.

 తనిఖీలు అంతంతే..
 పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే, అదీ తూతూ మంత్రంగా రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న రేషన్‌కార్డుల నెంబర్లు నమోదు చేసుకొని కార్డు యజమానితో మాట్లాడినట్టుగా, పంపిణీ అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగా నివేదిక తయారు చేసి దాని మీద ఒక వేలిముద్ర తీసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చిన రోజునే ఒక్కో డీలర్ తన స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టచెబుతారని అంచనా.

గ్రామంలో రెవెన్యూ సదస్సులప్పుడు డీలరే భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు. చిన్నాచితక ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా అధికారులు డీలర్‌నే పురమాయిస్తున్నారు. ఇక అధికారులు వచ్చిపోయేటప్పుడు దారి ఖర్చులు, డీజిల్ ఖర్చులు డీలర్లే భరిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే డీలర్లపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.
 
 మచ్చుకివి..
► జిల్లాలో పాతవి 1,841 రేషన్ దుకాణాలుండగా, ఈ ఏడాది కొత్తగా 23 మంజూరయ్యాయి. మొత్తం 1,860 దుకాణాలున్నాయి.
► 55 దుకాణాలు ఇన్‌చార్జీల అజమాయిషీలో ఉన్నాయి. 475 దుకాణాలు బినామీల గుప్పిట్లో నడుస్తున్నాయి.
► భార్యల పేరిట ఉన్న 500 దుకాణాల్లో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు.
►{Vేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్‌చెరు మండలంలో 59 దుకాణాలున్నాయి. వీటిలో పటాన్‌చెరు పట్టణంలో 16 ఉండగా మిగిలినవి గ్రామాల్లో ఉన్నాయి. ఈ 59లో 14 దుకాణాలు బినామీలవే..
► జిన్నారంలో 45 డీలర్‌షిప్‌లకు గాను 10 షాపులు బినామీలతో నడుస్తున్నాయి.
► రామచంద్రాపురంలో 38 డీలర్‌షిప్‌లలో 11 బినామీలున్నాయి.
నారాయణఖేడ్ నియోజవర్గంలోని 70 శాతం దుకాణాల్ని బినామీలే నడిపిస్తున్నారు.
► మెదక్ పట్టణంలోని 20 రేషన్ షాపుల్లో ఆరు బినామీల చేతిలోనే ఉన్నాయి.
► ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన దుకాణాలు అగ్రవర్ణ సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి.
► వైకల్యం ఉన్న వారికి కేటాయించిన 39 దుకాణాలను సైతం ఇతరులు హస్తగతం చేసుకున్నారు.
► {పజాప్రతినిధులుగా ఉన్న వారు తమ దుకాణాల్ని ఇతరులకు అప్పగించారు. మహిళల పేరిట ఉన్నవీ ఇతరులే నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement