Raw rice
-
ముడిబియ్యంపై సుంకం రైతుకు సంకటం
సాక్షి, హైదరాబాద్: నాన్ బాస్మతి(ముడి) బియ్యంపై కేంద్రం 20 శాతం సుంకం విధించడం వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని దక్షిణ భారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్‌ఉన్న తెలంగాణ సోనా మసూరి రకాల బియ్యం ఎగుమతులపై ఈ ప్రభావం అధికంగా పడుతుందన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హరి యాణాల్లో మాత్రమే పండే బాస్మతి బియ్యాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతికి అవకాశం ఇచ్చి, ముడిబియ్యంపై పన్నులు విధించడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదన్నారు. నూకల ఎగుమతిని నిషేధించడం వల్ల కూడా నష్టపోయేది రైతేనని అన్నారు. -
ఉప్పుడు బియ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా యాసంగిలో పండిన ధాన్యాన్ని ముడిబియ్యంగానే (రా రైస్) ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా యాసంగిలో పండిన ధాన్యాన్ని లెవీ కింద ఉప్పుడు బియ్యంగా (పారాబాయిల్డ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో దానికి ఫుల్స్టాప్ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఎన్ని లేఖలు రాసినా, ఆందోళనలు చేసినా ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పడే భారాన్ని భరించి యాసంగిలో బాయిల్డ్ రైస్ స్థానంలో ముడిబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మిల్లర్లు ఉప్పుడు బియ్యానికి స్వస్తి చెప్పి, కేవలం ముడిబియ్యం మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2,470 ముడి బియ్యం మిల్లులు ఉండగా, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. అయితే బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ముడిబియ్యం మిల్లింగ్ చేసే అవకాశం కూడా ఉంది. వానాకాలంలో అలా.. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం.. వానాకాలం (ఖరీఫ్) సీజన్లో వచ్చే ధాన్యాన్ని రైతులు తమ ఆహార అవసరాలకు మినహాయించుకోగా మిగతా దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌కు పంపించి ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. యాసంగిలో ఇప్పటివరకు.. యాసంగి (రబీ)లో వచ్చే ధాన్యంలో కూడా తన అవసరాలకు పోను 80 నుంచి 90 శాతం ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తాడు. ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపించి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. ముడిబియ్యంగా మారిస్తే అదనంగా 17 కిలోల నూకలు ప్రస్తుతం యాసంగి పంట కోతలకు వస్తుండటం, కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోబోమనడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్‌సీఐకి ముడి బియ్యాన్నే పంపించాలని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేసి ముడిబియ్యంగా మారిస్తే క్వింటాలుకు అదనంగా 17 కిలోల వరకు నూకలు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెద్దమొత్తంలో నూక ఉన్న బియ్యాన్ని కేంద్రం తీసుకోదు. కాబట్టి ఆ మేరకు బియ్యాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ భారాన్ని ఎలా భరించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించనుంది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే.. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఏ సీజన్లో అయినా 67 కిలోల బియ్యం రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇచ్చే 67 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యంగా పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర కింద రూ.1,960 రాష్ట్రానికి చెల్లిస్తుంది. అయితే ఈ 67 కిలోల బియ్యంలో 17 కిలోల (25 శాతం) వరకు నూకలు ఉన్నా ఎఫ్‌సీఐ అంగీకరించి, క్వింటాలు ధాన్యంగానే లెక్క కట్టి డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన నేపథ్యంలో ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే అంతా సాగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2 వేల కోట్ల భారం! ప్రస్తుతం ఉప్పుడు బియ్యం బదులు ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి రావడంతో ఈ లెక్కలు మారబోతున్నాయి. యాసంగిలో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం మొదళ్లు విరిగి నూకల శాతం రెట్టింపు అవుతుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటే, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చడం వల్ల క్వింటాలు ధాన్యంపై సగటున మరో 17 కిలోల వరకు నూకలు పెరుగుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని ప్రయోగాత్మకంగా మిల్లింగ్ చేసి, ఎంత మేరకు నూకలు వస్తాయో చూసి, ఎంత భారం పడుతుందో అంచనా వేయడంతో పాటు తక్కువ భారంతో గట్టెక్కేందుకు ఏం చేయాలో సీఎస్ కమిటీ నివేదించనుంది. ఎఫ్‌సీఐకి రెండు మార్గాల్లో.. