Process of land acquisition
-
పట్టాలెక్కని ఫార్మా సిటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. భూసేకరణ ప్రాథమిక దశలోనే ఉండగా.. ‘మాస్టర్ ప్లాన్’ కూడా కొలిక్కి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీకి అవసరమైన 11 వేల ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించారు. సర్వే నంబర్లవారీగా ప్రభుత్వ, పట్టా, అసైన్డ్, అన్టైటిల్డ్, అటవీ తదితర కేటగిరీలకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ యంత్రాంగం నివేదిక రూపొందించింది. ప్రభుత్వ, అటవీ భూమిని మినహాయిస్తే మిగతా కేటగిరీల భూములకు చెల్లించాల్సిన పరిహారంపై స్పష్టత రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఆమోదయోగ్యం కాదని భూ యజమానులు చెప్తుండటంతో భూసేకరణ ముందుకు సాగడం లేదు. వివాదంలేని సుమారు ఆరు వేల ఎకరాల అటవీ, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో తొలి దశలో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. పారిశ్రామిక వాడల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కేటాయించిన రూ. 200 కోట్ల నుంచి ఫార్మాసిటీ అభివృద్ధికి కొంత మొత్తం వెచ్చించేందుకు టీఎస్ఐఐసీ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఫార్మా రంగంలో పేరొందిన మెగా కంపెనీలతో పాటు చిన్నా, చితకా సంస్థలు సుమారు 350 వరకు ఫార్మాసిటీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ఫార్మాసిటీకి సమీకృత ప్రణాళిక(ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల నుంచి ఆసక్తివ్యక్తీకరణ(ఈఓఐ) కోరుతూ టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో 8 సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. సంస్థ అనుభవం, సాంకేతిక నైపుణ్యం తదితరాలను పరిశీలించి అర్హత కలిగిన కన్సల్టెన్సీని ఎంపిక చేయాల్సి ఉన్నా ఈ ప్రక్రియ తరచూ వాయిదా పడుతోంది. నెలాఖరులోగా సాధ్యమేనా? ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు, గతంలో దిల్ సంస్థకు కేటాయించిన 3,500 ఎకరాల భూమిని ఈ నెలాఖరులోగా టీఎస్ఐఐసీకి అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుందా అనేది అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్న భూములకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు భూమిని బదలాయించడం కూడా ప్రాథమిక దశలోనే ఉంది. -
లేఅవుట్లకు బ్రేక్
- వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి నిలిపివేత - రాజధాని భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే.. - జూన్ నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్ - ప్రభుత్వం నుంచి ఉడా మౌఖిక ఆదేశాలు - ఉడా పరిధిలో మొత్తం 476 మాత్రమే లేఅవుట్లు సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనమతులు నిలిపివేశారు. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడంతో భూసేకరణ ప్రక్రియకు ప్రయివేటు భూముల వల్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భారీగా పెరిగిన భూముల ధరలకు కళ్లెం వేసేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. కేవలం మౌఖిక ఆదేశాల మేరకే ఉడా అధికారులు లే అవుట్లకు అనుమతులు నిలిపివేస్తున్నారు. అందువల్లే దరఖాస్తులు స్వీకరించి, దానికి సంబంధించి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అనుమతులు మాత్రం మంజూరు చేయడంలేదు. జూన్ నుంచి నిలిపివేత ఈ ఏడాది జూన్ నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోని లే అవుట్ల అనుమతులు నిలిపివేశారు. జూన్‌కు ముందు లేఅవుట్ల కోసం అందిన దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం 30కి పైగా లేఅవుట్లు అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అవసరమని అధికారులు గుర్తించారు. దీనితోపాటు ప్రైవేటు భూములను కూడా 60:40 నిష్పత్తిలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజధాని కమిటీ భూసేకరణపై దృష్టి సారించింది. ఇతర కేటాయింపులకు అనుమతి లేదు ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి వీజీటీఎం ఉడాకు మౌఖిక ఆదేశాలు అందాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కోటాలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. పాత లేఅవుట్లపైనా దృష్టి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబంశివరావు ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఉడా, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, అనధికార లేఅవుట్లను నియంత్రించాలని ఆదేశించారు. దీంతో ఉడా అధికారులు పాత లేఅవుట్లపై దృష్టి సారించారు. ఉడా పరిధిలో 2008 నుంచి 2014, మే నెల వరకు మొత్తం 476 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇటీవల భూ బదలాయింపునకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించని లే అవుట్లను గుర్తించారు. కృష్ణా జిల్లాలో అనుమతి పొందిన లే అవుట్లు 226 ఉండగా, వీటిలో 166 లే అవుట్లు నాలా ఫీజు చెల్లించలేదని నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో 157 లే అవుట్లు ఉండగా, వాటిలో 36 లేఅవుట్లకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించలేదని గుర్తించారు. ‘నాలా’ ఫీజు వసూలు బాధ్యత రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో ఈ విషయంలో ఉడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం లే అవుట్లకు అనుమతులు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.