రావెళ్ల ఇకలేరు
ముదిగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం అస్వస్థతతో కన్నుమూశారు. ముదిగొండమండలం గోకినేపల్లిలోని తన స్వగృహంలో రావెళ్ల తనువుచాలించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావెళ్ల గోకినేపల్లిలో 1927 జనవరి 31న రైతు కుంటుంబంలో జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పని చేసి ప్రత్యర్థులను గడగడలాడించిన ధీశాలి ఆయన.
విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వాతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ పోరాట ఉద్యమం నిర్వహించారు. 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, బీడ్, ఢిల్లీ, ఖమ్మం తదితర జైళ్లలో గడిపి...జైళ్లలో దుస్థితిని మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం సౌకర్యాన్ని సాధించడం విశేషం. ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి దశరధదేవ్, కె ఎన్ సింగ్, బర్మా, కెప్టెన్ మహ్మద్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్ 8వ తేదీన ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఆతరువాత గోకినేపల్లి కవిత కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించారు. రావెళ్ల పద్యరచనతో పాటు అనేక వ చన రచనలు సైతం చేశారు. రావెళ్ల కవితా ఖండికల్లో అనంతల్పం, పల్లెభారతి, రాగజ్యోతుల్లాంటివి ముఖ్యమైనవిగా ఉన్నాయి.
నాయకుల ఘననివాళి....
రావెళ్ల మృతదేహాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, గోకినేపల్లి సర్పంచ్ కొమ్మినేని రమేష్‌బాబు, ఐద్వా నాయకురాలు మచ్చా లక్ష్మి, అడ్వకేటు జేఏసీ నేత బిచ్చాల తిరుమలరావు, బీజేపి జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మధిర, పాలేరు నియోజకవర్గాల ఇన్ చార్జీలు బొమ్మెర రామ్మూర్తి, బత్తుల సోమయ్య, నేలకొండపల్లి, ముదిగొండ మండలాద్యక్షులు కొండూరి వేణు, సీతారాములు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రావుల పాటి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సామినేనిరమేష్, బేగ్, అబ్దుల్నబీ రావెళ్ల వెంకటరామారావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
కాగా, గోకినేపల్లిలో జరిగిన సంతాపసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రావెళ్ల వెంకటరామారావు మృతి సాహితీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్‌రావెళ్ల రాసిన తెలంగాణ గేయాన్ని పాడి వినిపించారు. కాగా, గోకినేపల్లిలో మంగళవారం రావెళ్ల కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయానికి అంతిమసంస్కారం నిర్వహించారు.