ratnagiri temple
-
సూర్య గడియారం.. సమయం చూసేదెలా?
సాక్షి, అన్నవరం: హిందువులతో పూజించబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన లేనిదే మానవ మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి సూర్యభగవానుడు కొలువైన క్షేత్రాలు అతి తక్కువ. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన కూడా సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. విష్ణు పంచాయతనం కలిగిన సత్యదేవుని ఆలయం దిగువన యంత్రాలయంలో ఆగ్నేయంలో సూర్యభగవానుడు కొలువు తీరారు. అంతే కాదు సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయం తెలిపే సూర్యగడియారం కూడా రత్నగిరిపై దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. సూర్య కిరణాల ఆధారంగా.. సత్యదేవుని ఆలయానికి ఈశాన్యభాగాన, స్వామి వారి నిత్య కల్యాణ మండపం వద్ద గల సూర్యగడియారం (సన్డయిల్)లో సూర్యకాంతి ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారం ఈ గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించారు. నిర్మాణం ఇలా.. 12 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలకపై త్రికోణం ఆకారంలో తూర్పునకు అభిముఖంగా మరో చిన్న పలక అమర్చారు. సూర్యకాంతి ఆ చిన్న పలక మీద పడి దాని నీడ పెద్ద పలకపై పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో ఉన్నట్టుగా అంకెలు ఉంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలు అనుసరించి కొంత సమయాన్ని కలపడం లేదా తీసివేయడం చేయాలి. అలా చేయడం వల్ల మనకి కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే దానిపై అక్కడ గల సూచనల పట్టికలో వివరంగా లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆ పలక నీడ 10–20 అంకెల మధ్య పడితే అక్కడ ఉన్న పట్టిక ప్రకారం ఆ తేదీకి పది నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం 10.30 అయినట్టు. విశేషమేమిటంటే ఈ సమయం కచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కు సరిపోతుంది. నిర్వహణ పట్టించుకోని దేవస్థానం ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్యగడియారం ఆలనా పాలనా లేకపోవడంతో సమయం ఎలా తెలుసుకోవాలో తెలియక భక్తులు ఏదో నిర్మాణాన్ని చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు తప్ప, ఆ గడియారంలో సమయం తెలుసుకునే విధానం తెలుసుకోలేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడ పలక మీద వేసిన అంకెలు, సూచనల పట్టికలోని సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించాలి. అదే విదంగా ఈ సూర్య గడియారం ప్రాముఖ్యతను భక్తులకు వివరించేందుకు అక్కడొక గైడ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. -
కార్తిక మాసోత్సవాలకు రత్నగిరి సన్నద్ధం
అన్నవరం (ప్రత్తిపాడు): ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 18 వరకూ కొనసాగనున్న కార్తి్తకమాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం, ప్రభుత్వశాఖల సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం దేవస్థానంలోని ఈఓ చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు అ«ధ్యక్షత వహించారు. దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మాట్లాడుతూ దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో శంఖవరం ఎంపీడీఓ శ్రీను, పంపా రిజర్వాయర్ ఏఈ వీరబాబు, తుని ఫైర్ సర్వీస్ అధికారి కేవీ రమణ, దేవస్థానం వైద్యాదికారి డాక్టర్ పాండురంగారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి రామశ్రీనివాసరావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీస్, తదితర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయకమిటీ సమావేశం నిర్ణయాలు ముఖ్యమైన పర్వదినాలు: ఈ నెల 23, 30, నవంబర్ ఆరోతేదీ, నవంబర్ 13వ తేదీ కార్తి్తకమాస సోమవారాలు. 21, 28 నవంభర్ నాలుగో తేదీ 11, 18 తేదీలు శనివారాలు, 22,29, నవంభర్ 5, 12 వ తేదీలు ఆదివారాలు. 31 వ తేదీ, నవంబర్ 14 వ తేదీ కార్తిక శుద్ధ, బహుళ ఏకాదశి పర్వదినాలు వచ్చినందున ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయం తెరిచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఆ రోజుల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి పులిహోర పంపిణీ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1న తెప్పోత్సవం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6–30 గంటల నుంచి 8–30 గంటల వరకూ సత్యదేవుని తెప్పోత్సవానికి పంపా నదిలో తగినంత నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటపుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తుని ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. పోలీసు బందోబస్తు నిర్వహించాలి. నాలుగో తేదీన గిరిప్రదక్షిణ : నవంబర్ నాలుగో తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరిప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మూడో తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినందున ఆరోజు రాత్రి జ్వాలాతోరణం, పంపా నదీ హారతులు నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభం: దేవస్థానంలో సహస్రదీపాలంకార సేవను కార్తీకమాసంలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఇతర వస్తుసామగ్రిని కార్తీక పౌర్ణమి నాటికి సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు సాక్షి కి తెలిపారు. కార్తీకమాసంలోని పర్వదినాల్లో తెల్లవారుజాము నుంచి వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నపుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి ప్రత్యేక దర్శనం టిక్కెట్ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ అమలు చేస్తారు. కార్తీకమాసం నెల రోజులు రత్నగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు నడపాలని, వైద్య నిర్వహించాలని నిర్ణయించారు. -
అనుమతించినచోటే ఇక పెళ్లిళ్లు
అన్నవరం : ఇక నుంచి రత్నగిరి, సత్యగిరులపై ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అనుమతించరాదని అన్నవరం దేవస్థానం నిర్ణయించింది. కల్యాణ మండపాలు, రామాలయం ముందు ఆవరణ, మాడ వీధులు, వివిధ సత్రాల్లో ఉన్న వేదికల మీద మాత్రమే వివాహాలు చేసుకోవడానికి అనుమతిస్తారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో కె.నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకూ సత్యగిరిపై హరిహరసదన్ ఎదుట, ప్రకాష్ సదన్ సత్రానికి ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాలు, అక్కడి పార్కింగ్ స్థలాలు, సీసీ సత్రాలవద్ద పెద్దపెద్ద సెట్టింగ్‌లతో ధనికులు ఆర్భాటంగా వివాహాలు నిర్వహించుకునేవారు. వీటికి అద్దె రూపంలో దేవస్థానానికి ఏటా రూ.10 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. అయితే గత శనివారం అర్ధరాత్రి సత్యగిరిపై ఉన్న ఖాళీ ప్రదేశంలో జరిగిన వివాహ వేడుకలో అశ్లీల నృత్యాలకు తెగబడడంపై తీవ్ర దుమారం రేగిన విషయం విదితమే. దీనిపై ఆరా తీసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇకపై రత్నగిరి, సత్యగిరులపై ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వివాహాలకు అనుమతించరాదని ఆదేశించారు. దేవస్థానానికి ఆదాయంకన్నా ఆలయ పవిత్రత ప్రధానమని ఈ సందర్భంగా ఈఓ అన్నారు. సత్యగిరిపై వివాహాలు చేసుకోవడానికి 36 హాల్స్‌తో విష్ణుసదన్ నిర్మించామని తెలిపారు. అలాగే రామాలయం ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో వివాహాలు చేసుకునేందుకు ఎటువంటి రుసుమూ చెల్లించనవసరం లేదని ఈఓ పేర్కొన్నారు.