Real estate ventures
-
ఎల్ఆర్ఎస్ పేరుతో నయా దోపిడీ
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్ వెంచర్ యజమాని రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించి అక్టోబర్ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. (చదవండి: ఎల్ఆర్ఎస్: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’) ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది. లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సారూ.. మాకేది మోక్షం!) కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి. వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
గీతన్నకు మొగిపురుగు దెబ్బ
సాక్షి, సిద్దిపేట: రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ విద్యుత్లైన్లు వేయడం, బీడు భూములను వ్యవసాయానికి వాడుకోవడం వంటి కారణాలతో ఇప్పటికే తాటి వనాలు కనుమరుగు అవుతుండగా.. తాజాగా గీత కార్మికులకు మొగిపురుగు రూపంలో మరో దెబ్బ తగులుతోంది. కుండల కొద్దీ కల్లు వచ్చే తాటి చెట్లు చూస్తుండగానే మొగి విరిగిపోవడం, నిలువునా ఎండిపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొగిపురుగు తొలిచేయడం వల్ల చెట్లు చనిపోతున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి నివారణ మార్గం లేదని వారు చేతులెత్తేస్తున్నారు. 3 వేలకు పైగా చనిపోయిన తాటిచెట్లు రాష్ట్ర వ్యాప్తంగా మొగిపురుగు సోకి ఇప్పటికే మూడు వేలకు పైగా తాటిచెట్లు చనిపోయినట్లు గీత కార్మిక సంఘం చేసిన సర్వేలో తేలింది. ప్రధానంగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్న నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఈ మొగిపురుగు బెడద తీవ్రంగా ఉంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, మద్దూరు, హుస్నాబాద్, కరీనంగర్ జిల్లాలోని చిరుగు మామిడి, జగిత్యాల, జనగామ జిల్లాల్లోని వడ్లకొండ, నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్లో అధికసంఖ్యలో తాటి చెట్లు మొగిపురుగు బారిన పడి చనిపోతున్నాయి. ఈ మొగిపురుగు చెట్టు మొగిలో చేరి రసాన్ని పీల్చుతూ.. కిందికి తొలుచుకుంటూ పోతుంది. చెట్టు చనిపోగానే మరో చెట్టుపైకి చేరుతుంది. పురుగును నిర్మూలించకపోతే తాటివనాలు కనుమరుగవుతా యని గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నాం సిద్దిపేట మండలంలోని పలు గ్రామాల్లో తాటి చెట్లు ఎండిపోవడంతో గౌడ కులస్తులు ఉపాధి కోల్పోతున్నారు. మొగిపురుగు తినేయడంతో తాటి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. మొగిపురుగు బారి నుంచి చెట్లును కాపాడి గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పల్లె మధుసూదన్గౌడ్, మద్దూరు గీత వృత్తిని కాపాడాలి ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి, ఈత చెట్లను కొట్టేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మొగిపురుగు కూడా కార్మికుల పాలిట శాపంగా మారింది. ఏపుగా పెరిగి కుండల కొద్దీ కల్లు ఇచ్చే చెట్లను మొగి పురుగు తొలిచేస్తోంది. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. – ఎంవీ రమణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి -
లేఅవుట్లకు బ్రేక్
- వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి నిలిపివేత - రాజధాని భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే.. - జూన్ నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్ - ప్రభుత్వం నుంచి ఉడా మౌఖిక ఆదేశాలు - ఉడా పరిధిలో మొత్తం 476 మాత్రమే లేఅవుట్లు సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనమతులు నిలిపివేశారు. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడంతో భూసేకరణ ప్రక్రియకు ప్రయివేటు భూముల వల్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భారీగా పెరిగిన భూముల ధరలకు కళ్లెం వేసేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. కేవలం మౌఖిక ఆదేశాల మేరకే ఉడా అధికారులు లే అవుట్లకు అనుమతులు నిలిపివేస్తున్నారు. అందువల్లే దరఖాస్తులు స్వీకరించి, దానికి సంబంధించి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అనుమతులు మాత్రం మంజూరు చేయడంలేదు. జూన్ నుంచి నిలిపివేత ఈ ఏడాది జూన్ నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోని లే అవుట్ల అనుమతులు నిలిపివేశారు. జూన్కు ముందు లేఅవుట్ల కోసం అందిన దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. మిగిలినవి పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం 30కి పైగా లేఅవుట్లు అనుమతుల కోసం పెండింగ్లో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అవసరమని అధికారులు గుర్తించారు. దీనితోపాటు ప్రైవేటు భూములను కూడా 60:40 నిష్పత్తిలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజధాని కమిటీ భూసేకరణపై దృష్టి సారించింది. ఇతర కేటాయింపులకు అనుమతి లేదు ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి వీజీటీఎం ఉడాకు మౌఖిక ఆదేశాలు అందాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కోటాలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. పాత లేఅవుట్లపైనా దృష్టి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబంశివరావు ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఉడా, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, అనధికార లేఅవుట్లను నియంత్రించాలని ఆదేశించారు. దీంతో ఉడా అధికారులు పాత లేఅవుట్లపై దృష్టి సారించారు. ఉడా పరిధిలో 2008 నుంచి 2014, మే నెల వరకు మొత్తం 476 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇటీవల భూ బదలాయింపునకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించని లే అవుట్లను గుర్తించారు. కృష్ణా జిల్లాలో అనుమతి పొందిన లే అవుట్లు 226 ఉండగా, వీటిలో 166 లే అవుట్లు నాలా ఫీజు చెల్లించలేదని నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో 157 లే అవుట్లు ఉండగా, వాటిలో 36 లేఅవుట్లకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించలేదని గుర్తించారు. ‘నాలా’ ఫీజు వసూలు బాధ్యత రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో ఈ విషయంలో ఉడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం లే అవుట్లకు అనుమతులు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.