ఆర్డీఎస్కు రూ.10 లక్షలు మంజూరు
– మంత్రి హరిశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే సంపత్
అయిజ : ఆర్డీఎస్ గేటు నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కోరగా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో ఎమ్మెల్యే సంపత్ అయిజ, వడ్డెపల్లి రైతులతో వెళ్లి మంత్రిని కలిసి ఆర్డీఎస్ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 16న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద సుంకేసుల రిజర్వాయర్ వైపు నీళ్లు వెళ్లే 2వ స్కవర్ స్లూయిస్ గేట్ విరిగిపోయిందని, నీళ్లు వథాగా పోతున్నాయని మంత్రికి తెలిపారు. దీంతో ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు రావని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం ఆర్డీఎస్ సీఈ మల్లికార్జున్, ఎస్సీ, తెలంగాణ ఆర్డీఎస్ సీఈ ఖగేందర్తో మాట్లాడానని సంబంధిత ఇంజనీర్లు రూ. 10 లక్షలకు ఎస్టిమేషన్ చేశారని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెల్యేతోపాటు రైతులు హర్షం వ్యక్తం చేశారు.