విద్యార్థి ఆత్మహత్యాయత్నం
యలమంచిలి : నిత్యం టీవీలో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ కాలం వృథా చేస్తున్న కొడుకును చదువుకోమని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై తొందరపాటుతో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో గుర్తించడంతో విద్యార్థిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కొనగళ్ల సాయి అదే గ్రామంలో హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు నాటి నుంచి సాయి చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, రాత్రిళ్లు కూడా టీవీలో క్రికెట్ మ్యాచ్లు చూడటం అలవాటు చేసుకున్నాడు.
దీంతో తండ్రి నందీశ్వరరావు శనివారం రాత్రి కొడుకును మందలించారు. మనస్థాపానికి గురైన సాయి రోజూమాదిరి ఆదివారం పాల సేకరణ కేంద్రం నుంచి పాలు కొనుగోలు చేసేందుకు స్టీల్ క్యాన్ పట్టుకుని బయటకు వెళ్లాడు. అదే క్యాన్లో ఇంట్లో అందుబాటులో ఉన్న పశువులకు ఇచ్చే ఒక ఔషధాన్ని తీసుకెళ్లాడు. అది తాగి ఇంటికి వచ్చిన అనంతరం తాను చచ్చిపోతున్నాను.. అంటూ తల్లి కాసులమ్మకు విషయం చెప్పాడు. ఆమె బాలుడ్ని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చింది. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు.