సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నంటూ..
రాయచోటి టౌన్: ప్రేమ పేరుతో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ అమ్మాయిలను మోసగిస్తున్న ఓ మాయగాడిని వైఎస్సార్ జిల్లా రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటి అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామానికి చెందిన కైతేపల్లె పెంచల వరప్రసాద్ పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసి బెంగళూరులోని ఒక సంస్థలో పని చేస్తున్నాడు. వచ్చే జీతం తన జల్సాలకు సరిపోకపోవడంతో ఫేస్బుక్ ఖాతాను తెరిచి దాని ద్వారా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు.
ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు... తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ నమ్మిస్తాడు. చాలా పెద్ద సంస్థలో పనిచేస్తున్నానని మంచి జీతం ఇస్తారని.. తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ రకరకాలుగా మెసేజులు పెట్టి మొదట పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి అంటూ వారిని ఊబిలోకి దించుతాడు. మధ్యలో తాను ఇబ్బందుల్లో ఉన్నానని కాస్త డబ్బులు సర్దితే మళ్లీ త్వరలోనే చెల్లిస్తానంటూ మాయమాటలు చెబుతాడు. ఇలా ఒకరిద్దరిని కాదు..ఏకంగా పది మంది అమ్మాయిల్ని మోసం చేసి వారి వద్ద డబ్బులు లాగేసుకున్నాడు. అమ్మాయిల వద్ద నుంచి డబ్బులు తీసుకొని ఆ తరువాత పత్తా లేకుండా పోతాడు. ఇలా చేస్తూ రాయచోటికి చెందిన అమ్మాయికి ఇలాగే వల వేశాడు. ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. అనంతరం అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఆమె ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఈ మోసగాడికి అమ్మాయిల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వల పన్ని పట్టుకున్నారు. సోమవారం రాయచోటిలోని నేతాజీ సర్కిల్ వద్ద అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా, ఇతనికి భార్య, కొడుకు ఉండటం గమనార్హం. ఈ ఫేస్ బుక్ మాయగాడిని పట్టుకోవడంలో నేర్పును ప్రదర్శించిన ఎస్ఐ మైనుద్దీన్ సిబ్బంది శ్రీనివాసులు, బర్కత్, ఫయాజ్‌లను ఆయన అభినందించారు.