అధికార తొత్తులు !
► తెలుగుదేశం నేతల కనుసన్నల్లో ఖాకీలు
► పచ్చని పల్లెల్లో ప్రశాంతతకు చిచ్చుపెడుతున్న వైనాలు
► టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నా పట్టించుకోని పోలీసులు
► గుంటూరు నగరంలోనూ అదుపుతప్పిన శాంతిభద్రతలు
పది రోజుల్లో నాలుగు హత్యలు..
సాక్షి, గుంటూరు: జిల్లాలో పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉందా.. అవుననే అంటున్నారు అధికశాతం మంది ప్రజలు. ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన జిల్లా పోలీసులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేయడం ప్రారంభించారు. వారికి అనుకూలంగా పని చేసి మంచి పోస్టు కొట్టేయాలన్న తలంపుతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నా నిరోధించకుండా అగ్గి రాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలపై దృష్టి సారించకుండా పోస్టింగ్‌ల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
►గ్రామాల్లో టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో పోలీసులంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు.
►పదేళ్లుగా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్న గ్రామాల్లో సైతం ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు.
►వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదుటి వర్గం కూడా గొడవలకు దిగక తప్పడం లేదు.
►ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
►పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులే ఓ వర్గానికి కొమ్ముకాస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
►ఇప్పటికైనా పోలీసులు నిద్రమేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
హత్యలు, దాడులతో అట్టుడుకుతున్న జిల్లా..
►పోలీసుల నిర్లక్ష్యం వల్ల శాంతి భద్రతలు అదుపుతప్పి వరస హత్యలు, దాడులతో జిల్లా అట్టుడికిపోతోంది.
►పదిరోజుల వ్యవధిలో గుంటూరులో వరసగా నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
►గుంటూరు నగరంలో ఆరు పోలీస్స్టేషన్లు ఉండగా అందులో మూడు స్టేషన్లకు ఎస్హెచ్ఓలు లేరు.
జిల్లాలో అనేక ప్రాంతాల్లో తమకు నచ్చని అధికారులను వెళ్లిపొమ్మని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేయడంతో కొందరు సిక్ లీవ్‌పై వెళ్లారు.
►రూరల్‌జిల్లాలో టీడీపీ నేతల వరస దాడులతో గ్రామాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.
►ఇటీవల ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, నాయకులపై దాడిచేసి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.
►గొడవలను నిరోధించాల్సిన పోలీసులే వారికి సహకరిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిద్దరోతున్న నిఘా వ్యవస్థ..
గ్రామాలు, నగరంలో శాంతి భద్రతలపై నిఘా ఉంచాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతో వరస సంఘటనలు జరుగుతున్నాయి.
ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు అసలు వారి సంగతే మర్చి పోవడంతో కిరాయి హత్యలు జరుగుతున్నాయి.