ధాన్యం సరిహద్దు దాటుతోంది
ప్రభుత్వ మద్దతుధర మాటలకే పరిమితమైంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల జాడేలేకపోయింది. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక రైతన్నలు తమ ధాన్యాన్ని కర్ణాటకలోని రాయిచూరు మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. ఫలితంగా వేల క్వింటాళ్ల ధాన్యం సరిహద్దు దాటుతోంది. ఇప్పటివరకు 60వేల బస్తాల ధాన్యం పొరుగురాష్ట్రానికి తరలినట్లు తెలుస్తోంది. మార్కెట్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.
మక్తల్ రూరల్, న్యూస్‌లైన్: మక్తల్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లతో కళకళలాడుతూ ఉండేది. క్రయవిక్రయాల్లో జిల్లాలోనే రెండోస్థానం దక్కిం ది. కాగా, ప్రస్తుతం ఇక్కడి మార్కెట్‌కు ధాన్యం కావడమే కరువైంది. గత కొన్నేళ్లుగా మార్కెట్‌యార్డులో వ్యాపారులు కమీషన్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్య వహరించడం, గిట్టుబాటు ధరలు కల్పించకపోడం వల్ల రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి మార్కెట్‌కు ఖరీ దుదారులు రాకపోవడం, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. బాగా ఆరిన(తేమలేని) హంస రకం వరి ధాన్యానికి మక్తల్ మార్కెట్లో వెయ్యి లోపే చెల్లిస్తున్నారు. అదే రాయిచూర్ మార్కెట్లో రూ.1300 చెల్లిస్తున్నారు. సోనా రకానికి రూ.1600 పలుకుతుంది. అలాగే కొందరు వ్యాపారులు కూడా రైతుల వద్ద నేరుగా కల్లాల్లోనే వరి ధాన్యాన్ని కొనుగోలుచేసి కర్ణాటక తరలిస్తున్నారు.
దీనికితోడు వ్యాపారులు స్థానిక మార్కెట్లో క్వింటాలుకు రూ.మూడు నుంచి రూ.ఐదు చొప్పున కమీషన్ తీసుకుంటే రాయిచూర్ మార్కెట్లో మాత్రం రూ.రెండు నుంచి రూ.మూడు మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. కంది క్వింటాలుకు మన మార్కెట్లో రూ.3900 - 4500 చెల్లిస్తుండగా, కర్ణాటకలో రూ. 4500- 5000 ఇస్తున్నారు. పత్తి కూడా జిల్లాలో రూ. 4500 పలుకుతుండగా రాయిచూరు మార్కెట్లో మాత్రం రూ. ఐదువేలు చెల్లిస్తున్నారు. దీంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని అక్కడికి తీసుకెళ్లడమే మేలని భావిస్తున్నారు. దీంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల్లో వాహనాలను తరలిస్తున్నారు.
జాడేలేని కొనుగోలు కేంద్రం
ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినప్పుటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతేడాది ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం సీజన్లో ఇంకా ప్రారంభించలే దు. అధికారులు ఇప్పుడు చేస్తాం, అప్పు డు చేస్తాం అంటూ కాలయాపన చేస్తుం డటంతో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ప్రకటించినప్పటికీ స్థానిక వ్యాపారులు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మార్కెట్ ఆదాయానికి గండి
ఈ సీజన్లో మాగనూరు, మక్తల్, నర్వ, ఊట్కూర్ తదితర ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 50వేల బస్తాల వరిధాన్యం కర్ణాటకకు తరలినట్లు తెలుస్తోంది. ఫలితంగా మక్తల్ వ్యవసాయ మార్కెట్‌కు సుమారు రూ.30లక్షల వరకు నష్టం వాటిల్లినట్లయింది. అవేవిధంగా కంది వెయ్యి బస్తాల వరకు తరలిపోయింది. తద్వారా మార్కెట్‌శాఖ రూ.10 లక్షల కోల్పోయింది. ఇప్పటివరకు పత్తి కూడా మూడువేల క్వింటాళ్లకు పైగా తరలిపోగా, రూ.15లక్షల ఆదాయాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మక్తల్ మార్కెట్‌కు ధాన్యం రావడమే కరువైంది. మాగనూర్ మండలం కృష్ణానది దగ్గర ఉన్న వాసునగర్ దగ్గర అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటుచేసినా ధాన్యం తరలింపును ఆపలేకపోతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మక్తల్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచే సి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్ కార్యదర్శి ఏమన్నారంటే..
కర్ణాటక మార్కెట్లో ధాన్యానికి అధికధర ఉండటం వల్ల రైతులు అక్కడికి తీసుకెళ్తున్నారని మక్తల్ వ్యవసామయ మార్కెట్ కార్యదర్శి నూర్జహన్ తెలిపారు. ఇక్కడి నుంచి రాయిచూరు మార్కెట్‌కు ధాన్యం తీసుకెళ్తున్న వ్యాపారుల నుంచి ఒకశాతం ఫీజు వసూలు చేస్తామన్నారు. ఒకవేళ వ్యాపారులు ఎవరైనా మోసానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.