లేఅవుట్లకు బ్రేక్ | UDA Blames Govt for Delay in Flyover Works | Sakshi
Sakshi News home page

లేఅవుట్లకు బ్రేక్

Published Mon, Sep 15 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

లేఅవుట్లకు బ్రేక్

లేఅవుట్లకు బ్రేక్

- వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి నిలిపివేత
 - రాజధాని భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే..
- జూన్ నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్
- ప్రభుత్వం నుంచి ఉడా మౌఖిక ఆదేశాలు
- ఉడా పరిధిలో మొత్తం 476 మాత్రమే లేఅవుట్లు
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనమతులు నిలిపివేశారు. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడంతో భూసేకరణ ప్రక్రియకు ప్రయివేటు భూముల వల్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భారీగా పెరిగిన భూముల ధరలకు కళ్లెం వేసేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. కేవలం మౌఖిక ఆదేశాల మేరకే ఉడా అధికారులు లే అవుట్లకు అనుమతులు నిలిపివేస్తున్నారు. అందువల్లే దరఖాస్తులు స్వీకరించి, దానికి సంబంధించి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అనుమతులు మాత్రం మంజూరు చేయడంలేదు.
 
జూన్ నుంచి నిలిపివేత
ఈ ఏడాది జూన్ నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోని లే అవుట్ల అనుమతులు నిలిపివేశారు. జూన్‌కు ముందు లేఅవుట్ల కోసం అందిన దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం 30కి పైగా లేఅవుట్లు అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అవసరమని అధికారులు గుర్తించారు. దీనితోపాటు ప్రైవేటు భూములను కూడా 60:40 నిష్పత్తిలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజధాని కమిటీ భూసేకరణపై దృష్టి సారించింది.
 
ఇతర కేటాయింపులకు అనుమతి లేదు
ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి వీజీటీఎం ఉడాకు మౌఖిక ఆదేశాలు అందాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కోటాలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.
 
పాత లేఅవుట్లపైనా దృష్టి
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబంశివరావు ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఉడా, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, అనధికార లేఅవుట్లను నియంత్రించాలని ఆదేశించారు. దీంతో ఉడా అధికారులు పాత లేఅవుట్లపై దృష్టి సారించారు. ఉడా పరిధిలో 2008 నుంచి 2014, మే నెల వరకు మొత్తం 476 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇటీవల భూ బదలాయింపునకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించని లే అవుట్లను గుర్తించారు.

కృష్ణా జిల్లాలో అనుమతి పొందిన లే అవుట్లు 226 ఉండగా, వీటిలో 166 లే అవుట్లు నాలా ఫీజు చెల్లించలేదని నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో 157 లే అవుట్లు ఉండగా, వాటిలో 36 లేఅవుట్లకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించలేదని గుర్తించారు. ‘నాలా’ ఫీజు వసూలు బాధ్యత రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో ఈ విషయంలో ఉడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం లే అవుట్లకు అనుమతులు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement