తుపాకీ... వెనక్కి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :రౌడీషీట్‌తో సహా 38 కేసులు పెండింగ్‌లో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు వ్యక్తిగత తుపాకీ లెసైన్స్ ఇచ్చేందుకు పోలీసులు సిఫార్సు చేయడం వివాదాస్పదమైంది. ఇటీవలి కాలంలో ఆయనకు వ్యక్తిగత గన్‌లెసైన్స్ ఇచ్చేందుకు పోలీసులు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపించారు. ఇదే విషయమై ‘సాక్షి’ దినపత్రికలో రెండు వారాల కిందట ‘చింతమనేనికి తుపాకీ’ శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ, పోలీసు అధికారులు ఇప్పుడు ఆ గన్‌లెసైన్స్ మంజూరు వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. సహజంగా నేరచరిత్ర, పోలీసు కేసులు ఉన్న వారికి పోలీసులు పొరపాటున కూడా తుపాకీ లెసైన్సులకు సిఫార్సు చేయరు.
ఎన్నో దశల్లో విచారణ చేపట్టి ఏ చిన్న కేసు కూడా లేదని తేలితేనే మంజూరు చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేస్తారు. కానీ ఏకంగా రౌడీషీట్‌తో పాటు లెక్కకు మించిన కేసులు ఉన్న ప్రభాకర్‌కు గన్‌లెసైన్స్ ఇచ్చేందుకు జిల్లా పోలీసులు సంసిద్థత వ్యక్తం చేస్తూ ఫైలును రెవెన్యూ విభాగానికి పంపారు. ఇంత నేరచరిత్ర, రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యేకి గన్‌లెసైన్స్‌కు ఎలా సిఫార్సు చేశారని పోలీస్ కమ్యూనికేషన్స్ ఉన్నతాధికారి ప్రశ్నించినా విప్ కాబట్టే సిఫార్సు చేశామంటూ సమాధానాలు చెప్పుకొచ్చారు.
కానీ ‘సాక్షి’ కథనం కలకలం రేపిన నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నెల 26వ తేదీన ఆఫైల్‌ను ‘నాట్ రికమండెడ్ ప్రాపర్లీ’ అని కోట్ చేసి తిరిగి పంపినట్టు తెలిసింది. నిబంధనలను అతిక్రమించి అంత ఏకపక్షంగా ఇవ్వాల్సిన అవసరమేమిటంటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా తప్పుపట్టిన నేపథ్యంలో ఇక తుపాకీ లెసైన్స్ వ్యవహారం పెండింగ్‌లో పడినట్టేనని భావిస్తున్నారు.