కొండనూ కొళ్లగొట్టారు
►కదిరి కొండకు ‘రియల్’ ముప్పు
►మట్టినీ ‘క్యాష్’ చేసుకుంటున్న రియల్టర్లు
►ఇప్పటికే అర ఎకరం విస్తీర్ణంలో కొండ మాయం
►అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం
కదిరి...లక్ష్మీనారసింహుడు నిలయం...ఇక స్వామి కొలువైన కదిరి కొండకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా సంక్రాంతి పండుగ మరుసటి దినం కనుమ రోజున జరిగే ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పులి పార్వేట ఉత్సవం కదిరికొండ నుంచే ప్రారంభమవుతుంది. ఈ కొండపైన ఉన్న స్వామివారి పాదముద్రికలు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. కొండపై ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం కల్గిన కదిరి కొండకు ఇప్పుడు ‘రియల్’ ముప్పు ఏర్పడింది. 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కదిరి కొండలో ఇప్పటికే ఎకరం మేర రియల్టర్లు తవ్వేశారు...టీడీపీ నేతల అండతో తవ్వేస్తూనే ఉన్నారు.
- కదిరి
కదిరి కొండపై టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కన్నేశారు. రియల్టర్ల అవతారమెత్తి ఎర్రమట్టికోసం కొండను కరిగించేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని మున్సిపల్ స్థలాలను కబ్జా చేసిన వారి కన్ను తాజాగా రహదారుల పక్కనున్న గోతులపై పడింది. ఆ గోతులను పూడ్చి, అక్కడ ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టాలన్నది వారి ఆలోచన. రోడ్డు పక్కనున్న ఆ గోతులను చదును చేయడానికి కదిరి కొండను జేసీబీల సాయంతో తవ్వి, ట్రాక్టర్ల ద్వారా ఆ మట్టిని ‘రియల్’ వ్యాపారం కోసం తరలిస్తున్నారు. ఇప్పటి దాకా సుమారు 300 ట్రాక్టర్ల మట్టిని అక్కడి నుండి తరలించినట్లు తెలుస్తోంది. రాత్రిళ్ల పూట నెలరోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి తెలిసినా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అడిగేవారూ...అడ్డుకునే వారు లేరనీ...
పట్టణంలో అక్కడక్కడా వెలసిన అక్రమ లే అవుట్లకు ఇన్నాళ్లూ విఠలరాయుని చెరువు, ముత్యాలచెరువు, కౌలేపల్లి చెరువుల నుండి ఒక్కో ట్రాక్టర్ రూ. 800 చొప్పున ఇస్తూ తరలించే వారు. రెవెన్యూ అధికారుతో పాటు పోలీసులు సైతం చెరువులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో అధికార పార్టీకి చెందిన రియల్టర్లు ఇప్పుడు కదిరి కొండను ఎంచుకున్నారు. అడిగేవారు..అడ్డుకునే వారేవరూ లేకపోవడం...పైగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కొండను తవ్వి మట్టిని తరలించారు. చెరువుల నుంచి తెచ్చే బంకమట్టి కన్నా ఈ ఎర్రమట్టే బాగుంటుండడంతో రాత్రిళ్లు మొత్తం ఈ మట్టి రవాణా కొనసాగిస్తున్నారు.
లే అవుట్‌కు అనుమతి కూడా లేవు
వాస్తవంగా ఎక్కడైనా భూమిని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టాలంటే మొదట రెవెన్యూ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్ కార్యాలయంలో.... రూరల్ పరిధిలో అయితే పంచాయతీతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి. సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం రోడ్లు, రిజర్వ్ స్థలం ఇలా అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్న తర్వాతే లేఅవుట్‌కు అప్రూవల్ ఇస్తారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ చేయకుండానే సదరు టీడీపీ నాయకులు ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే కదిరి–రాయచోటి రోడ్లో కదిరి కొండకు సమీపంలోనే అక్రమ లే అవుట్ వేస్తున్నారు. ఇందుకోసం కదిరి కొండను తవ్వి ఆ మట్టి ఆ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు దీన్ని ‘మూమూలు’గా తీసుకుంటున్నారని విన్పిస్తోంది.
‘రియల్’ దొంగలను పట్టుకోవాలి
కదిరి కొండ చాలా చరిత్ర ఉంది. అలాంటి కొండను తవ్వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టాలి. నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు కచ్చితంగా కదిరి కొండను దర్శించుకుంటారు. అలాంటి కొండనే తవ్వేస్తున్నారంటే వారికి క్షమించకూడదు.
–నరసింహ స్వామి భక్తుడు మేరువ నాగమల్లు, కదిరి:
ఊరికే వదలకూడదు
ప్లాట్లలను చదును చేసేందుకు కదిరి కొండను తవ్వి ఆ మట్టిని అక్కడికి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నరసింహస్వామి చరిత్రను తెలియజేసే బ్రంహాండ పురాణంలో కూడా ఆ కదిరి కొండను గురించి పేర్కొన్నారు. దేవతలంతా అక్కడి నుండే ప్రార్ధిస్తే నరసింహ స్వామి ప్రత్యక్షమైనట్లు అందులో ఉంది. ఇందుకు కొండపై ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటి కొండను తవ్వేస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టకూడదు.
–ప్రసాద్, చెర్లోపల్లి, నరసింహ స్వామి భక్తుడు
చర్యలు తీసుకుంటాం
కదిరి కొండను తవ్వేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. వారిపై రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఆ కొండ మా ఆలయం పరిధిలోకే వస్తుంది. అక్కడున్న పలు ఆలయాల్లో నిత్యం ధూప, దీప నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి.
–వెంకటేశ్వరరెడ్డి,ఈఓ, నరసింహ స్వామి ఆలయం, కదిరి