vgtm
-
ఏపీ రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు
సాక్షి, హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ రహదారి నిర్మాణాన్ని 183 కిలోమీటర్ల పొడవున ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం రూ.9.700 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రాజధాని నిర్మాణానికే ఇంతవరకు సాయం అందించని కేంద్రం ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే డ్రాఫ్ట్ మ్యాప్ సిద్ధం చేసి, ప్రాథమికంగా డీపీఆర్ నివేదికను కేంద్రానికి పంపింది. ఎనిమిది లేన్లుగా నిర్మించే రహదారి కోసం మొత్తం 4,117 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొంది. జాతీయ రహదారుల ప్రమాణాల మేరకు కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 22.5 ఎకరాల చొప్పున 183 కిలోమీటర్లకు 4,117 ఎకరాలు అవసరమని పేర్కొంది. అయితే, కేంద్రం దీనిపై ఇంకా స్పందించలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇటీవలే అన్ని దశల ప్రణాళికలను అందజేసింది. దీనికనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల శాఖతో పాటు ప్లానింగ్ డిపార్ట్మెంట్కు రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించింది. రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్ల నిర్మాణం, రోడ్డు మధ్యలో మొక్కల పెంపకం లాంటి వాటికి అదనంగా ఎంత ఖర్చవుతుందో తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర సాయంపై ఆశలు పెంచుకోకుండా సొంతగానే నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లను కలుపుతూ ఔటర్ రింగురోడ్డు ప్రణాళికను రూపొందిస్తున్నారు. అమరావతి నుంచి మోగులూరు వద్దకు, హనుమాన్ జంక్షన్ నుంచి రామాపురం, తుమ్మలపల్లి, నందివాడ, గుడివాడ మీదుగా పామర్రు, భట్ల పెనమర్రు, కృష్ణానది మీదుగా మళ్లీ గుంటూరు జిల్లాలో ప్రవేశించే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు నిర్మించాల్సి ఉన్నందున జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) సహకారం కోరనున్నారు. -
సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇవే
హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరు కీలక జీఓలు జారీ చేసింది. ఈ బిల్లుపై గవర్నర్ నిన్న సంతకం చేశారు. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తక్షణమే విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ(వీజీటీఎంయుడిఏ)ను రద్దు చేస్తూ ఒక జీఓను జారీ చేశారు. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. 122 కిలో మీటర్ల ప్రాంతం రాజధాని నగరంగా ప్రకటించారు. సీఆర్డీఏ పరిధిలోకి 7068 కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది. దీని పరిధిలోకి 58 మండలాలు వస్తాయి. గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సీఆర్డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైఎస్ చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, 9 మంది సభ్యులు ఉంటారు. రాజధాని ప్రాంత అధికారాలన్నీ సీఆర్డీఏ కార్యనిర్వాహక కమిటీకి బదలాయిస్తూ జీఓ జారీ చేశారు. ఈ ప్రాంతంలో ల్యాండ్‌పూలింగ్ అధికారాన్ని ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్‌గా మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించారు. సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ ఉంటారు. మిగిలిన సభ్యుల వివరాలపై తరువాత ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సీఆర్డీఏ పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని సగానికిపైగా గ్రామాలు వస్తాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి. -
ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు!
