చరిత్రను చెరిపేశారు!
సాక్షి, విశాఖపట్నం: ‘భీమునిపట్నం మున్సిపాలిటీ.. దక్షిణ భారత దే శంలో అతి పురాతన మున్సిపాలిటీ. దేశంలో దీనికి రెండో స్థానం. డచ్(నెదర్లాండ్) దేశస్థుల వలస స్థావరంగా వినుతికెక్కింది. అలాంటి చారిత్రక ప్రాశస్థ్యాన్ని కాలదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జీవీఎంసీలో విలీనం చేశారు. స్థానికులు, చరిత్ర ప్రేమికులు ఎంతగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటు కోసం మా కాళ్ల దగ్గరకొస్తున్నాడు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుల్ని మేం మాత్రం కాలదన్నక ఊరుకుంటామా..?’ ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై భీమిలివాసుల ఆక్రోశం.
స్వార్థ ప్రయోజనాలే పరమార్థం
నగరంలో రియల్ జోరుతో.. నివాస స్థలాలు అందనంత దూరాన ఉన్నాయి. ఏళ్లతరబడి విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో భీమిలి తీరాన సేదతీరాలని విశ్రాంత ఉద్యోగుల కోరిక. నివాస స్థలాలు కాస్త అందుబాటు ధరలో ఉండడంతో పాటు భీమిలి చారిత్రక ప్రాశస్త్యంపై మక్కువతోనే ఇక్కడ శేష జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడ్డామని రెవెన్యూ విభాగంలో పనిచేసి పదవీ విరమణ తర్వాత భీమిలి చేరిన రమణమూర్తి సాక్షికి తెలిపారు.
ఇలాంటి మున్సిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేయాలన్న ఆలోచన రావడమే దారుణమని చెప్తున్నారు. చారిత్రక ప్రాశస్త్యం కంటే స్వార్థ ప్రయోజనాలే గంటా గ్యాంగ్‌కు ఎక్కువైపోయాయని భీమునిపట్నం విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.