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల ముడిబియ్యం ఇచ్చేలా రైస్‌మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, అదనంగా సగటున 17 కిలోల వరకు వచ్చే నూకలకు సంబంధించిన మొత్తాన్ని మిల్లర్లకే ఇవ్వాలనేది ఒక ఆప్షన్. అప్పుడు నూకలతో సంబంధం లేకుండా మిల్లర్లు 67 కిలోల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగిస్తారు. ఇక రెండో ప్రత్యామ్నాయంలో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, 67 కిలోలకు బదులు ఎన్ని కిలోల బియ్యం, నూకలు కలిపి ప్రభుత్వానికి ఇస్తారనే దానిపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తుంది. ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 43 ఎల్ఎంటీ బియ్యం అప్పగించాలి రాష్ట్రంలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో తిండిగింజలు, విత్తన ధాన్యం, ప్రైవేటుగా విక్రయించే ధాన్యం పోను 65 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుంది. దీన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 43 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించాల్సి ఉంటుంది. ఉప్పుడు బియ్యం అంటే... యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల క్రితమే ఉప్పుడు బియ్యం విధానం అమలులోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే వచ్చేది ఉప్పుడు బియ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముడి బియ్యం అంటే... పండిన పంటను సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యమే ముడి బియ్యం. వానాకాలంలో పండే ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లోనే మిల్లింగ్ చేస్తారు. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్ చేస్తే (ముడి బియ్యంగా మారిస్తే) నూకల శాతం ఎక్కువగా వస్తుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యంగా మార్చి ఇస్తోంది. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేకపోవడంతో ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామని కేంద్రం చెబుతోంది. ఇదీ కొనుగోలు విధానం.. రైతు పంట కోసి తేమ 17 శాతానికి తగ్గేవరకు ఎండబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడ రైతు పట్టా పాసు పుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణం ఆధారంగా ఎకరాకు 28 క్వింటాళ్ల లోపు దిగుబడి కింద లెక్కలేసి కొనుగోలు చేస్తారు. రైతు విక్రయించిన ధాన్యం డబ్బులు వారం రోజుల్లో బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇక కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని అధికారులు మిల్లులకు తరలిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి క్వింటాల్‌కి 67 కిలోల బియ్యం (సీఎంఆర్) చొప్పున ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలిస్తారు. ఇందులో ప్రజాపంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టిపెట్టుకొని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. -
రైతులను టీఆర్ఎస్ భయపెడుతోంది: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై రైతులను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మంళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ దీక్ష చేసినా రైతులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ లేఖ ఇచ్చారా? లేదా? చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదని తెలిపారు. బాయిల్డ్ రైస్ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందని గుర్తుచేశారు. ‘రా రైస్’ తీసుకోవడానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని సీఎం కేసీఆర్ లేఖ ఇచ్చారని అన్నారు. గత సీజన్ గురించి తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజవరకు కొంటామని తెలిపారు. గత సీజన్లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని అన్నారు. లేని వడ్ల సమస్యను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎవరూ ఉప్పుడు బియ్యం తినడం లేదని, ఉపయోగం తగ్గిందని తెలిపారు. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని అన్నారు. ఉచితంగా ఇచ్చినా తీసుకోవడం లేదని తెలిపారు. రైతులను టీఆర్ఎస్ భయపెడుతోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పచ్చి బియ్యం.. 40 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాం
