విపక్షాలపై సీబీఐ అస్త్రం
సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం
బెంగళూరు : ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌ల పై కూడా సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం (సీఎల్పీ)లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో సంచలనం సృష్టించిన కేసులు, కుంభకోణాలను సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలనే సిద్ధరా మయ్య సూచనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అందరు ప్రజాప్రతినిధులు ఓటేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చట్టసభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించేందుకు వీలుగా బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాజకీయ ప్రయోజనాలు ఆశించే అటు బీజేపీతో పాటు ఇటు జేడీఎస్‌లు డీ.కే.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని నానా రాద్ధాంతం చేశాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ సమావేశాల్లో పదేపదే ప్రస్తావిస్తూ ఉభయ సభల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
వీరికి తగిన జవాబు చెప్పడానికి వీలుగా ఆయా పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో లేదా ఆ.యా పార్టీల నాయకులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రఘుపతి భట్ (బీజేపీ) భార్య పద్మప్రియ అసహజ మరణం, ప్రస్తుత జేడీఎస్ శాఖ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ పని కోసం రూ.150 కోట్లను లంచంగా తీసుకున్న విషయంతోపాటు 2011లో రాష్ట్రంలోని వివిధ చర్చిల పై జరిగిన దాడులు తదితర ఆరేడు కేసులను సీబీఐకి అప్పగించాలని సిద్ధరామయ్య పేర్కొన్నప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ తమ సమ్మతిని తెలియజేశారు. ఇందుకు సీఎం సిద్ధరామయ్య...కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ కేసుల సంబంధించి న్యాయనిపుణులతో చర్చించి ప్రభుత్వ పరంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మంత్రుల తీరుపై గరం...
డీ.కే రవి మరణానికి సంబంధించి విపక్షాల ఆరోపణలకు చట్టసభల్లోకాని, బయట కాని మంత్రులు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని సీఎల్పీ సమవేశంలో పాల్గొన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేశారు. పూటకో వివరణ ఇవ్వడంతో పాటు ఒక మంత్రి ఇచ్చిన సమధానానికి మరో మంత్రి ఇచ్చిన సమాధానానికి సారుప్యత లేక పోవడం వల్ల విపక్షాల దృష్టిలోనే కాక ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చులకనయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఐడీ దర్యాప్తు పూర్తికాకుండానే చట్టసభల్లో డీ.కే రవిది ఆత్మహత్యగా పేర్కొన్న హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ వల్లే ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎల్పీ సమావేశం అనంతరం రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి హెచ్.ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ... ‘డీ.కే రవి కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు కాని మంత్రులను విమర్శించలేదు. చట్టసభలకు కచ్చితంగా హాజరు కావాలని సిద్ధరామయ్య సూచించారు. గత బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో జరిగిన కొన్ని కేసులకు సంబంధించి న్యాయవిచారణ జరిపించే విషయం కూడా సీఎల్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.’ అని పేర్కొన్నారు.