rdt stadium
-
అనంతపురంలో క్రికెటర్ గిల్‌క్రిస్ట్ సందడి
-
ఆటను చూద్దాం రండి
- రేపటి నుంచే జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ - హాజరుకానున్న సౌతిండియా జట్లు - ఇదో పండుగలాంటిదన్న ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అనంతపురం సప్తగిరి సర్కిల్: జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు అనంత క్రీడా గ్రామం వేదికగా నిలవనుంది. గతేడాది రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన అనంత క్రీడా గ్రామం ఈ ఏడాది మరో ముందడుగు వేసింది. అండర్–14 (సబ్–జూనియర్) క్రీడా పోటీలను అనంతలో నిర్వహించనున్నారు. అన్ని అంశాల పరిశీలన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఐఫా) నిబంధనల మేరకు క్రీడా మైదానం, క్రీడాకారులకు అందాల్సిన వసతులు, ఫుట్‌బాల్ క్రీడా మైదానం ఏర్పాట్లు, గోల్‌పోస్టు, అంబులెన్స్, వైద్య సిబ్బంది, మరుగుదొడ్లు, గదులు తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఆర్డీటీ సంస్థకు ఈ ఏడాది జాతీయస్థాయి టోర్నీని నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఆర్డీటీ, అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. సౌత్‌జోన్ స్థాయి ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి. 3 నుంచి పోటీలు అనంతలో జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ పోటీల ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు అనంత క్రీడా గ్రామంలో జరగనున్నాయి. మ్యాచ్‌ల వివరాలు 03–09–2017 తమిళనాడు–తెలంగాణ 04–09–2017 కేరళ–పాండిచ్చేరి 05–09–2017 తెలంగాణ–కర్ణాటక 06–09–2017 పాండిచ్చేరి–ఆంధ్రప్రదేశ్ 07–09–2017 కర్ణాటక–తమిళనాడు 08–09–2017 ఆంధ్రప్రదేశ్–కేరళ చాలా సంతోషంగా ఉంది - నాగరాజు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మొదటిసారి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి అనంత వేదికగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి ఈ ఏడాది టూ స్టార్ హోదా లభించింది. ఇది కూడా ఈ టోర్నీకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టోర్నీలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ఐ–లీగ్ పోటీలకు ఇప్పటి నుంచే మంచి తర్ఫీదును అందిస్తాం. అన్ని సదుపాయలు కల్పించాం - నిర్మల్‌కుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ టోర్నీకి వచ్చే క్రీడాకారులకు, కోచ్‌లకు, రెఫరీ, ఇతర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులకు ఎకాలజీ సెంటర్లో 25 గదులను అందించాం. ఇతర సదుపాయాలను కూడా అందిస్తున్నాం. అన్ని వేళలా వారికి క్రీడా మైదానాన్ని అందుబాటులో ఉంచుతాం. క్రీడా మైదానంలో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా నీటిని, ఫుల్ గ్రౌండ్ గ్రాస్‌ను పరిచాం. గోల్ పోస్టును సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం. ఇదో పండుగ లాంటిది - మాంచో ఫెర్రర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఇదో పండుగ లాంటిది. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించడం జిల్లా క్రీడాకారులకు శుభపరిణామం. ఈ ఏడాది అనంత క్రీడా గ్రామం వేదికగా అనేక కార్యకలాపాలను చేపట్టాం. న్యూజిలాండ్ జట్టు టోర్నీని, దివ్యాంగుల వరల్డ్‌కప్ మ్యాచ్‌ను, అండర్–16 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీని అనంత వేదికగా నిర్వహించాం. ఏషియన్ ఫుట్‌బాల్ కన్సడ్రేషన్ (ఐఎఫ్‌సీ) అందించిన సూచనలను పాటించి క్రీడా మైదానంలో మార్పులు చేశాం. మరిన్ని టోర్నీలకు వేదికగా అనంతను నిలిపేందుకు కృషి చేస్తాం. -
‘అనంత ’ నచ్చింది !