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: వరిసాగు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. వానాకాలం (2021–22)లో 40 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం మాత్రమే సేకరించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటినుంచి పారాబాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం ఎఫ్‌సీఐ సేకరించదని, కేవలం మిల్లింగ్ చేసిన రారైస్ (పచ్చి బియ్యం)ను మాత్రమే అనుమతి స్తామని పేర్కొంది. దేశంలో పారాబాయిల్డ్ బియ్యం నిల్వలు మరో నాలుగేళ్లకు సరిపడా ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ధాన్యం/ బియ్యం సేకరణపై వివరాలతో ఓ నోట్ విడుదల చేసింది. అయితే గత ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ఆహార కార్యదర్శుల సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 90లక్షల మెట్రిక్ టన్నులకు పెంచమన్నారు కానీ.. వానాకాలంలో బియ్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ ద్వారా కోరినట్లు నోట్లో కేంద్రం పేర్కొంది. అయితే తెలంగాణలో 16.90 లక్షల హెక్టార్లలోనే పంట సాగు చేశారని, తద్వారా 54.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. 2016–17 నుంచి 2020–21 వానాకాలం వరకు నిర్దేశించిన పరిమాణానికన్నా అధికంగానే రా రైస్‌తో పాటు పారాబాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేసినట్లు వివరించింది. నోట్లో ఇంకా ఏముందంటే.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తి, వినియోగంలో తేడా ‘దేశ వ్యాప్తంగా పారా బాయిల్డ్ రైస్ ఉత్పత్తి, వినియోగంలో ఉన్న తేడాల నేపథ్యంలో ఉప్పుడు బియ్యం సేకరణను పరిమితం చేశాం. ఈ మేరకు తెలంగాణ నుంచి గత యాసంగి (2020–21)లో 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించాల్సి ఉంది. మిగతాది పచ్చి బియ్యం పంపాలి. అయితే తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు యాసంగిలో అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ఒప్పుకున్నాం. అలాగే ఎఫ్‌సీఐ వద్ద అక్టోబర్ 11 నాటికి పారాబాయిల్డ్ రైస్ స్టాక్ 46.28 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, మరో 32.73 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. అంటే 79 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐ వద్ద ఉన్నప్పటికీ, దేశంలో పారాబాయిల్డ్ రైస్‌ను వినియోగిస్తున్న రాష్ట్రాల ప్రజలకు అవసరమైంది ఏటా కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే ఇప్పుడున్న నిల్వలు మరో నాలుగేళ్ళ వరకు సరిపోతాయి..’ అని కేంద్రం తెలిపింది. ఈసారి ఆంక్షలు విధించాల్సి వచ్చింది ‘తెలంగాణలో పారాబాయిల్డ్ రైస్ పండిం చినా, వినియోగించేది మాత్రం పచ్చి బియ్యమే. అయితే పారాబాయిల్డ్ రైస్ విని యోగించే రాష్ట్రాల్లో కూడా ఆ బియ్యాన్ని పండి స్తుండడంతో ఆ స్టాక్ కదలికలో వేగం లేదు. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు గత ఖరీఫ్ (యాసంగి)సీజన్లో ముందు అనుమతి నిచ్చిన 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు అద నంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు పారా బాయిల్డ్ బియ్యం తీసుకోవడానికి అంగీకరించాం. కానీ ఈసారి వానాకాలం పారాబాయిల్డ్ రైస్ సేకరణపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అలాగే అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో.. ఎఫ్‌సీఐకి పారాబాయిల్డ్ రైస్ పంపిం చం, రైస్‌బ్రాన్ ఆయిల్ పరిశ్రమలకు ప్రోత్సా హకాలు ఇస్తాం, రైస్ మిల్లుల సామర్థ్యం పెం చుతాం, ఎఫ్‌సీఐతో పాటు రాష్ట్రం అవస రాలు తీర్చడానికి బలవర్ధకమైన బియ్యం లభ్యతను సులభతరం చేస్తాం అని పేర్కొంది. ఇతర అంశాలతో పాటు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే చర్యలు తీసుకుంటాం అని తెలిపింది..’ అని వివరించింది. కాగా వానా కాలం సీఎంఆర్ గడువును అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022గా నిర్ణయించారు. -
పచ్చి బియ్యం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అడిగిన విధంగా రా రైస్ (పచ్చి బియ్యం) ఇవ్వలేమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో వరిసాగు కాలంలో అధిక ఉష్ణో గ్రత వల్ల రా రైస్ దిగుబడికి అనుకూలంగా ఉండదని, 25 శాతం కంటే అధికంగా నూకలు వస్తాయని, దీన్ని ఎఫ్‌సీఐ తిరస్కరిస్తోందన్నా రు. అందువల్ల ఎఫ్‌సీఐ అడిగినట్లుగా 40 శాతం బాయిల్డ్ రైస్, 60 శాతం రా రైస్ ఇవ్వ లేమని, 80–90 శాతం వరకు బాయిల్డ్ రైస్, మిగిలినవి రా రైస్ ఇవ్వగలమని తెలిపారు. ఈ విషయంలో ఎఫ్‌సీఐ తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన బకా యిలపై సోమవారం పౌర సరఫరాల భవ న్లో అధికారులతో శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ పేర్కొనడం రైతాం గానికి గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ఇప్పుడు తీసుకోబోమనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఈ సమస్యను సీఎం కేసీ ఆర్, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలా కర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సీఎంఆర్ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. -
