Food Corporation of India Ltd
-
కేంద్రం కొత్త పేచీ.. పచ్చి బియ్యమే ఎక్కువ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించి కేంద్రం కొత్త పేచీ పెడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సేకరిస్తున్న ధాన్యంలో తమకు అధిక శాతం పచ్చి బియ్యం (రా రైస్) ఇవ్వాలని షరతు పెట్టింది. రాష్ట్రంలో యాసంగి సీజన్లో పచ్చి బియ్యం ఉత్పత్తి స్వల్పంగా మాత్రమే ఉంటుం దని తెలిసి కూడా కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వాటినే ఇవ్వాలని కోరుతుండటం, ఉత్పత్తి ఎక్కువగా ఉండే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) వద్దంటుండటంతో రాష్ట్రం తల పట్టుకుంటోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తొలుత పూర్తిగా రా రైస్ ఇవ్వాలన్న ఎఫ్‌సీఐ రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐ అంగీకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తిని అంచనా వేసింది. ప్రతి ఏటా యాసంగి సీజన్లో దొడ్డుగా ఉండే బాయిల్డ్ రైస్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఏటా 95 శాతం వరకు బాయిల్డ్ రైస్‌నే ఎఫ్‌సీఐ సేకరిస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం బాయిల్డ్ రైస్ ఎక్కువ తీసుకునేందుకు నిరాకరిస్తోంది. ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని సీజన్ఆరంభంలోనే రాష్ట్రానికి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని రాష్ట్రం కోరింది. రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎఫ్‌సీఐ 55 శాతం మేర రా రైస్ ఇవ్వాలని పట్టుబడుతోంది. అంటే 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే బాయిల్డ్ ఇవ్వాలని, మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నులు రా రైస్ ఇవ్వాలని రెండ్రోజుల కిందట లేఖ రాసింది. దీంతో రాష్ట్రం అయోమయంలో పడింది. రాష్ట్రంలో రా రైస్ ఉత్పత్తి 10 శాతం కూడా లేదు. ఒకవేళ దొడ్డు బియ్యాన్ని రా రైస్ కింద మార్చి ఇవ్వాలంటే బ్రోకెన్(నూక) 25 శాతానికి మించి ఉంటుంది. అలా ఉన్న బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ కోరినట్లుగా బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆ రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గడం వల్లేనా..? గతంలో తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి ఆ బియ్యాన్ని సేకరించి ఆ రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడంతో, ఆ బియ్యానికి అక్కడి నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గింది. దీంతో ఎఫ్‌సీఐ వద్ద బాయిల్డ్ రైస్ నిల్వలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా ఎఫ్‌సీఐ నిబంధన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనుండటంతో, దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. -
ఏం చేసేది? ఎఫ్‌సీఐకి తలనొప్పిగా మారిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలకు చోటు కరువైంది. బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పూర్తిగా తమ పరిధిలోనే ఉత్పత్తి పెంచడం, దీనికితోడు రా రైస్ (పచ్చి బియ్యం) వినియోగం వైపు అధికంగా మొగ్గుచూపుతుండటంతో ఇక్కడి గోదాముల నుంచి సరఫరా తగ్గి నిల్వలు పెరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా గత ఖరీఫ్‌కు సంబంధించి మరో ఐదున్నర లక్షల టన్నుల మేర బాయిల్డ్ రైస్ రావాల్సి ఉంది. యాసంగికి సంబంధించి కూడా భారీగా వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన అనంతరం ఎఫ్‌సీఐ దాన్ని సేకరించి తన పరిధిలోని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పరిధిలో 15.8 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములున్నాయి. ప్రతి యాసంగి సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ పడిపోయింది. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్‌కు సంబంధించి 40 లక్షల బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐకి చేరగా, ఇందులో 27 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఇందులో మరో 13 లక్షల టన్నులు ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉన్నాయి. దీనికితోడు 2020–21 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇది వస్తే నిల్వలు మరింత పెరగనున్నాయి. ఇది పోనూ ప్రస్తుత యాసంగిలోనూ 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే దాదాపు ఈ సీజన్లో 50 లక్షల టన్నులకు పైగా బాయిల్డ్ రైస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్థాయిలో