హైదరాబాద్: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ఉడా పరిధిలో రిజిస్ట్రేషన్లు యథావిథిగా చేసుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం వీజీటీఎం ఉడా పరిధిలోకి రావడంతో ఆ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లు, లేఅవుట్, గ్రూప్ హౌసింగ్స్ను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆ మెమోను సస్పెండ్ చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు భూ రిజిస్ట్రేషన్లు ఆపాలన్న జీఓపై విచారణ కొనసాగుతుంది. ** -
సీఆర్డీఏ బిల్లు సిద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై మంగళవారం కేబినెట్ లో చర్చించనున్నారు. రాజధాని భూముల సేకరణ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. సీఆర్డీఏలో గవర్నింగ్ బాడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సీఆర్డీఏకు ప్రత్యేక కమిషన్ ను కూడా ప్రభుత్వం నియమించనుంది. సీఆర్డీఏ ఏర్పాటు కాగానే విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) రద్దు కానుంది. వీజీటీఎం పరిధిలోని ఆస్తులన్నీ సీఆర్డీఏకు బదలాయించనున్నారు. సీఆర్డీఏ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపే అవకాశముంది. -
ఉడా రద్దుపై సమాచారం లేదు
* కొనసాగుతున్న అభివృద్ధి పనులు * వీజీటీఎం ఉడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడి విజయవాడ సెంట్రల్ : ఉడా రద్దు గురించి తమకు సమాచారం అందలేదని, అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఉడా కార్యాలయంలో వీజీటీఎం-ఉడా పాలక వర్గ సమావేశం శనివారం జరిగింది. అనంతరం చైర్మన్ తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినందువల్లే ఉడా పరిధిలో లేఅవుట్లను నిలిపేశామన్నారు. వీటి కోసం వచ్చే దరఖాస్తుల్ని ఎప్పటిలాగే స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బిల్డింగ్ ప్లాన్లు యథావిధిగా మంజూరు చేస్తున్నామన్నారు. కోర్టు కేసులున్న ప్రాంతాల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఆగినట్లు చెప్పారు. గుణదల రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) కూలిన ఘటనపై మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఏయూడీ) నుంచి అనుమతులు రాకపోవడం వల్లే పనులు తిరిగి ప్రారంభం కాలేదని చెప్పారు. ఒక కాంట్రాక్టర్ లబ్ధి కోసమే పనులు నిలిపేశారనే వాదనల్ని ఆయన కొట్టిపారేశారు. లే అవుట్ రెగ్యులేషన్ స్కీం కింద 2,100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వైస్ చైర్మన్ ఉషాకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు. తీర్మానాలు * గుంటూరు-అమరావతి-ఉంగుటూరు గ్రామాల మీదుగా కంభంపాడు వరకు రూ.3.50 కోట్లతో రోడ్డు నిర్మాణం. ఇందులో కోటి రూపాయలు మాత్రమే ఉడా భరిస్తోంది. మిగిలిన సొమ్మును వేరే ఏజెన్సీల నుంచి సమకూర్చుకోవాలి. * ఉడాలో పనిచేస్తున్న, రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 350 గజాల ఇళ్ల స్థలాలు పొందితే మార్కెట్ ధర ప్రకారం కేటాయించాలి. * 350 గజాల కంటే అధికంగా స్థలాలు పొందిన 9 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలి. * ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి పంపాలి. * గుంటూరు జిల్లా ప్రత్తిపాడు 16కి.మీ నుంచి 17.కి.మీ వరకు ఫోర్‌లైన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.95 లక్షలు కేటాయించారు. ఇది చివరి సమావేశం కాదు ఉడా రద్దు అవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇదే చివరి పాలక వర్గ సమావేశం అవుతోందనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఉడా ఉంటుందో, ఊడుతోందో తెలియక ఉద్యోగులు హైరానాకు గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం కొందరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఇది చివరి సమావేశం అనుకోవడం ఊహాజనితమన్నారు. -
వీజీటీఎం అభివృద్ధి పనులు ఆగలేదు