కేంద్రం కొత్త పేచీ.. పచ్చి బియ్యమే ఎక్కువ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించి కేంద్రం కొత్త పేచీ పెడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సేకరిస్తున్న ధాన్యంలో తమకు అధిక శాతం పచ్చి బియ్యం (రా రైస్) ఇవ్వాలని షరతు పెట్టింది. రాష్ట్రంలో యాసంగి సీజన్లో పచ్చి బియ్యం ఉత్పత్తి స్వల్పంగా మాత్రమే ఉంటుం దని తెలిసి కూడా కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వాటినే ఇవ్వాలని కోరుతుండటం, ఉత్పత్తి ఎక్కువగా ఉండే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) వద్దంటుండటంతో రాష్ట్రం తల పట్టుకుంటోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తొలుత పూర్తిగా రా రైస్ ఇవ్వాలన్న ఎఫ్‌సీఐ రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐ అంగీకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తిని అంచనా వేసింది. ప్రతి ఏటా యాసంగి సీజన్లో దొడ్డుగా ఉండే బాయిల్డ్ రైస్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఏటా 95 శాతం వరకు బాయిల్డ్ రైస్‌నే ఎఫ్‌సీఐ సేకరిస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం బాయిల్డ్ రైస్ ఎక్కువ తీసుకునేందుకు నిరాకరిస్తోంది. ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని సీజన్ఆరంభంలోనే రాష్ట్రానికి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని రాష్ట్రం కోరింది. రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎఫ్‌సీఐ 55 శాతం మేర రా రైస్ ఇవ్వాలని పట్టుబడుతోంది. అంటే 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే బాయిల్డ్ ఇవ్వాలని, మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నులు రా రైస్ ఇవ్వాలని రెండ్రోజుల కిందట లేఖ రాసింది. దీంతో రాష్ట్రం అయోమయంలో పడింది. రాష్ట్రంలో రా రైస్ ఉత్పత్తి 10 శాతం కూడా లేదు. ఒకవేళ దొడ్డు బియ్యాన్ని రా రైస్ కింద మార్చి ఇవ్వాలంటే బ్రోకెన్(నూక) 25 శాతానికి మించి ఉంటుంది. అలా ఉన్న బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ కోరినట్లుగా బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆ రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గడం వల్లేనా..? గతంలో తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి ఆ బియ్యాన్ని సేకరించి ఆ రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడంతో, ఆ బియ్యానికి అక్కడి నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గింది. దీంతో ఎఫ్‌సీఐ వద్ద బాయిల్డ్ రైస్ నిల్వలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా ఎఫ్‌సీఐ నిబంధన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనుండటంతో, దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. -
ముడి బియ్యం ఇక ముంగిట్లోనే!
ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యం తినే వారి సంఖ్య పెరుగుతోంది. ముడిబియ్యానికి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరం మేరకు బస్తా, రెండు బస్తాల ధాన్యం ముడిబియ్యం మర పట్టించుకొని ఇంట్లోకి వాడుకునే ప్రకృతి వ్యవసాయదారులకు.. లేదా వినియోగదారులకు నేరుగా ముడిబియ్యం అమ్ముకునే రైతులకు, స్వయం సహాయక బృందాలకు తరచూ రైస్ మిల్లుకు వెళ్లాల్సి రావటం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. ఇంటి దగ్గరే పెట్టుకొని బియ్యం మరపట్టుకునేందుకు వీలయ్యే చిన్న రైస్ మిల్లును కొనితెచ్చుకోవటమే దీనికి సరైన పరిష్కారం. వీరికి ఉపయోగపడే చిన్న రైస్ మిల్లు (రైస్ డీ-హస్కింగ్ మెషిన్)ను మహారాష్ట్రలోని విజ్ఞానాశ్రమం అనే లాభాపేక్ష లేని సంస్థ రూపొందించింది. పుణేకు 70 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇంటిపట్టునే పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ముడి బియ్యం ఆడించుకోవటానికి ఇదెంతో అనువుగా ఉంటుందని లాబ్ టెస్ట్‌లో నిర్థారణైందని విజ్ఞానాశ్రమం తెలిపింది. 3 చదరపు అడుగుల పొడవు, 4 చదరపు అడుగుల వెడల్పు స్థలం దీనికి సరిపోతుంది. గంటకు 10 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలదు. దీని బరువు సుమారు 125 కిలోలు. 1 హెచ్‌పీ మోటర్తో, 230 వోల్టుల ఏసీ కరెంట్‌తో నడుస్తుంది. దీన్ని ఉపయోగించటం సులభం. నిర్వహణ ఖర్చులూ తక్కువే. ధర రూ.20 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. లావు లేదా సన్న రకాల ధాన్యాలేవైనా పిచుకలు వొలిచినట్లు వొలిచి ముడి బియ్యాన్నిస్తుంది. స్టీల్ ప్లేట్లకు బదులు రబ్బరును ఉపయోగించడం వల్ల నూక తక్కువగా వస్తున్నది. 10, 40 హెచ్‌పీ మోటర్లతో నడిచే పెద్ద రైస్ మిల్లులతో పోల్చినప్పుడు.. ఇది అనేక విధాలుగా మెరుగైనదని తేలినట్లు విజ్ఞానాశ్రమం తెలిపింది. బాగుంది కదండీ.. చిన్న రైస్ మిల్లు! - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్