- ఇలాంటి స్టేడియాన్ని ఎక్కడా చూడలేదు - స్నేహ బంధం మెరుగు పడాలి - న్యూజిలాండ్ క్రీడాకారులు అనంతపురం సప్తగిరి సర్కిల్ : న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ పట్టణంలోని క్రికెట్ హాక్స్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు అనంత జట్టుతో తలపడేందుకు అనంత నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. అనంత నగరానికి వేరే దేశానికి చెందిన క్రీడాకారులు అనేకసార్లు వచ్చారు. కానీ ఒక జట్టు మొత్తం వచ్చి ఇక్కడి ప్రాంతానికి చెందిన క్రీడాకారులతో సమానంగా క్రికెట్‌ను ఆడి వారి ద్వారా ఇక్కడి సంస్కృతిని సైతం తమ దేశానికి తీసుకెళ్లేందుకు యత్నించడం ఎప్పుడూ జరగలేదు. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ క్లబ్‌లకు చెందిన అనేక జట్లు భారతదేశానికి విచ్చేశాయని, ఇక్కడిలా అన్ని వసతులతో కూడిన క్రికెట్ క్రీడా మైదానాన్ని ఎక్కడ చూడలేదని న్యూజిలాండ్ క్రికెటర్లు చెబుతున్నారు. తమ ప్రాంతంలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఇక్కడి ప్రాంతంలో ప్రస్తుతం 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని ఈ ప్రాంతం క్రికెట్‌కు పూర్తిగా అనుకూలమైందని అంటున్నారు. ఈ సిరీస్‌తోనే తమ బంధం ముగిసిపోదని అనంతపురం జట్టు, ఆంధ్ర క్రికెట్ జట్టును సైతం తమ దేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు. దీనికి ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సహకారం ఎనలేనిదని తెలిపారు. ఇలాంటి మైదానాన్ని ఎక్కడా చూడలేదు - రవి కృష్ణమూర్తి, హాక్స్ క్లబ్ ప్రెసిడెంట్ మా జట్లను 2008 నుంచి భారతదేశానికి తీసుకొస్తున్నాను. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో తమ క్రీడాకారులను తీసుకొచ్చి వారిని క్రీడల్లో పాల్గొనేలా చేస్తున్నాను. ఇలా అన్ని సౌకర్యాలు కలిగిన క్రీడా మైదానం ఎక్కడా లేదు. ఈ ప్రాంతం క్రికెట్ ఆడేందుకు ఉన్నతమైనది. క్రీడాభివృద్ధికి ఆర్డీటీ సంస్థ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఇక్కడి క్రీడాకారులు క్రికెట్లో మంచి పట్టు సాధించారు. తమ జట్టు కంటే అనంతపురం జట్టు మంచి ఫాంలో ఉంది. మా క్రీడాకారులకు మంచి అవకాశం - నీరజ్ చావ్లా , జట్టు కోచ్ నేను భారతదేశానికి రావడం ఇది ఏడోసారి. అనంతపురం లాంటి ప్రదేశం క్రికెట్ ఆడేందుకు చాలా అనుకూలం. ఎన్నో ప్రదేశాలు తిరిగాను కానీ ఇలాంటి వసతులతో కూడిన క్రీడా మైదానాన్ని ఎక్కడా చూడలేదు. న్యూజిలాండ్‌లో ఇలాంటి క్రీడా మైదానం దొరకడమే కష్టం. తమ ప్రాంతంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు క్రికెట్ సీజన్ సాగుతుంది. కేవలం హార్డ్టర్ఫ్తో చేసిన పిచ్‌లపైనే తమ క్రికెట్ ఆధారపడి ఉంటుంది. సెంటర్ పిచ్‌లో ఆడేందుకు అవకాశం లభించడం చాలా అరుదు. ఇక్కడికి రావడం తమ జట్టు క్రీడాకారులకు మంచి అవకాశమే. ఈ ప్రాంతం బాగా నచ్చింది - జాక్ , టీ–20 జట్టు కెప్టెన్ మాకు ఈ ప్రాంతం చాలా నచ్చింది. ఇక్కడి వారు మమ్మల్ని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. తమ జట్టు గెలుపోటములను పక్కన పెడితే మంచి క్రీడా సంస్కృతిని పెంపొందించుకునేందుకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతోంది. అనంత జట్టు క్రీడాకారులు మంచి ఫాంలో ఉన్నారు. తమ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. తమ జట్టులో బ్యాట్స్మెన్లు రాణిస్తారని అనుకుంటున్నా. బౌలర్ల పాత్ర కూడా చాలా కీలకమైనదే. ఇది ఓ తీపి జ్ఞాపకమే - ఫ్రేజర్ మెక్ హ్యాల్ , వన్డే జట్టు కెప్టెన్ ఈ టోర్నీ ద్వారా ఇరుజట్ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నాను. మా జట్టులో మొత్తం 8 మంది బౌలర్లు ఉన్నారు. వారిలో 5 మంది ఫాస్ట్ బౌలర్లు కాగా, ముగ్గురు మీడియం పేసర్లు ఉన్నారు. తమ జట్టులోని బౌలర్లు గంటకు 130–120 కీ.మీ వేగంతో బంతిని వేయగలరు. తమ జట్టుకు ప్రత్యేకతే ఫాస్టు బౌలింగ్ అని నా నమ్మకం. ఈ ప్రాంతంలో ఆడటం నిజంగా తమకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. -
అట్టహాసంగా ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అట్టహాసంగా ఐటా టెన్నిస్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నదాల్ టెన్నిస్ స్కూల్ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రర్ స్మారక చాంపియన్ టోర్నీని ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టెన్నిస్ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. మెయిన్ డ్రా పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. పోటీలను ఐటా రిఫరీ శ్రీకుమార్, నదాల్ టెన్నిస్ స్కూల్ కో ఆర్డీనేటర్ సిస్కో, టోర్నీ డైరెక్టర్ భాస్కరాచార్య, కంప్యూటర్ టీచర్ కష్ణా తదితరులు పాల్గొన్నారు. క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతల వివరాలు అండర్–14 బాలుర విభాగం : ప్రియతం, ఆదిత్ అమర్నాథ్, రమణ. శేఖర్, నాయుడు రిత్వీక్, శివకార్తీక్, సోమసి శ్రావణి, వెంకటేష్, హేమవర్ధన్. అండర్–16 బాలుర విభాగం : సుందర గణపతి, ప్రణీత్, నితిన్, హరి, వంశీ రెడ్డి, హేమాశ్రీ రాజసింహ, సాయిధనుష్, హరీష్ లు విజయం సాధించి మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించారు. -
హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం
అనంతపురం స్పోర్ట్స్ : ఆర్డీటీ స్టేడియంలో హాకీ శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. స్టిక్ ఫర్ ఇండియా రూపకర్త ఆండ్రూ ఎన్రిచ్, స్పెయిన్ వలంటీర్లు ఈ నెల 13వ తేదీ వరకు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్రిచ్ మాట్లాడుతూ జిల్లాలో హాకీని వాడవాడలా విస్తరింపజేస్తామన్నారు. అనంతరం స్పెయిన్ హాకీ కోచ్‌లు క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. హాకీ సంఘం కార్యదర్శి డాక్టర్ విజయబాబు, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ పాల్గొన్నారు.