పుష్కర భక్తులను అడ్డుకోవడం సిగ్గుచేటు
– అధికారపార్టీ నేతల తీరుపై ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బైరెడ్డి ఆగ్రహం
– అధికారులు నిజాయితీగా పనిచేయాలని హితవు
పాతముచ్చుమర్రి(పగిడ్యాల): పాతముచ్చుమర్రిలోని రాయలసీమ కృష్ణా పుష్కర ఘాట్‌కు తరలి వచ్చే భక్తులను అధికారుల సహాయంతో అధికారపార్టీ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. సోమవారం రాయలసీమ పుష్కర ఘాట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘాట్‌కు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించానన్నారు. దీంతో రోజురోజకు పాతముచ్చుమర్రి పుష్కరఘాట్‌కు భక్తుల సంఖ్య పెరుగుతుందని, దీన్ని ఓర్వలేక కొందరు కొణిదేల క్రాస్ రోడ్డు వద్ద దారికాచి ముచ్చుమర్రికి వద్దు నెహ్రూనగర్ ఘాట్‌కు వెళ్లాలని చెప్పడం విచారకరమన్నారు. ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకుంటూ అధికారపార్టీ నాయకుల కొమ్ముకాయవద్దని హితవు పలికారు. భక్తితో వచ్చే భక్తులకు కుళ్లు రాజకీయ ఎత్తుగడలతో మలినం చేయవద్దన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపై ప్రభుత్వానికి తప్పుడు సమాచారం పంపడం, వాట్సాప్ ద్వారా సీఎంకు ఫోటోలు పంపడం ఎవ్వరి మెప్పు కోసమని ప్రశ్నించారు. అంతరాత్మను చంపుకుని పనిచేయవద్దని, ప్రజల అభిమానాన్ని చురగొనాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, సర్పంచ్ శ్రీనివాసులు, సింగిల్‌విండో డైరక్టర్ వెంకటరామిరెడ్డి, ఆర్పీఎస్ నాయకులు కాటం చక్రధర్‌రెడ్డి, నాయుడు, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.