‘సుప్రీం’ సెక్రటరీ జనరల్‌తో తెలంగాణ సీఎస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రవీంద్ర మైథానిని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఢిల్లీలో కలసి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి చర్చించారు. రెండు రాష్ట్రాలకు హైకోర్టులకు కావలసిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని, ఈమేరకు భవనాలను ఇప్పటికే గుర్తించిందని వివరించినట్టు తెలిసింది.
తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌లను ప్రత్యేక హైకోర్టు గురించి కలసిన విషయం తెలిసిందే. కాగా హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని సీఎస్ కోరినట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ కార్యదర్శితోనూ ఆయన భేటీ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఆయన చర్చించినట్టు సమాచారం.