పస్తుల పండగ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ జిల్లాలోని పేదలు పండగ పూట పస్తులుండాల్సి వచ్చింది. అస్తవ్యస్తంగా రేషన్ వ్యవస్థ ఉండడం, ఆహార భద్రత కార్డుల పంపిణీ గందరగోళంగా మారడంతోపాటు రేషన్‌షాపులను కనుక్కోవడం కూడా కష్టతరం కావడంతో సంక్రాంతి పండగ పూట జిల్లా పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందలేదు. అన్నీ సవ్యంగా ఉన్న చోట్ల కూడా చక్కెర లేకపోవడం, గందరగోళం ఉన్న చోట్ల కనీసం బియ్యం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండాపోయింది. మనిషికి ఆరుకిలోల బియ్యం మాట దేవుడెరుగు... కనీసం గింజ బియ్యం కూడా పేదలకు అందని దుస్థితి నెలకొంది.
కొన...సాగుతున్న ప్రక్రియ
వాస్తవానికి గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తయారుచేసి వాటికి అనుగుణంగా జిల్లాలోని పేదలకు రేషన్‌కార్డులను పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ కార్డులు వచ్చిన వారందరికీ జనవరి 1 నుంచి రేషన్‌సరుకులు ఇస్తామని చెప్పింది. అయితే, ఆహారభద్రత కార్డుల జారీ ప్రక్రియ జిల్లాలో కొంత గందరగోళానికి దారి తీసింది. అర్హులు, అనర్హుల పేరిట కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వం ఒకటికి, రెండు సార్లు నిబంధనలు మార్చడంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం కూడా జిల్లా యంత్రాంగానికి కష్టతరంగానే మారింది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా యంత్రాంగం సకాలంలో ఆహార భద్రత కార్డులిచ్చేందుకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
తద్వారా జనవరి1న ప్రారంభమైతే అయింది కానీ ఆహారభద్రత కింద రేషన్ సరుకులు ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. విశేషమేమిటంటే... అసలు తమకు ఏ డీలర్ రేషన్ సరుకులిస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో లబ్ధిదారులు రేషన్‌షాపుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యవహారం చాలా గందరగోళంగా మారింది. కార్డు తీసుకుని పాత డీలర్ దగ్గరకు వెళితే మీ నంబర్ మా దగ్గర లేదని, వేరే షాపుకు వెళ్లాలని డీలర్ చెప్పడంతో పేదలు నిరాశతో వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితులు జిల్లాలో చాలా చోట్ల జరిగాయి. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో అయిపోలేదు. తమకు కార్డులు ఎందుకు ఇవ్వరంటూ మళ్లీ దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. పండగ ముందు పేదలకు సరుకులు ఇచ్చేయాలన్న కోణంలోనే జిల్లా యంత్రాంగం మరింత శ్రద్ధ పెట్టి పనిచేసి ఉంటే కొంత ఉపశమనం ఉండేదనే భావన సర్వత్రా వినిపిస్తోంది.
మిర్యాలగూడ, ఆలేరు, భువనగిరి, హుజూర్‌నగర్‌లలో చక్కెర లేదంట
వాస్తవానికి ఆహార భద్రత కింద జిల్లాలోని 9.3లక్షల కుటుంబాలకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల్లో పేర్లున్న వారందరికీ మనిషికి ఆరుకిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన దాదాపు 20వేల మెట్రిక్‌టన్నుల బియ్యం కావాల్సి ఉంది. ఈ బియ్యాన్ని గోదాములకు, రేషన్‌షాపులకు చేర్చినా కార్డుల జారీలో ఉన్న గందరగోళం కారణంగా చాలా మందికి బియ్యం చేరలేదు. ఇక, జిల్లాలో కొన్ని చోట్ల చక్కెర పంపిణీ చేయగా, మరికొన్ని చోట్ల అసలు చక్కెర ఊసే లేదు. వాస్తవానికి ప్రతి కార్డుపై అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, కిలో గోధుమపిండి, కిలో గోధుమలు ఇవ్వాల్సి ఉంది. మిగిలినవి ఎలా ఉన్నా పండగ పూట జిల్లాలోని రేషన్‌కార్డుదారులందరికీ కనీసం బియ్యం, చక్కెర పూర్తిస్థాయిలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ , ఆలేరు, భువనగిరి, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో అస్సలు చక్కెర కూడా పంపిణీ చేయలేదు. మిగిలిన చోట్ల కూడా కొన్ని మండలాల్లో పంపిణీ అయితే, మరికొన్నిచోట్ల చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత శ్రమించి పండగ పూట పేదలకు రేషన్ సరుకులు అందించి ఉండాల్సి ఉందని, తమకు సరుకులు ఇవ్వకపోవడంతో పండగ పూట నిరాశకు గురయ్యామని పేదలు వాపోతున్నారు.
స్పష్టంగా ఆదేశాలిచ్చాం- జేసీ సత్యనారాయణ
పండగ పూట అందరికీ రేషన్ సరుకులు ఇవ్వాలని స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఈ మేరకు గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రేషన్ షాపులకు సరుకులు కూడా చేరిపోయాయి. అయితే, కొన్నిచోట్ల... ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో షాపులను గుర్తించే సమస్య ఎదురవుతోంది. దీనిపై ఈ నెల 16 నుంచి 20 వరకు టాంటాం చేయమన్నాం. ఏ షాపు ఎవరికి కేటాయించారో స్పష్టంగా చెప్పాలని ఆదేశాలిచ్చాం. 20 తర్వాత సరుకులు అందని పేదలకు కచ్చితంగా జనవరి నెల రేషన్ అందజేస్తాం.