విజయవాడ సెంట్రల్: వీజీటీఎం ఉడా చేపట్టిన అభివృద్ధి పనులు ఆగలేదని చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వీజీటీఎం- ఉడా పాలకవర్గ సమావేశం శనివారం నగరంలోని కార్యాలయంలో జరిగింది. అనంతరం చైర్మన్ తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినందువల్లే ఉడా పరిధిలో లే అవుట్లకు అనుమతులు నిలిపివేసినట్లు చెప్పారు. బిల్డింగ్ ప్లాన్లు యథావిధిగా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉడా రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి తమకు అందలేదన్నారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాల్లోనే ఇన్నర్‌రింగ్ రోడ్డు పనులు ఆగినట్లు వివరించారు. అన్ని ఊహాగానాలే.. ఉడా రద్దవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇదే చివరి పాలకవర్గ సమావేశమని ముమ్మరంగా ప్రచారం సాగింది. ఉడా ఉంటుందో.. రద్దవుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం కొందరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకుంటున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది చివరి సమావేశం అనుకోవడం ఊహాజనితమేనని పేర్కొన్నారు. గుంటూరు-అమరావతి-ఉంగుటూరుల మీదుగా కంభంపాడు వరకు రూ.3.50 కోట్లతో రోడ్డు నిర్మించాలని తీర్మానించారు. ఇందులో కోటి రూపాయలు మాత్రమే ఉడా భరిస్తోంది. మిగిలిన సొమ్మును వేరే ఏజెన్సీల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉడాలో పనిచేస్తున్న, రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందకపోతే 350 గజాల ఇంటి స్థలాన్ని మార్కెట్ ధర ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. 350 గజాల కంటే అధికంగా స్థలాలు పొందిన 9 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని తీర్మానించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు 16.0 కి.మీ నుంచి 17.కి.మీ వరకు ఫోర్‌లైన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.95 లక్షలు కేటాయించారు. -
వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: వీజీటిఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి, దాని స్థానంలో రాజధాని అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి మండలి ఉపసంఘం ప్రకటించింది. ఏపి రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. భూసేకరణకు విధి విధానాలను ఖరారు చేసింది. సమావేశం ముగిసిన తరువాత మంత్రి పత్తిపాటి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. 17 గ్రామాలలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో మూడు గ్రామాలలో మాత్రమే భూమి సేకరించనున్నట్లు తెలిపారు. కృష్ణా నదికి దక్షిణ భాగాన ఈ గ్రామాలు వస్తాయని చెప్పారు. గ్రామంలో ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోవడంలేదన్నారు. ఉన్న గ్రామాలు ఉన్నట్లు ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని తరలించం అన్నారు. ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూమిని కూడా సేకరిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తుంటే వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. దాదాపు 21 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కిందకు వస్తారని తెలిపారు. సూత్రప్రాయంగా రైతులతో మాట్లాడితే సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అందరినీ ఒప్పించి భూమి సేకరిస్తామన్నారు. భూమి సేకరించిన తరువాత ఎకరాకు 25వేల రూపాయల చొప్పున పది సంవత్సరాల పాటు రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఒక్కో ఎకరం అభివృద్ధికి 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేసిన తరువాత రైతుకు ఎకరాకు వెయ్యి గజాల భూమి ఇస్తామన్నారు. ఆ తరువాత రైతులకు అనుకూలంగా ఉన్నచోట లాటరీ ద్వారా భూమి ఇస్తామన్నారు. 9 నెలల్లో ఆరు సెక్టార్లలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఒక్కో సెక్టారులో 5వేల ఎకరాల భూమి ఉంటుందని తెలిపారు. మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో ఆరుగురు మంత్రులతోపాటు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ** -
వీజీటీఎం పరిధిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్
విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి- మంగళగిరి(వీజీటీఎం) పరిధిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్ పడింది. వీజీటీఎం పరిధిలోని అన్ని పంచాయతీల్లో పరిపాలన అధికారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ రాజధాని నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీజీటీఎం పరిధిలోని భూముల క్రయ విక్రయాలకు ఇక గ్రామ పంచాయతీలకు అనుమతి ఇచ్చే అధికారం ఉండదు. -
వీజీటీఎం పరిధిలో లేఅవుట్లపై నిషేధం
హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-తెనాలి- మంగళగిరి(వీజీటీఎం) పరిధిలోని లేఅవుట్ల అనుమతులపై నిషేధం కొంతకాలం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి లేని లేఅవుట్ల భూముల క్రయవిక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడనున్నాయి. రాజధానికి భూసేకరణ పూర్తయ్యేవరకుభూముల క్రయవిక్రయాలు స్తంభింపజేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు'
గుంటూరు: మెట్రో రైలు ప్రాజెక్ట్ విజయవాడ నగరానికే పరిమితం చేయడకూడదని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రోరైలు నిర్మిస్తే... ఆ ప్రాజెక్ట్‌తో మంచి రాజధాని ఏర్పాడుతుందని అన్నారు. ఓ అధికారి మెట్రో ప్రాజెక్ట్ కేవలం ఓ నగరానికే పరిమితం చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో 12వ ప్రతిపాదనగా వీజీటీఎం పరిధిలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ నిర్మించాల్సి ఉందన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ స్పీకర్ నాదెండ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ రూపశిల్పి శ్రీధరన్... మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు విజయవాడనే ఆయన ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై విధంగా స్పందించారు. -
లేఅవుట్లకు బ్రేక్
- వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి నిలిపివేత - రాజధాని భూసేకరణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే.. - జూన్ నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్ - ప్రభుత్వం నుంచి ఉడా మౌఖిక ఆదేశాలు - ఉడా పరిధిలో మొత్తం 476 మాత్రమే లేఅవుట్లు సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనమతులు నిలిపివేశారు. నవ్యాంధ్ర రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడంతో భూసేకరణ ప్రక్రియకు ప్రయివేటు భూముల వల్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భారీగా పెరిగిన భూముల ధరలకు కళ్లెం వేసేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. కేవలం మౌఖిక ఆదేశాల మేరకే ఉడా అధికారులు లే అవుట్లకు అనుమతులు నిలిపివేస్తున్నారు. అందువల్లే దరఖాస్తులు స్వీకరించి, దానికి సంబంధించి రుసుము కూడా వసూలు చేస్తున్నారు. అనుమతులు మాత్రం మంజూరు చేయడంలేదు. జూన్ నుంచి నిలిపివేత ఈ ఏడాది జూన్ నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోని లే అవుట్ల అనుమతులు నిలిపివేశారు. జూన్‌కు ముందు లేఅవుట్ల కోసం అందిన దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం 30కి పైగా లేఅవుట్లు అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అవసరమని అధికారులు గుర్తించారు. దీనితోపాటు ప్రైవేటు భూములను కూడా 60:40 నిష్పత్తిలో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజధాని కమిటీ భూసేకరణపై దృష్టి సారించింది. ఇతర కేటాయింపులకు అనుమతి లేదు ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు మంజూరు చేయకూడదని ఉన్నతాధికారుల నుంచి వీజీటీఎం ఉడాకు మౌఖిక ఆదేశాలు అందాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కోటాలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. పాత లేఅవుట్లపైనా దృష్టి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబంశివరావు ఈ నెల 10వ తేదీన విజయవాడలో ఉడా, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, అనధికార లేఅవుట్లను నియంత్రించాలని ఆదేశించారు. దీంతో ఉడా అధికారులు పాత లేఅవుట్లపై దృష్టి సారించారు. ఉడా పరిధిలో 2008 నుంచి 2014, మే నెల వరకు మొత్తం 476 లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారు. ఇటీవల భూ బదలాయింపునకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించని లే అవుట్లను గుర్తించారు. కృష్ణా జిల్లాలో అనుమతి పొందిన లే అవుట్లు 226 ఉండగా, వీటిలో 166 లే అవుట్లు నాలా ఫీజు చెల్లించలేదని నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో 157 లే అవుట్లు ఉండగా, వాటిలో 36 లేఅవుట్లకు సంబంధించి ‘నాలా’ ఫీజు చెల్లించలేదని గుర్తించారు. ‘నాలా’ ఫీజు వసూలు బాధ్యత రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో ఈ విషయంలో ఉడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం లే అవుట్లకు అనుమతులు నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.