![Pawan Kalyan had a meeting with the top officials of the Forest Department](/styles/webp/s3/article_images/2024/07/27/pavan.jpg.webp?itok=KE9fxMMq)
కేంద్రం ఇచ్చింది రూ. 8,283.92 కోట్లు
ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో వేసింది
2023–24లో మాత్రమే కొంత పెండింగ్ ఉంది
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం 8,283.92 కోట్లు పంచాయతీలకు విడుదల చేయగా, అందులో రూ.7,587.64 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసిందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసన సభలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 2019–20లో 2,336.56 కోట్లు, 2020–21లో రూ.1,837.50 కోట్లు, 2021–22లో రూ.1,338.52 కోట్లు, 2022–23లో రూ.1,378.65 కోట్లు, 2023–24లో రూ.1,392.69 కోట్లు విడుదలైందన్నారు.
అయితే ఒక్క 2023–24 సంవత్సరంలో 696.41 కోట్లు పంచాయతీలకు చేరిందని, ఆ ఏడాది వచి్చన నిధుల్లో మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని తెలిపారు. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందన్నారు. ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.103 కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్పారు. పంచాయతీల అనుమతి లేకుండా డిస్కంకు కరెంట్ బిల్లుల కింద రూ.2,285 కోట్లు మళ్లించిందన్నారు.
2018లో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలను రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తిష్టవేసినట్టు తన సమీక్షల్లో తేలిందన్నారు. పంచాయతీ ఖాతాల్లోకి లావాదేవీలు జరిగినప్పటికీ, ఇప్పుడు బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవన్నారు. పంచాయతీల్లో నిధుల వినియోగం, మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
మడ అడవులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు
మడ అడవులను విధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయం అరణ్య భవన్‌లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి తాను స్వయంగా చర్చిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఎ.కె.నాయక్, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శరవణన్ తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లలో ఒక్క బ్రూవరేజ్‌కు అనుమతివ్వలేదు
గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క బ్రూవరేజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మైక్రో బ్రూవరేజ్‌లకు మాత్రమే అనుమతులు ఇచ్చారన్నారు. లైసెన్సుల జారీ, మార్గదర్శకాల అమల్లో ఎటువంటి ఉల్లంఘనలు గుర్తించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment