రేవంత్‌ను విచారిస్తేనే 'బాస్' వ్యవహారం బయటకు..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని కస్టడీ కోరుతూ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో విచారిస్తేనే 'బాస్' వ్యవహారమంతా బయటకొస్తుందని ఏసీబీ భావిస్తోంది.
మరోవైపు రేవంత్‌రెడ్డి ముడుపుల వ్యవహారం కేసు మరింత విస్తృతమవుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టుగా ప్రభుత్వ వర్గాలు నిర్ధారిస్తున్నాయి. ఈ కేసులో లోతుగా వెళ్తున్నకొద్దీ మరిన్ని వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క స్టీఫెనే కాకుండా... మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టుగా నిర్ధారించే సంభాషణలను, వివరాలను అధికారులు సేకరించారు.
ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు కనుసన్నల్లో, ఆయన ఆదేశాలమేరకే జరిగనట్టుగా కేసు దర్యాప్తు వివరాలు నిర్ధారిస్తున్నాయని అధికారవర్గాల నుంచి అందుతున్న సమాచారం. రేవంత్ రెడ్డి సంభాషణలు కూడా దీన్ని నిర్ధారించడంతో ఇక చట్టప్రకారం మరింత కఠినంగా వ్యవహరించక తప్పదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ముగింపుకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ... గవర్నర్‌ను కలిసినట్టు తెలుస్తోంది. కేసు వివరాలను ఆయనకు వివరించినట్టుగా సమాచారం.