సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించి కేంద్రం కొత్త పేచీ పెడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సేకరిస్తున్న ధాన్యంలో తమకు అధిక శాతం పచ్చి బియ్యం (రా రైస్) ఇవ్వాలని షరతు పెట్టింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో పచ్చి బియ్యం ఉత్పత్తి స్వల్పంగా మాత్రమే ఉంటుం దని తెలిసి కూడా కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వాటినే ఇవ్వాలని కోరుతుండటం, ఉత్పత్తి ఎక్కువగా ఉండే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) వద్దంటుండటంతో రాష్ట్రం తల పట్టుకుంటోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
తొలుత పూర్తిగా రా రైస్ ఇవ్వాలన్న ఎఫ్‌సీఐ
రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐ అంగీకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తిని అంచనా వేసింది. ప్రతి ఏటా యాసంగి సీజన్‌లో దొడ్డుగా ఉండే బాయిల్డ్ రైస్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఏటా 95 శాతం వరకు బాయిల్డ్ రైస్‌నే ఎఫ్‌సీఐ సేకరిస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం బాయిల్డ్ రైస్ ఎక్కువ తీసుకునేందుకు నిరాకరిస్తోంది. ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని సీజన్‌ఆరంభంలోనే రాష్ట్రానికి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని రాష్ట్రం కోరింది.
రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎఫ్‌సీఐ 55 శాతం మేర రా రైస్ ఇవ్వాలని పట్టుబడుతోంది. అంటే 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే బాయిల్డ్ ఇవ్వాలని, మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నులు రా రైస్ ఇవ్వాలని రెండ్రోజుల కిందట లేఖ రాసింది. దీంతో రాష్ట్రం అయోమయంలో పడింది. రాష్ట్రంలో రా రైస్ ఉత్పత్తి 10 శాతం కూడా లేదు. ఒకవేళ దొడ్డు బియ్యాన్ని రా రైస్ కింద మార్చి ఇవ్వాలంటే బ్రోకెన్(నూక) 25 శాతానికి మించి ఉంటుంది. అలా ఉన్న బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ కోరినట్లుగా బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఆ రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గడం వల్లేనా..?
గతంలో తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి ఆ బియ్యాన్ని సేకరించి ఆ రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడంతో, ఆ బియ్యానికి అక్కడి నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గింది. దీంతో ఎఫ్‌సీఐ వద్ద బాయిల్డ్ రైస్ నిల్వలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా ఎఫ్‌సీఐ నిబంధన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనుండటంతో, దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment