‘అనంత ’ నచ్చింది ! | newzeland cricketers happy with anantapur | Sakshi
Sakshi News home page

‘అనంత ’ నచ్చింది !

Published Wed, Jul 12 2017 9:35 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

‘అనంత ’ నచ్చింది ! - Sakshi

‘అనంత ’ నచ్చింది !

- ఇలాంటి స్టేడియాన్ని ఎక్కడా చూడలేదు
- స్నేహ బంధం మెరుగు పడాలి
- న్యూజిలాండ్‌ క్రీడాకారులు


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌ పట్టణంలోని క్రికెట్‌ హాక్స్‌ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు అనంత జట్టుతో తలపడేందుకు అనంత నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. అనంత నగరానికి వేరే దేశానికి చెందిన క్రీడాకారులు అనేకసార్లు వచ్చారు. కానీ ఒక జట్టు మొత్తం వచ్చి ఇక్కడి ప్రాంతానికి చెందిన క్రీడాకారులతో సమానంగా క్రికెట్‌ను ఆడి వారి ద్వారా ఇక్కడి సంస్కృతిని సైతం తమ దేశానికి తీసుకెళ్లేందుకు యత్నించడం ఎప్పుడూ జరగలేదు. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌ క్లబ్‌లకు చెందిన అనేక జట్లు భారతదేశానికి విచ్చేశాయని, ఇక్కడిలా అన్ని వసతులతో కూడిన క్రికెట్‌ క్రీడా మైదానాన్ని ఎక్కడ చూడలేదని న్యూజిలాండ్‌ క్రికెటర్లు చెబుతున్నారు.  తమ ప్రాంతంలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఇక్కడి ప్రాంతంలో ప్రస్తుతం 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని ఈ ప్రాంతం క్రికెట్‌కు పూర్తిగా అనుకూలమైందని అంటున్నారు. ఈ సిరీస్‌తోనే తమ బంధం ముగిసిపోదని అనంతపురం జట్టు, ఆంధ్ర క్రికెట్‌ జట్టును సైతం తమ దేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు. దీనికి ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సహకారం ఎనలేనిదని తెలిపారు.

ఇలాంటి మైదానాన్ని ఎక్కడా చూడలేదు - రవి కృష్ణమూర్తి, హాక్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్
మా జట్లను 2008 నుంచి భారతదేశానికి తీసుకొస్తున్నాను. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో తమ క్రీడాకారులను తీసుకొచ్చి వారిని క్రీడల్లో పాల్గొనేలా చేస్తున్నాను. ఇలా అన్ని సౌకర్యాలు కలిగిన క్రీడా మైదానం ఎక్కడా లేదు. ఈ ప్రాంతం క్రికెట్‌ ఆడేందుకు ఉన్నతమైనది. క్రీడాభివృద్ధికి ఆర్డీటీ సంస్థ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఇక్కడి క్రీడాకారులు క్రికెట్‌లో మంచి పట్టు సాధించారు. తమ జట్టు కంటే అనంతపురం జట్టు మంచి ఫాంలో ఉంది.

మా క్రీడాకారులకు మంచి అవకాశం - నీరజ్‌ చావ్లా , జట్టు కోచ్
నేను భారతదేశానికి రావడం ఇది ఏడోసారి. అనంతపురం లాంటి ప్రదేశం క్రికెట్‌ ఆడేందుకు చాలా అనుకూలం. ఎన్నో ప్రదేశాలు తిరిగాను కానీ ఇలాంటి వసతులతో కూడిన క్రీడా మైదానాన్ని ఎక్కడా చూడలేదు. న్యూజిలాండ్‌లో ఇలాంటి క్రీడా మైదానం దొరకడమే కష్టం. తమ ప్రాంతంలో అక్టోబర్‌ నుంచి మార్చి వరకు క్రికెట్‌ సీజన్‌ సాగుతుంది. కేవలం హార్డ్‌టర్ఫ్‌తో చేసిన పిచ్‌లపైనే తమ క్రికెట్‌ ఆధారపడి ఉంటుంది. సెంటర్‌ పిచ్‌లో ఆడేందుకు అవకాశం లభించడం చాలా అరుదు. ఇక్కడికి రావడం తమ జట్టు క్రీడాకారులకు మంచి అవకాశమే.

ఈ ప్రాంతం బాగా నచ్చింది - జాక్ , టీ–20 జట్టు కెప్టెన్‌
మాకు ఈ ప్రాంతం చాలా నచ్చింది. ఇక్కడి వారు మమ్మల్ని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. తమ జట్టు గెలుపోటములను పక్కన పెడితే మంచి క్రీడా సంస్కృతిని పెంపొందించుకునేందుకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతోంది.  అనంత జట్టు క్రీడాకారులు మంచి ఫాంలో ఉన్నారు. తమ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. తమ జట్టులో బ్యాట్స్‌మెన్లు రాణిస్తారని అనుకుంటున్నా. బౌలర్ల పాత్ర కూడా చాలా కీలకమైనదే.

ఇది ఓ తీపి జ్ఞాపకమే - ఫ్రేజర్‌ మెక్‌ హ్యాల్‌ , వన్‌డే జట్టు కెప్టెన్‌
ఈ టోర్నీ ద్వారా ఇరుజట్ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నాను. మా జట్టులో మొత్తం 8 మంది బౌలర్లు ఉన్నారు. వారిలో 5 మంది ఫాస్ట్‌ బౌలర్లు కాగా, ముగ్గురు మీడియం పేసర్లు ఉన్నారు. తమ జట్టులోని బౌలర్లు గంటకు 130–120 కీ.మీ వేగంతో బంతిని వేయగలరు.  తమ జట్టుకు ప్రత్యేకతే ఫాస్టు బౌలింగ్‌ అని నా నమ్మకం. ఈ ప్రాంతంలో ఆడటం నిజంగా తమకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement