రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ :రెవెన్యూ వ్యవస్థలను ఉద్యోగులు బలోపేతం చేయాలని రెవెన్యూ సర్వీసుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు.ఈ నెల 16న రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బొబ్బరాదు వెంకటేశ్వర్లు నాయకత్వాన్ని మరోసారి సమర్ధించాలని జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెవెన్యూ సర్వీసుల సంఘం ఆదివారం రెవెన్యూ వసతిగృహంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థను బలపరిచేందుకు పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మరోమారు వెంకటేశ్వర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్, సెట్‌కాన్ఫరెన్స్, సమావేశాలు నిర్వహణ రాత్రి వేళల్లో నిర్వహించకుండా చూడాలన్నారు. సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలని వారు తీర్మానంలో పేర్కొన్నారు.
ఇటీవల, గతంలో జరిగిన జెమినీ ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూశాఖలో వీఆర్ఓ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని క్యాడర్లలో సీనియార్టీ జాబితాలో శాశ్వత ప్రాతిపదికన నడిపించాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఆ విధానాన్ని వెంటనే నిలుపుదల చేయాలని వారు తీర్మానించారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో కంప్యూటర్, నెట్, ఇతర వసతులు కల్పించాలన్నారు. తహశీల్దార్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మీసేవ, ఇతర సేవలకు ఉపయోగించే డిజిటల్ కీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు డేటా ఏంట్రీ ఆపరేటర్లు ఔట్సోర్సింగ్ విధానం కాకుండా శాశ్వత పద్ధతిలో నియమించాలని తీర్మానించారు. ఔట్సోర్సింగ్ విధానంలో నియమించిన ఆపరేటర్లు చేసిన పొరపాట్లకు తహశీల్దార్లు బలయ్యే ప్రమాదముందన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఎం.శ్రీకాంత్, ఎన్.వెంకటరావు, శ్రీహరి, సతీష్‌బాబు, రాంబాబు, మోహన్‌బాబు, మహంకాళి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.