పట్టాలెక్కని ఫార్మా సిటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. భూసేకరణ ప్రాథమిక దశలోనే ఉండగా.. ‘మాస్టర్ ప్లాన్’ కూడా కొలిక్కి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీకి అవసరమైన 11 వేల ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించారు. సర్వే నంబర్లవారీగా ప్రభుత్వ, పట్టా, అసైన్డ్, అన్‌టైటిల్డ్, అటవీ తదితర కేటగిరీలకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ యంత్రాంగం నివేదిక రూపొందించింది. ప్రభుత్వ, అటవీ భూమిని మినహాయిస్తే మిగతా కేటగిరీల భూములకు చెల్లించాల్సిన పరిహారంపై స్పష్టత రావడం లేదు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర ఆమోదయోగ్యం కాదని భూ యజమానులు చెప్తుండటంతో భూసేకరణ ముందుకు సాగడం లేదు. వివాదంలేని సుమారు ఆరు వేల ఎకరాల అటవీ, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో తొలి దశలో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించింది. పారిశ్రామిక వాడల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కేటాయించిన రూ. 200 కోట్ల నుంచి ఫార్మాసిటీ అభివృద్ధికి కొంత మొత్తం వెచ్చించేందుకు టీఎస్‌ఐఐసీ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఫార్మా రంగంలో పేరొందిన మెగా కంపెనీలతో పాటు చిన్నా, చితకా సంస్థలు సుమారు 350 వరకు ఫార్మాసిటీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకున్నాయి.
ఫార్మాసిటీకి సమీకృత ప్రణాళిక(ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల నుంచి ఆసక్తివ్యక్తీకరణ(ఈఓఐ) కోరుతూ టీఎస్‌ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో 8 సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. సంస్థ అనుభవం, సాంకేతిక నైపుణ్యం తదితరాలను పరిశీలించి అర్హత కలిగిన కన్సల్టెన్సీని ఎంపిక చేయాల్సి ఉన్నా ఈ ప్రక్రియ తరచూ వాయిదా పడుతోంది.
నెలాఖరులోగా సాధ్యమేనా?
ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు, గతంలో దిల్ సంస్థకు కేటాయించిన 3,500 ఎకరాల భూమిని ఈ నెలాఖరులోగా టీఎస్‌ఐఐసీకి అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుందా అనేది అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్న భూములకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు భూమిని బదలాయించడం కూడా ప్రాథమిక దశలోనే ఉంది.