నిల్వలు చేసే పరిస్థితి ఎఫ్‌సీఐ వద్ద లేదు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నెలకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల టన్నుల మేర పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఈ లెక్కన ఏడాదంతా సరఫరా చేసిన 36 లక్షల టన్నులకు మించి సరఫరా చేయలేదు. అలాంటప్పుడు మిగతా బియ్యాన్ని నిల్వ చేయడం ఎఫ్‌సీఐకి ‘కత్తిమీద సాము’లా మారనుంది. బాయిల్డ్ వద్దంటున్న పొరుగు రాష్ట్రాలు తమిళనాడుకు ప్రతి నెలా 3.50 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళకు ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ అవసరాలుండేవి. దీనికి తగ్గట్లుగా తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం సరఫరా అయ్యేది. ప్రస్తుతం తమిళనాడులో 3 లక్షల టన్నులకు అవసరాలు తగ్గాయి. తన అవసరాలకు సరిపోనూ బాయిల్డ్ రైస్ ఉత్పత్తిని స్వతహాగా పెంచుకుంటోంది. దీంతో తెలంగాణపై ఆధారపడే పరిస్థితి లేదు. ఇక కేరళలోనూ బాయిల్డ్ రైస్ వినియోగం 30 శాతం తగ్గి రా రైస్ వినియోగం పెరిగింది. దీంతో ఆ రాష్ట్రాల నుంచి బాయిల్డ్ డిమాండ్ తగ్గింది. కర్ణాటకలో పూర్తిగా రా రైస్ వినియోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో పూర్తిగా రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఎఫ్‌సీఐ రాష్ట్రాన్ని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరింది. దీనిపై ఎఫ్‌సీఐ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన
న్యూఢిల్లీ: గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి, శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో భాగంగా.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ‘నేషనల్ బయో ఫ్యూయల్ కోఆర్డినేషన్’ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాదిగా వలస కూలీలు, ఇతర పేదలు ఆకలితో బాధపడుతున్న తరుణంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది. లాక్డౌన్ సమయంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అధికారిక సమాచారం ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ టన్నుల బియ్యం, 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి. నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఇథనాల్‌తో హాండ్ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్ కంపెనీలు, డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారుచేసి ఆస్పత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు షూగర్ కంపెనీల సంఘం(ఐఎస్ఎంఏ) వెల్లడించింది. వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు -
ఎఫ్‌సీఐలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ) వివిధ జోన్లలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 349 ఖాళీలతో విడుదలైన ప్రకటనలో సౌత్‌జోన్‌లోనే 113 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష తరహాలో ఉన్నందున బ్యాంకు పరీక్షలకు సిద్ధమౌతున్న వారికి ఇది సదవకాశం. మొత్తం పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, అకౌంట్స్, మూవ్మెంట్, ఎలక్ట్రికల్, టెక్నికల్)-349 అర్హత: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్మెంట్): 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్)/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.మేనేజ్మెంట్ ట్రైనీ(టెక్నికల్/ఎలక్ట్రికల్ / మెకానికల్ /సివిల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో డిగ్రీ వయసు: 2015 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూలు ఉంటాయి.రాతపరీక్ష: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్మెంట్) పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే 120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఈ పరీక్షలో రీజనింగ్, డేటా అనాలసిస్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అకౌంట్స్, టెక్నికల్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షతోపాటు మరో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ విదానంలో 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఒక జోన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఎస్బీఐ ఇంటర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అన్ని నేషనల్ బ్యాంకుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ముఖ్యతేదీలు: దరఖాస్తులు ప్రారంభం: జూన్ 2, 2015. దరఖాస్తులకు చివరితేదీ: జూలై2, 2015. వెబ్సైట్: